తిరుపతి మంగళం : లోకకల్యాణం కోసం, ప్రజలు సుభిక్షంగా జీవించడం కోసం వైదిక కార్యక్రమాలలో భాగంగా వరుణయాగం చేయడం టీటీడీ బాధ్యత అని టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి తెలిపారు. తిరుపతి పద్మావతిపురంలోని తన నివాసంలో శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడారు. దేశంలో వరుణదేవుడి ఆశీర్వాదంతో రైతులు సుభిక్షంగా ఉండాల, వారి పొలాలు తడవాల, ప్రజలంతా సుఖసంతోషాలతో జీవించాలని టీటీడీ వరుణయాగం చేయాలన్నారు. కూటమి ప్రభుత్వ పెద్దలకు ఊడిగం చేసుకుంటూ గత రెండున్నరేళ్లుగా టీటీడీ పాలకవర్గం, అధికారులు టీటీడీ వైదిక కార్యక్రమాలకు తిలోదకాలు వదిలేసి వరుణయాగం చేయాలన్న ఆలోచనే లేకుండా పోయిందన్నారు. దేశ సుభిక్షం కోసం వరుణయాగం చేయాలని తాను టీటీడీ పాలకులను, అధికారులను ప్రశ్నిస్తే తప్ప చేయాలన్న బాధ్యత మీకు లేదా అని ప్రశ్నించారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు తాండవిస్తుందని, సకాలంలో వర్షాలు కురవవని, ప్రజలు కరువుకాటకాలతో అల్లాడిపోతారని గుర్తుచేశారు. అలాంటి తరుణంలో వరుణయాగంతో పాటు యజ్ఞ యాగాలు చేయాల్సిన బాధ్యత టీటీడీతో పాటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా చంద్రబాబుకు లేదా? అని ప్రశ్నించారు. ఎంతసేపు దోచుకోవడం, దాచుకోవడం తప్ప రాష్ట్ర ప్రజల సంక్షేమాన్ని ఏనాడు పట్టించుకున్నారని ప్రశ్నించారు. దానికి తగ్గట్టుగా టీటీడీని కూడా టీడీపీ కేంద్రంగా మార్చేసుకుందని, అందుకే దేవుడి సేవకన్నా మీలాంటి ప్రభువుల సేవకే టీటీడీ పాలకులు, అధికారులు ఊడిగాలు చేసుకుంటూ వైదిక కార్యక్రమాలకు తిలోదకాలు వదిలేశారని ఆరోపించారు. తానే టీటీడీ అధ్యక్షుడిగా ఉన్నప్పుడు తిరుమలలో ఒక్కసారి, హైదరాబాద్‌లో ఒక్కసారి వరుణయాగం చేశానని గుర్తుచేశారు. అప్పటి ముఖ్యమంత్రిగా వైఎస్. రాజశేఖరరెడ్డి ఆ యాగంలో పాల్గొని కంకణం కూడా కట్టుకున్నారని గుర్తుచేశారు. ఇప్పటికై నా స్పందించి టీటీడీలో వరుణయాగానికి శ్రీకారం చుట్టడం ఎంతో సంతోషంగా ఉందన్నారు.


