ఆత్మగౌరవం పోయింది నాని! | - | Sakshi
Sakshi News home page

ఆత్మగౌరవం పోయింది నాని!

Aug 15 2026 2:27 AM | Updated on Aug 15 2026 2:27 AM

డీఎస్సీ మెరిట్‌ విద్యార్థుల పేరుతో టీడీపీ చేపట్టిన ఆత్మగౌరవ ర్యాలీ అట్టర్‌ఫ్లాప్‌ ర్యాలీలో పాల్గొనని డీఎస్సీ మెరిట్‌ విద్యార్థులు వృద్ధులు, మహిళలు, విద్యార్థులతోనే ర్యాలీ పోలీసుల హడావుడితో వాహనదారులకు నానా ఇక్కట్లు జనస్పందన లేక ర్యాలీ వెనుకనే ఎమ్మెల్యే నాని అంతర్మథనంలో టీడీపీ శ్రేణులు

చంద్రగిరి: మెగా డీఎస్సీ మెరిట్‌ విద్యార్థుల ఆత్మగౌరవ ర్యాలీ అభాసుపాలైంది. భారీ అంచనాలతో చంద్రగిరిలో టీడీపీ నిర్వహించిన ర్యాలీ అట్టర్‌ఫ్లాప్‌ అయ్యింది. ర్యాలీకి జనంతోపాటు డీఎస్సీ మెరిట్‌ విద్యార్థులూ ముఖం చాటేయడం చర్చనీయాంశమైంది. టీడీపీకి అనుకూలమైన ప్రయివేటు కళాశాలల విద్యార్థులు, వయోవృద్ధులు, మహిళలతో మామ అనిపించాల్సిన దుస్థితి ఏర్పడింది. నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి బస్సులు, ఆటోలు పెట్టి జనం తరలించినా ప్రజా స్పందన లేకపోవడంతో స్థానిక ఎమ్మెల్యే నాని ఆత్మ పరిశీలన చేసుకోవాల్సి వచ్చింది. అనుకున్న సమయానికంటే ర్యాలీని దాదాపు రెండు గంటలు ఆలస్యంగా ప్రారంభించారంటే స్థానికంగా టీడీపీపై ప్రజావ్యతిరేక ఏ స్థాయిలో ఉందో అర్థమవుతోంది.

బస్సులు పెట్టినా.. డబ్బులు పంచుతామన్నా!

ర్యాలీని విజయవంతం చేసేందుకు నియోజకవర్గంలోని ఆరు మండలాల నుంచి బస్సులు ఏర్పాటు చేసినట్లు సమాచారం. మహిళలకు రూ.200, పురుషులకు రూ.300, యువకులకు రూ.500 వరకు ఇస్తామని చెప్పినా పెద్దగా స్పందన రాలేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. చంద్రగిరికి ఆనుకుని ఉన్న పీలేరు, పూతలపట్టు, చిత్తూరు ప్రాంతాల నుంచి కూడా జనాన్ని తరలించినట్లు ప్రచారం సాగుతోంది. సొంత నియోజకవర్గంలోనే ర్యాలీకి జనాన్ని సమీకరించుకోలేని పరిస్థితి టీడీపీకి ఎదురైంది.

పుస్తకాలకు బదులు ప్లకార్డులా?

విద్యార్థులు తరగతి గదుల్లో పుస్తకాలు పట్టుకోవాల్సిన సమయంలో.. వారి చేతుల్లో టీడీపీ ప్లకార్డులు పట్టించి రోడ్లపై తిప్పడం ఎంతవరకు సమంజసమని స్థానికులు చర్చించుకోవడం కనిపించింది. డీఎస్సీ మెరిట్‌ విద్యార్థుల పేరుతో నిర్వహించిన ర్యాలీలో ప్రైవేటు విద్యాసంస్థల కాలేజీ విద్యార్థులను బస్సుల్లో తరలించి నిసిగ్గుగా రాజకీయ కార్యక్రమానికి వినియోగించారన్న విమర్శలు ఎక్కుపెట్టారు. విద్యార్థుల చేతుల్లో పుస్తకాలు ఉండాలి.. రాజకీయ ప్లకార్డులు కాదంటూ పలువురు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

జనం లేకున్నా.. పోలీసుల హడావుడి!

ర్యాలీకి పెద్దగా జనస్పందన లేకపోయినా పోలీసులు మాత్రం భారీ ఆంక్షలు విధించారు. వాహనదారులకు ముచ్చెమటలు పట్టించారు. బైపాస్‌ రోడ్డు నుంచి చంద్రగిరి పట్టణంలోకి వచ్చే ద్విచక్ర వాహనాలను దారి మళ్లించారు. ర్యాలీ ప్రారంభ సమయం నుంచే బ్యారికేడ్లు పెట్టి దారి మూసివేయడం పట్ల స్థానికులు రగిలిపోయారు. ర్యాలీ రెండు గంటలు ముందే దారి మళ్లించడంపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. జనం లేని ర్యాలీకి ఇంత హడావుడి ఎందుకంటూ బహిరంగంగా ప్రశ్నించడం గమనార్హం.

డీఎస్సీ మెరిట్‌ అభ్యర్థుల ఆత్మగౌరవ ర్యాలీలో వారి జాడ కనిపించకపోవడం చర్చనీయాంశమైంది. వారి పేరుతో నిర్వహించిన కార్యక్రమంలో కాలేజీ విద్యార్థులు, వయోవృద్ధులు, మహిళలను ముందు పెట్టి ర్యాలీ నడిపించడం విస్మయానికి గురిచేసింది. చంద్రగిరి బైపాస్‌ రోడ్డు జంక్షన్‌ నుంచి క్లాక్‌ టవర్‌ వరకు సాగిన ర్యాలీ అడుగడుగునా జనం లేక వెలవెలబోయింది.

ర్యాలీని ముందుండి నడిపించాల్సిన ఎమ్మెల్యే పులివర్తి నాని జనస్పందన లేకపోవడంతో ర్యాలీ వెనుక నడిచి జనాన్ని ఉసిగొల్పే ప్రయత్నం చేశారన్న చర్చ సాగింది. ‘ఆత్మ గౌరవం’ ర్యాలీని చంద్రగిరి ప్రజలు తిరస్కరించడంతో ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. టీడీపీ నిర్వహించిన ర్యాలీ.. అధికార పార్టీ బలప్రదర్శనగా కాకుండా, జనస్పందన కోసం పడిన తంటాలే అధికంగా కనిపించాయి. టీడీపీకి క్షేత్ర స్థాయిలో ఎదురవుతున్న ప్రజావ్యతిరేకతకు ఇది నిదర్శనమని స్థానికులు చర్చించుకోవడం విశేషం.

తాగుతాం.. తలకిందులు చేస్తాం లోకేశం!

ర్యాలీలో మద్యం బాటిళ్ల కలకలం

ర్యాలీ పరిసరాల్లో మద్యం బాటిళ్లు కనిపించాయి. చదువుల తల్లి మెడలో మల్లెపూదండలాంటి ర్యాలీలో మద్యం బాటిళ్లు సందడి చేశాయి. ఒక చేతిలో ప్లకార్డు మరొక చేతిలో మద్యం బాటిల్‌ పట్టుకుని చాలా మంది హల్‌చల్‌ చేస్తూ తిరగడం.. ర్యాలీ సాగుతుండగానే సమీపంలోని మద్యం దుకాణాల ముందు బారులు తీరడం చర్చనీయాంశమైంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement