రాష్ట్ర గవర్నర్‌కు సాదర స్వాగతం | - | Sakshi
Sakshi News home page

రాష్ట్ర గవర్నర్‌కు సాదర స్వాగతం

Sep 18 2026 1:09 AM | Updated on Sep 18 2026 1:09 AM

రేణిగుంట: తిరుపతి జిల్లాలో రెండు రోజుల పర్యటనలో భాగంగా గురువారం రేణిగుంట విమానాశ్రయానికి చేరుకున్న ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర గవర్నర్‌ అబ్దుల్‌ నజీర్‌కు విమానాశ్రయంలో జిల్లా కలెక్టర్‌ డాక్టర్‌ ఎస్‌.వెంకటేశ్వర్‌, ఎస్పీ ఎల్‌.సుబ్బారాయుడు, తదితరులు సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం గవర్నర్‌ రోడ్డు మార్గాన తిరుపతికి బయల్దేరి వెళ్లారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు, సెట్విన్‌ సీఈఓ యస్వంత్‌, విమానాశ్రయ అధికారులు, తహసీల్దార్‌ శ్రావణ్‌కుమార్‌ పాల్గొన్నారు.

ఓపెన్‌ వర్సిటీ స్టడీసెంటర్‌ కో–ర్డినేటర్‌గా కిరణ్‌కుమార్‌

తిరుపతి సిటీ: ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాలలోని డాక్టర్‌ బీఆర్‌ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అధ్యయన కేంద్రం కో–ఆర్డినేటర్‌గా డాక్టర్‌ ఎం.కిరణ్‌కుమార్‌రాజు నియమితులయ్యారు. గతంలో ఉన్న డాక్టర్‌ జీ. కిషన్‌ ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌గా నియామకం కావడంతో ఆయన స్థానంలో డాక్టర్‌ కిరణ్‌కుమార్‌ రాజు గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్‌ ఓపెన్‌ యూనివర్సిటీ అధ్యయన కేంద్రాన్ని అందరి సహకారాలతో మరింత అభివృద్ధి పథంలో నడిపించేందుకు కృషి చేస్తానని తెలిపారు. అనంతరం ఎస్వీ ఆర్ట్స్‌ కళాశాల ప్రిన్సిపల్‌ డాక్టర్‌ కిషన్‌, వైస్‌ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ వై మల్లికార్జునరావు, డాక్టర్‌ ఎం.ప్రసాద్‌రావు, అధ్యాపకులు, సిబ్బంది ఆయనను ఘనంగా సత్కిరంచారు.

పోక్సో కేసులో నిందితుడి అరెస్ట్‌

నాయుడుపేట టౌన్‌ : పోక్సో కేసులో నిందితుడుగా ఉన్న మండల పరిధిలోని మేనకూరు గ్రామానికి చెందిన కందాటి నజీర్‌ను అరెస్టు చేసి గురువారం కోర్టులో హాజరు పరిచినట్టు నాయుడుపేట అర్బన్‌ సీఐ వెంకటేశ్వరరావు తెలిపారు. పోక్సో కేసు దర్యాప్తు చేస్తున్న నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సారథ్యంలో నజీర్‌ను పట్టణ పరిధిలోని శివాలయం సమీపంలో అరెస్టు చేసినట్లు వెల్లడించారు. ఏడేళ్ల చిన్నారులపై లైంగిక దాడి జరిపిన ఘటనపై నజీర్‌పై పోక్సో కేసు నమోదు చేసిన విషయం తెలిసిందె. గురువారం కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్‌ విధించినట్టు సీఐ పేర్కొన్నారు.

బీవీపాళెంలో పర్యటన

తడ: మండలంలోని బీవీపాళెం, సూళ్లూరుపేట మండలం అటకానితిప్ప, దొరవారిసత్రం మండలం నేలపట్టు గ్రామాల్లోని టూరిజం కేంద్రాలను రాష్ట్ర టూరిజం శాఖ కార్యదర్శి, ఐఏఎస్‌ అధికారి ఎస్‌ఎస్‌ రావత్‌ గురువారం పర్యటించారు. ఈ ప్రాంతాల్లో నెలకొల్పిన టూరిజం రిసార్టులు, టూరిస్టుల కోసం ఏర్పాటు చేసిన వసతులు కొనసాగుతున్న తీరును ఆయన పరిశీలించారు. ఆయన వెంట టూరిజం శాఖ ఎండీ తదితరులు ఉన్నారు.

పిచ్చి కుక్క బీభత్సం

– 13 మందిని కరిచిన శునకం

నాగలాపురం: నాగలాపురం పట్టణంలోని ఈస్ట్‌ దళితవాడలో గురువారం ఉదయం ఓ పిచ్చి కుక్క బీభత్సం సృష్టంచింది. వీధుల్లో తిరుగుతూ ఏకంగా 13 మందిని కరిచింది. కుక్క కాటుకు గురైన బాధితులు నాగలాపురం ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందారు. ఒకే ప్రాంతంలో వరుసగా పలువురిని కుక్క కరవడంతో స్థానికులు ఆందోళనలో పడ్డారు.

అప్పు ఇవ్వలేదని..!

– వివాహిత ఆత్మహత్యాయత్నం

వరదయ్యపాలెం: ఇచ్చిన అప్పు వసూలు కాక మనస్తాపానికి గురైన ఓ వివాహిత పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన వరదయ్యపాలెం మండలంలో గురువారం వెలుగు చూసింది. మండలంలోని సీఎల్‌ఎన్‌పల్లెకు చెందిన మౌనిక, ప్రవీణ్‌ దంపతులు ప్రస్తుతం వరదయ్యపాళెం ప్రకాశం వీధిలో నివాసం ఉంటున్నారు. కొంతకాలం క్రితం పట్టణంలోని బీసీ కాలనీ, బలిజపాలెం విద్యుత్‌ సబ్‌ స్టేషన్‌ సమీపంలోని రియల్‌ ఎస్టేట్‌ భూమి వ్యవహారంలో స్థానిక రియల్‌ ఎస్టేట్‌ వ్యాపారి, రాజకీయ నాయకుడికి రూ.40 లక్షలు అప్పుగా ఇచ్చినట్లు బాధితురాలు తెలిపింది. అయితే ఆ భూమి వివాదంలో చిక్కుకోవడంతో అప్పు తిరిగి చెల్లించడం లేదని ఆరోపిస్తున్నారు. పలుమార్లు ఇంటి చుట్టూ తిరిగినా రాజకీయ, అధికార బలంతో బెదిరిస్తున్నారని బాధితురాలు వాపోయింది. గతంలో పోలీస్‌ స్టేషన్‌లో పంచాయితీ జరిగి గడువు ఇచ్చినా అమలు కాలేదని పేర్కొంది. దీంతో మనస్తాపానికి గురై గురువారం ఇంట్లోనే పురుగుమందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు స్థానిక ప్రైవేట్‌ ఆస్పత్రికి తరలించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement