– యువకుడికి గాయాలు
సైదాపురం : గణేష్ నిమజ్జనం వేళ ఇద్దరి మధ్య వివాదం జరగడంతో ఓ యువకుడు మరో యువకుడిని కత్తితో దాడి చేసి గాయపరిచిన ఘటన మండల కేంద్రమైన సైదాపురంలో బుధవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్‌ఐ దుర్గాప్రసాద్ కథనం.. మండల కేంద్రమైన సైదాపురం బస్టాండు సమీపంలోని శ్రీ ఆంజనేయ స్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి గణేష్ విగ్రహంతో ఊరేగింపుగా నిమజ్జనానికి బయలు దేరారు. ఆ సమయంలో యువకులు డ్యాన్స్‌లు వేస్తుండగా పలవారి వెంకి కాలును డేగా మహేష్ తొక్కాడు. దీంతో ఇద్దరి మధ్య వివాదం చోటు చేసుకుంది. వెంకీ ఆగ్రహానికి గురై మహేష్‌పై కత్తితో దాడి చేశాడు. తీవ్రంగా గాయపడిన మహేష్ ప్రస్తుతం నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్టు ఎస్‌ఐ తెలిపారు.
నిందితుడికి యావజ్జీవ కారాగార శిక్ష
అమీర్‌పేట (హైదరాబాద్): చేపల వ్యాపారి హత్య కేసులో నింధితుడికి కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష, జరిమానా విధించింది. ఎస్‌ఆర్‌నగర్ ఇన్‌స్పెపెక్టర్ శ్రీనివాస్‌రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. ఏజీ కాలనీ సమీపంలోని వికాస్‌పురి కాలనీకి చెందిన చేపల వ్యాపారి పాంపరి రమేష్ (50) 2020 యూసుఫ్‌గూడ జవహర్‌నగర్‌లో హత్యకు గురయ్యాడు. ఫిబ్రవరి 1వ తేదీ సాయంత్రం బోరబండ వెళ్తున్నానని రమేష్ ఇంట్లో చెప్పి వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. అదే రోజు రాత్రి 8.30 గంటల సమయంలో ఆయన స్నేహితుడైన సాయి ఫోన్ చేయగా, తాను స్నేహితుడి ఇంట్లోనే ఉన్నానని రమేష్ తెలిపాడు. ఆ తర్వాత ఫోన్ స్విచ్ ఆఫ్ చేసి ఉండడంతో అనుమానం వచ్చిన కుమారుడు పాంపరి ప్రదీప్ 2వ తేదీన ఎస్‌ఆర్‌నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేసిన పోలీసులు 4వ తేదీన జవహర్‌నగర్‌లోని ఓ ఇంట్లో రమేష్ మృతదేహన్ని గుర్తించారు. కాళ్లను తాళ్లతో కట్టి, రెండు చేతులను నరికిన స్థితిలో మృతదేహం లభించింది.
డబ్బుల కోసం హత్య
తిరుపతి ఎస్.వి.నగర్‌కు చెందిన నిందితుడైన మూడే రాజునాయక్‌కు రమేష్‌తో గతంలో పరిచయం ఉంది. డబ్బుల కోసం రమేష్‌ను కిడ్నాప్ చేసి డిమాండ్ చేయాలని పథకం వేశాడు. ఇందులో భాగంగా యూసుఫ్‌గూడలో ఇంటిని అద్దెకు తీసుకుని, రమేష్‌ను మద్యం తాగేందుకు అక్కడికి పిలిచాడు. మద్యంలో నిద్రమాత్రలు కలపడంతో రమేష్ స్పృహ కోల్పోయాడు. అనంతరం సుత్తితో తలపై కొట్టి హత్య చేశాడు. రమేష్ వద్ద ఉన్న బంగారు గొలుసు, ఉంగరం, ఏటీఎం కార్డు, సెల్‌ఫోన్లు తీసుకున్నాడు. మృతదేహాన్ని గదిలో ఉంచి తాళం వేసి వెళ్లిపోయాడు. రమేష్ కోడలి సెల్‌కు వాట్సాప్ సందేశాలు పంపి, కిడ్నాప్ చేశానని, విడిచిపెట్టాలంటే రూ.90 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేసినట్లు విచారణలో తేలింది. శాసీ్త్రయ ఆధారాలతో నిందితుడిని అరెస్టు చేసి న్యాయస్థానంలో ప్రవేశపెట్టారు. నాంపల్లి నాలుగో అదనపు సెషన్స్ కోర్టులో నింధితుడిపై చార్జిషీట్ దాఖలు చేయగా జీవిత ఖైదుతో పాటు రూ.16 వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి జె.విక్రమ్ తీర్పు వెలువరించారు.


