నాయుడుపేట టౌన్: మండల పరిధిలోని పండ్లూరు గ్రామ సమీపంలో జాతీయ రహదారి పక్కనే నిలబెట్టి ఉన్న ఆటోను వెనుక నుంచి వస్తున్న పాల లారీ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఓజిలి మండలం, ఆచర్ల పార్లపల్లి గ్రామానికి చెందిన రమేష్(32) తీవ్రగాయాలపాలై అక్కడికక్కడే మృతిచెందాడు. మరో కార్మికుడు సుబ్బయ్య పరిస్థితి విషమంగా ఉంది. ఆటోలో ఉన్న మరో ఐదుగురు కార్మికులకు గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం.. ఆచర్లపార్లపల్లి గ్రామం వద్ద నుంచి మండల పరిధిలోని అయ్యప్పరెడ్డిపాళెం గ్రామ సమీపంలో ఎంపీ షుగర్ పరిశ్రమ వద్ద చెట్లను నరికేందుకు కూలీలను తీసుకుని ఆటో బయలుదేరింది. పండ్లూరు గ్రామ సమీపంలోని జాతీయ రహదారి పక్కన నిలబెట్టుకుని కార్మికులకు టిఫిన్స్‌లు కట్టించుకునేందుకు ఇద్దరు కిందకు దిగారు. ఈ క్రమంలో గూడూరు వైపు నుంచి వేగంగా వస్తున్న పాల లారీ రోడ్డు పక్కన నిలబెట్టిన ఆటోను వెనుక నుంచి వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ క్రమంలో ఆటో పక్కన నిలబడి ఉన్న రమేష్ తలకు బలమైన గాయం కావడంతో అక్కడికక్కడే మృతిచెందాడు. సుబ్బయ్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఆటోలో ఉన్న మరో ఐదుగురు కూలీలకు రక్తగాయాలయ్యాయి. వీరిని 108 అంబులెన్స్‌తో పాటు హైవే అంబులెన్స్‌లలో నాయుడుపేట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి కారణమైన పాల లారీని అదుపులోకి తీసుకున్నారు. సుబ్బయ్యను మెరుగైన వైద్యం కోసం నెల్లూరుకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.


