స్వాతంత్య్ర దినోత్సవానికి ఒక రోజు ముందు భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బీఆర్ అంబేడ్కర్‌ను టీడీపీ నేతలు అవమానించారు. శుక్రవారం చంద్రగిరిలో ఎమ్మెల్యే పులివర్తి నాని ఆధ్వర్యంలో నిర్వహించిన డీఎస్పీ ఆత్మగౌరవ సభ కార్యక్రమంలో ఆ పార్టీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. ఈ మేరకు టవర్ క్లాక్ కూడలి వద్ద ఆ పార్టీ నేతలు వేదికను ఏర్పాటు చేసి.. కూడలిలోని అంబేడ్కర్ విగ్రహం కనిపించకుండా భారీ ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. దీనిపై స్థానిక ప్రజలు, దళిత సంఘం నేతలు మండిపడ్డారు. రాజకీయ స్వలాభం కోసం చేపట్టిన ఆత్మగౌరవ సభ సాక్షిగా అంబేడ్కర్‌ను అవమానించారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సాక్ష్యాత్తు ఒక శాసనసభ్యుడి ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అంబేడ్కర్‌ను అవమానించేలా అడ్డుగా బ్యానర్లు పెట్టడం సరికాదన్నారు. ఎమ్మెల్యే నాని వైఖరిపై దళిత నేతలు తీవ్రం మండిపడ్డారు.


