తిరుపతి క్రైం : తిరుపతి జిల్లాలో గంజాయి అక్రమ రవాణా, విక్రయాలపై పోలీసులు కఠిన చర్యలు చేపట్టారు. తిరుచానూరు, తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ల పరిధిలో శుక్రవారం నిర్వహించిన రెండు వేర్వేరు దాడుల్లో 9 మందిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 18 కిలోల డ్రై గంజాయి, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై ఎన్‌డీపీఎస్ చట్టం–1985 కింద కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
తిరుచానూరులో 5 కిలోలు స్వాధీనం
తిరుచానూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పద్మావతిపురం శ్మశానం వద్ద శుక్రవారం ఉదయం పోలీసులు, రెవెన్యూ అధికారుల సమక్షంలో తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 5 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో అరుగొండం సోమశేఖర్, అక్కల రథసారథి, షేక్ ఫైరోజ్ అలియాస్ ఫైరు, పన్నూరు లీలాకృష్ణ, గురివింటి చరణ్‌తేజ ఉన్నారు. ప్రధాన నిందితుడు సోమశేఖర్ శ్రీకాళహస్తి ప్రాంతం నుంచి గంజాయి తీసుకొచ్చి తిరుపతి, రేణిగుంట పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తున్నట్లు దర్యాప్తులో తేలిందని పోలీసులు తెలిపారు.
వెస్ట్ పరిధిలో 13 కిలోలు
తిరుపతి వెస్ట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక నిఘాలో భాగంగా మెటర్నిటీ ఆస్పత్రి రోడ్డు, రాజన్న పార్కు వెనుక ప్రాంతంలో శుక్రవారం ఉదయం పోలీసులు నలుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 13 కిలోల డ్రై గంజాయి, నాలుగు సెల్‌ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కొండామర్రి జగదీష్, గొడ్ల పార్థసారథి అలియాస్ పార్థు, షేక్ ఇర్ఫాన్, బడి పోలయ్యగా గుర్తించారు. పోలయ్య విశాఖపట్నం ప్రాంతం నుంచి గంజాయిని తీసుకొచ్చి తిరుపతిలో విక్రయించేందుకు నిందితులకు అందిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైందని పోలీసులు తెలిపారు.
మాదకద్రవ్యాలపై నిఘా
కేసుకు సంబంధించిన వివరాలను తిరుపతి ఎస్పీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అదనపు ఎస్పీలు శ్రీనివాసులు (పరిపాలన), కె. రవిమనోహరాచారి (శాంతిభద్రతలు) వెల్లడించారు. జిల్లాలో గంజాయి, ఇతర మాదకద్రవ్యాల అక్రమ రవాణా, విక్రయాలు, వినియోగంపై కఠిన చర్యలు కొనసాగుతాయని తెలిపారు.


