తిరుపతి ఎడ్యుకేషన్ : నేషనల్ మీన్స్ కమ్ మెరిట్ స్కాలర్‌షిప్ (ఎన్‌ఎంఎంఎస్) పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ కేవీఎన్.కుమార్ తెలిపారు. నవంబర్ 15న నిర్వహించే ఈ పరీక్షకు జిల్లాలోని అన్ని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8వ తరగతి చదువుతూ వార్షిక కుటుంబ ఆదాయం రూ.3.5 లక్షల లోపున్న విద్యార్థులు అర్హులని తెలిపారు. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.బీఎస్‌ఈ.ఏపీ.జీఓవీ.ఇన్’ వెబ్‌సైట్ ద్వారా అక్టోబర్ 12వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని, అలాగే దరఖాస్తు రుసుమును ఓసీ, బీసీ విద్యార్థులు రూ.100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ.50 అక్టోబర్ 13వ తేదీలోపు ఎస్‌బీఐ కలెక్ట్ లింకు ద్వారా చెల్లించాలని పేర్కొన్నారు. నామినల్ రోల్‌ను సంబంధిత ప్రధానోపాధ్యాయులు ధృవీకరించి, ఆ ధృవపత్రాలను డీఈఓ కార్యాలయంలో అక్టోబర్ 14వ తేదీలోపు అందజేయాలని ఆయన సూచించారు.
రెండు బస్సులు ఢీ
– తప్పిన పెను ప్రమాదం
తడ: జాతీయ రహదారిపై రెండు బస్సులు ఢీకొన్న ఘటన మండలంలోని కొండూరు గ్రామం వద్ద గురువారం చోటు చేసుకుంది. వివరాలు.. టైర్ పంక్చర్ కావడంతో పరిశ్రమలకు కార్మికులను తరలించే బస్సు ఓ లారీ పక్కన రోడ్డుపై నిలిచిపోయింది. అదే సమయంలో తమిళనాడుకు ప్రయాణికులతో వెళుతున్న ట్రావెల్స్ బస్సు దాన్ని అంచనా వేయలేక కార్మికుల బస్సును ఢీకొట్టింది. ట్రావెల్స్ బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి.


