హామీలకు రెండేళ్లు.. | - | Sakshi
Sakshi News home page

హామీలకు రెండేళ్లు..

Aug 15 2026 2:27 AM | Updated on Aug 15 2026 2:27 AM

● ఊసే లేని 12వ పీఆర్సీ ● మేనిఫెస్టో అమలులో విఫలం ● హామీల అమలుకు కదంతొక్కనున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు

ఉద్యోగుల జీతభత్యాలపై కూటమి కపట నాటకాలు

హామీలను నెరవేర్చాలి

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు సంబంధించిన ఆర్థిక పరమైన అంశాలపై ఎన్నికల ముందు ఇచ్చిన హామీలన్నింటినీ తక్షణమే ప్రభుత్వం నెరవేర్చాలి. 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటుచేసి 30 శాతం ఐఆర్‌ను ప్రకటించాలి. డీఏ, సరెండర్‌ లీవుల బకాయిలను వెంటనే చెల్లించాలి. చర్చల పేరిట కాలయాపన చేస్తే ఉద్యమిస్తాం. – ఎస్‌.బాలాజీ,

రాష్ట్ర కోచైర్మన్‌, ఏిపీజీఈఏ ఐక్యవేదిక జేఏసీ

ఆర్థికంగా నష్టపోతున్నాం

రాష్ట్ర ప్రభుత్వ చర్యలతో పెన్షనర్లమైన మేము ఆర్థికంగా నష్టపోతున్నాం. సకాలంలో పీఆర్సీని ఏర్పాటు చేయక, ఐఆర్‌ను ప్రకటించకపోవడం, డీఏ బకాయిలను చెల్లించకపోవడంతో ప్రతి పెన్షనర్‌ నెలకు సగటున రూ.10 వేలు నష్టపోతున్నారు. కుటంబ పోషణ, వైద్య ఖర్చులకు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాం. – మల్లవరం నారాయణ,

పెన్షనర్‌ (రిటైర్డ్‌ స్కూల్‌ అసిస్టెంట్‌), తిరుపతి

శ్వేతపత్రం అంతా బూటకం

రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 98శాతం జీతాల చెల్లింపుకే సరిపోతుందంటూ శ్వేతపత్రం విడుదల చేయడం అంతా బూటకం. గారడీ లెక్కలతో ప్రజలను బురిడీ కొట్టిస్తున్నారు. ప్రభుత్వ ఉద్యోగులపై ప్రజల్లో వ్యతిరేకతను పెంచేలా రాష్ట్ర ప్రభుత్వం వ్యవహరించడం సరికాదు. – సి.కుప్పయ్య,

హెచ్‌ఎం, మోడల్‌ ప్రైమరీ స్కూల్‌, సి.మల్లవరం

సరెండర్‌ లీవుల బకాయిలు ఇవ్వండి

ప్రతి ఉద్యోగి ఆర్జిత సెలవులను నగదుగా మార్చుకునేందుకు దాచుకున్న సరెండర్‌ లీవుల బకాయిలను వెంటనే ఇవ్వాలి. సొంత అవసరాలకు అక్కరకు వస్తుందన్న ఆశతో సరెండర్‌ లీవులు పెట్టుకుంటున్నాం. అయితే మే నెల, 2022నుంచి ఇప్పటి వరకు బకాయిలను చెల్లించకపోవడం అన్యాయం. – బి.మహేష్‌కుమార్‌, ఎస్‌జీటీ, తిరుచానూరు ఈస్ట్‌ ఎంపీపీఎస్‌ స్కూల్‌

తిరుపతి ఎడ్యుకేషన్‌ : 2024 ఎన్నికల ముందు ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఎన్నో హామీలు గుప్పించి తీరా అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వాటి అమలుపై ఆశించిన స్థాయిలో దృష్టి పెట్టలేదని పలువురు తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు. ప్రతి నెలా 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లిస్తామని చెప్పి 5వ తేదీలోపు చెల్లించి చేతులు దులుపుకుంటున్నారని మండిపడుతున్నారు. ఉద్యోగుల ఆర్థిక భవిష్యత్తుకు సంబంధించిన తక్కిన ప్రధాన హామీలు ఇంకా ప్రశ్నార్థకంగానే ఉన్నాయంటూ రగిలిపోతున్నారు.

12వ పీఆర్సీ ఎప్పుడో?

ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ)పై ఊసే లేదు. 12వ పీఆర్సీ 2023 జూలై నుంచి అమలు కావాల్సి ఉండగా, 2026జూలై పూర్తయినా దీనిపై కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోలేదు. గత ప్రభుత్వ హయాంలో నియమించిన పీఆర్సీ చైర్మన్‌ మన్మోహన్‌ రాజీనామా చేసి వెళ్లిపోయినప్పటికీ కొత్త చైర్మన్‌ నియామకాన్ని చేపట్టలేదు.

డీఏ బకాయిల పరిస్థితి ఏంటి?

ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్‌లో ఉన్నాయి. ఈ ఏడాది జూలై 1 నుంచి ఐదో డీఏ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ముందు పెండింగ్‌లో ఉన్న వేల కోట్ల రూపాయల డీఏ బకాయిలను చెల్లిస్తామని ఇచ్చిన హామీ రెండేళ్లు గడిచినా అప్పుడప్పుడు కొంత మొత్తాన్ని విడుదల చేసి చేతులు దులుపుకుంటున్నారని విమర్శిస్తున్నారు.

సరెండర్‌ లీవ్‌ బకాయిలు ఏమయ్యాయి?

2022మే నుంచి పెండింగ్‌లో ఉన్న సరెండర్‌ లీవ్‌ బకాయిలను ఇంతవరకు ఇవ్వలేదు. ఉద్యోగులు తమ సేవాకాలంలో సంపాదించుకున్న ఆర్థిక ప్రయోజనాలను పొందేందుకు ఏళ్ల తరబడి ఎదురుచూడాల్సి వస్తోంది.

గారడీ లెక్కలతో బురిడీ

ఈ నెల 4న కూటమి ప్రభుత్వం శ్వేతపత్రాన్ని విడుదల చేసింది. రాష్ట్ర ప్రభుత్వ ఆదాయంలో 98 శాతం ఉద్యోగుల జీతాలకే సరిపోతోందంటూ సీఎం చేసిన వ్యాఖ్యలపై మండిపడుతున్నారు. కాగ్‌ నివేదిక గణాంకాల ఆధారంగా 2022–23లో ఉన్న 64.62శాతం నుంచి ఏకంగా 98 శాతానికి ఎలా ఎగబాకిందో చెప్పాలని ప్రశ్నిస్తున్నారు. మిగిలిన 2శాతం ఆదాయంతోనే సంక్షేమ పథకాల అమలు ఎలా కొనసాగుతున్నాయో ప్రభుత్వం బహిరంగంగా ప్రకటించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

2024 ఎన్నికలకు ముందు టీడీపీ–జనసేన కూటమి నాయకులు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు హామీల వర్షం కురిపించారు. ఉమ్మడి మేనిఫెస్టోలో ఉద్యోగుల వెన్నంటే ఉంటామంటూ మాయమాటలు చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేర్చకపోవడంపై పలువురు ఉద్యోగులు, ఉపాధ్యాయులు రగిలిపోతున్నారు. గారడీ లెక్కలతో చంద్రబాబు ఉద్యోగులను బురిడీ కొట్టించే ప్రయత్నం చేస్తున్నారని ధ్వజమెత్తుతున్నారు. హామీల అమలుకు ఇక ఉద్యమమే శరణ్యమంటూ కార్యాచరణ ప్రణాళిక రచించే పనిలో నిమగ్నమయ్యారు. దీనిపై సాక్షి కథనం..

జిల్లా సమాచారం

అన్ని ప్రభుత్వ యాజమాన్య

పాఠశాలలు 2,365

విద్యార్థుల సంఖ్య 1,47,050

ఉపాధ్యాయులు 7,800

చర్చించినా ఫలితం లేదు

గత ఏడాది దీపావళికి ఒకరోజు ముందు కూటమి ప్రభుత్వం హడావుడిగా జాయింట్‌ స్టాఫ్‌ కౌన్సిల్‌ (జేఎస్‌సీ) సమావేశాన్ని నిర్వహించి ఉద్యోగ సంఘాలతో చర్చలు జరిపినప్పటికీ ఆర్థిక సమస్య లకు శాశ్వత పరిష్కారం చూపలేకపోయారు. ఉద్యోగుల అసంతృప్తి క్రమంగా పెరగడంతో ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన కార్యక్రమాలకు సిద్ధమయ్యాయి. ఈ ఏడాది జూలై 22న కూటమి ప్రభుత్వం మరోమారు ఉద్యోగ సంఘాల ప్రతినిధులను పిలిపించి సమస్యలపై చర్చించినా ఫలితం లేకుండా పోయింది.

ఎన్నికల ముందు కూటమి హామీలు

1. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెలా 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించడం. పెండింగ్‌ బకాయిలను క్లియర్‌ చేయడం. పెన్షనర్ల కార్పొరేషన్‌ ఏర్పాటుకు చర్యలు

2. ఉద్యోగులకు మెరుగైన పే రివిజన్‌ కమిషన్‌ (పీఆర్సీ) అమలు చేస్తాం

3.ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్‌) ప్రకటిస్తాం

4. ఉద్యోగులకు చెల్లించే అలవెన్సులను పునఃపరిశీలన చేస్తాం

5. కాంట్రిబ్యూటరీ పెన్షన్‌ స్కీమ్‌(సీపీఎస్‌), గ్యారెంటీడ్‌ పెన్షన్‌ స్కీమ్‌(జీపీఎస్‌) విధానాన్ని సమీక్షించి, ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తాం

6. ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల గౌరవాన్ని పునరుద్ధరించి, అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం

7. ప్రతి ఏటా జాబ్‌ క్యాలెండర్‌ విడుదల చేస్తాం, మెగా డీఎస్సీని నిర్వహిస్తాం

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement