శ్రీకాళహస్తి రూరల్: శ్రీకాళహస్తీశ్వరాలయ హుండీ ఆదాయం రూ.1,51,82,310 వచ్చినట్లు ఈవో బీకే వెంకటేశులు తెలిపారు. బుధవారం ఆలయ ఆవరణంలోని కొట్టు మండపంలో హుండీ కానుకలను లెక్కించారు. ప్రధాన హుండీలతో పాటు పరివార దేవతల వద్ద ఉన్న హుండీల ద్వారా బంగారం 22 గ్రాములు, వెండి 360 కేజీలు, విదేశీ కరెన్సీ నోట్టు 103 వచ్చాయి. ఈ కార్యక్రమంలో పాలకమండలి చైర్మన్ కొట్టే సాయి ప్రసాద్, ఆలయ అధికారులు పాల్గొన్నారు.
ముగిసిన గ్రంథాలయ జాతీయ సదస్సు
తిరుపతి సిటీ: ఎస్వీయూలో మూడు రోజుల పాటు నిర్వహించిన గ్రంథాలయ జాతీయ సదస్సు బుధవారం ముగిసింది. ఈ కార్యక్రమానికి ఎస్వీయూ రిజిస్ట్రార్ భూపతినాయుడు, శ్యాప్ చైర్మన్ రవినాయుడు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశంలో పలు విశ్వవిద్యాలయాల నుంచి గ్రంథాలయ మేధావులు ఇచ్చిన అతిథి ఉపన్యాసాలు ఎంతో ఉపయోగకరంగా, ఆధునికంగా ఉన్నాయని అలాగే వివిధ గ్రంథాలయాధికారులు, పరిశోధనా విద్యార్థులు సమర్పించిన పరిశోధనా పత్రాలు ఎంతో గుణాత్మకంగా ఉన్నాయని తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్‌లోని గ్రంథాలయాలను ఆధునీకరించవలసిన అవసరం ఏంతైనా ఉందని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం పౌర గ్రంథాలయాల అభ్యున్నతి కోసం ఎంతగానో పాటుపడుతుందని తెలియజేశారు. అమరావతిలో దేశంలోనే అతి పెద్ద గ్రంథాలయాన్ని నిర్మించడానికి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కంకణం కట్టుకుందని ఈ సందర్భంగా తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సెమినార్ డైరెక్టర్ డాక్టర్ కె. నాగేశ్వరరావు, ద్రవిడ విశ్వవిద్యాలయ మాజీ ఉపకులపతి ఆచార్య ఎం.దొరస్వామి, సెమినార్ ఆర్గనైజింగ్ సెక్రెటరీ ఆచార్య కొంగర సురేంద్రబాబు, గ్రంథాలయశాస్త్ర శాఖాధిపతి డాక్టర్ ప్రశాంత కుమారి, అధ్యాపకులు, పరిశోధకులు పాల్గొన్నారు.
తహసీల్దార్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
సూళ్లూరుపేట: సూళ్లూరుపేట పట్టణంలోని శ్రీచెంగాళమ్మ పరమేశ్వరి ఆలయం దక్షిణం వైపు ఆర్చి వద్ద జాతీయ రహదారిపై బుధవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో తహసీల్దార్ గోపాలకృష్ణకు తృటిలో ప్రమాదం తప్పింది. సూళ్లూరుపేట నుంచి చైన్నె వెళ్లేందుకు ఆర్చి వద్ద మలుపు తిరుగుతున్న సమయంలో నెల్లూరునుంచి చైన్నె వైపు వెళ్లే మినీ లారీ కారును ఢీకొట్టడంతో ప్రమాదం సంభవించింది. మినీ లారీ డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని తెలుస్తోంది. కారు ముందుభాగం నుజ్జు నుజ్జు అయింది. ప్రమాదం జరిగిన సమయంలో గోపాలకృష్ణ ఒక్కరు కారులో ఉండడంతో అదృష్టవశాత్తూ ఆయనకు ఎలాంటి గాయాలు లేకుండా ప్రమాదం నుంచి బయటపడ్డారు.


