తిరుపతి అర్బన్: తిరుపతి సెట్విన్ సీఈవోగా పనిచేస్తున్న యశ్వంత్‌కు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారిగా బాధ్యతలు అప్పగించారు. ఆ మేరకు ఆయన కలెక్టరేట్‌లోని సోషల్ వెల్పేర్ కార్యాలయంలో బాధ్యతలు స్వీకరించారు. జిల్లా సాంఘిక సంక్షేమశాఖ అధికారి హరీష్ శిక్షణ నిమిత్తం దీర్ఘకాలిక సెలవులో వెళ్లడంతో ఆ బాధ్యతలను సెట్విన్ సీఈవోకు అదనంగా అప్పగించారు.
రైలు కిందపడి
గుర్తుతెలియని మహిళ మృతి
సూళ్లూరుపేట: పట్టణం పరిధిలోని ఇసుకమిట్ట సమీపంలో దిగువ రైల్వేలైన్, గూడూరు–చైన్నె మార్గంలో సుమారు 50 నుంచి 55 సంవత్సరాల వయస్సు కలిగిన గుర్తుతెలియని మహిళ శుక్రవారం రైలు కిందపడి మృతి చెందింది. రైల్వే పోలీసుల కథనం.. గుర్తు తెలియని మహిళ తెలుపు రంగుపై బ్లూ కలర్ , ఫింక్ కలర్ పూల డిజైన్ కలిగిన చీర, తెలుపు రంగు జాకెట్, పసుపు రంగు లంగా ధరించి ఉంది. కుడి ఛాతీపై ఒక నల్లని పుట్టుమచ్చ, ఎడమ మో చేయి పైన పుట్టు మచ్చలు ఉన్నాయి. మృతురాలిని గుర్తించేందుకు ఎటువంటి ఆధారాలు దొరక్కపోవడంతో మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతురాలి ఆచూకీ తెలిసిన వారు రైల్వే పోలీస్ హెడ్‌కానిస్టేబుల్ కే శ్రీనివాసరావునను సంప్రదించాలని, లేదంటే 70360 43535, 95732 45266 నంబర్లలో సంప్రదించవచ్చని సూచించారు.
నేడు జాతీయ లోక్‌అదాలత్
తిరుపతి లీగల్ : తిరుపతి కోర్టు ఆవరణలో శనివారం ఉదయం 10.30 నుంచి జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్టు తిరుపతి మూడవ అదనపు జిల్లా జడ్జి, మండల న్యాయ సేవ అధికార సంస్థ చైర్మన్ ఎం.గురునాథ్ శుక్రవారం తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవ సంస్థ ఆదేశాల మేరకు ఈ జాతీయ లోక్‌అదాలత్‌ను నిర్వహించనున్నట్టు న్యాయమూర్తి పేర్కొన్నారు. కేసుల పరిష్కారం కోసం ఈ లోక్‌అదాలత్‌లో ఐదు బెంచులను ఏర్పాటు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఆ బెంచులకు అధ్యక్షులుగా తనతో పాటు తిరుపతి నాల్గవ అదనపు జిల్లా జడ్జి అర్చన, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి ఎస్‌పిడి.వెన్నెల, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి లెనిన్‌బాబు, మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి వ్యవహరిస్తారన్నారు. కోర్టులలో పెండింగ్‌లో ఉన్న సివిల్ కేసులు, రాజీ కాదగిన క్రిమినల్ కేసులు, వివాహ సంబంధ కేసులు, మోటార్ వాహన ప్రమాద కేసులు, వ్యాజ్యం వేయని కేసులు తదితర కేసులను ఈ లోక్ అదాలత్ లో పరిష్కరిస్తామన్నారు
గంజాయి కేసులో మహిళకు రిమాండ్
తిరుపతి లీగల్ : ఎస్వీ యూనివర్సిటీ పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు కిలోలకు పైగా గంజాయిని తరలిస్తున్న కేసులో చిత్తూరు, మంగసముద్రం, లెనిన్ నగర్‌కు చెందిన బి.లక్ష్మీదేవికి 14 రోజులపాటు రిమాండ్ విధిస్తూ తిరుపతి మొదటి అదనపు జూనియర్ సివిల్ జడ్జి రమాదేవి శుక్రవారం ఆదేశాలు జారీచేశారు.


