శ్రీసిటీ 18 ఏళ్ల పారిశ్రామిక విజయగాథ
18 ఏళ్లలో రూ.53 వేల కోట్లకు పైగా పెట్టుబడులు, 75 వేల ఉద్యోగాలు
ఆదర్శ పారిశ్రామికవాడగా గుర్తింపు
శ్రీసిటీ (వరదయ్యపాళెం): దక్షిణ భారతదేశంలో పారిశ్రామిక విప్లవానికి నాంది పలికిన శ్రీసిటీ 18 వసంతాలను పూర్తి చేసుకుంది. ప్రపంచ స్థాయి మౌలిక సదుపాయాలతో అంతర్జాతీయంగా ఎదిగి, రాష్ట్రానికి, దేశానికి తలమానికంగా నిలిచింది. 8 వేలకు పైగా ఎకరాల్లో విస్తరించిన ఈ పారిశ్రామిక నగరంలో ప్రస్తుతం 31 దేశాలకు చెందిన 260కుపైగా దేశీయ, విదేశీ సంస్థలు కార్యకలాపాలు నిర్వహిస్తున్నాయి. ఇప్పటివరకు రూ.53 వేల కోట్లకు పైగా పెట్టుబడులు రాగా, రూ.57,500 కోట్లకు పైగా ఎగుమతులు జరిగాయి. దీని ద్వారా 75 వేల మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి లభించింది.
కూల్ క్యాపిటల్ ఆఫ్ ఇండియాగా శ్రీసిటీ
ఎయిర్ కండిషనర్ల తయారీలో శ్రీసిటీ దేశంలోనే అగ్రస్థానంలో ఉంది. డైకిన్, ఎల్‌జీ, బ్లూ స్టార్, క్యారియర్, హావెల్స్, లాయిడ్, అంబర్, ఈప్యాక్ డ్యూరబుల్ సహా పది ప్రధాన ఏసీ తయారీ సంస్థలు, 30కి పైగా విడి భాగాల కంపెనీలు ఇక్కడ ఉన్నాయి. తాజాగా ఎల్‌జీ ఎలక్ట్రానిక్స్, ఓజీ ఇండియా ప్యాకేజింగ్, సోలమ్ సంస్థలు కొత్త పెట్టుబడులు, విస్తరణలకు ముందుకు రావడంతో శ్రీసిటీకి ‘కూల్ క్యాపిటల్‘ హోదా మరింత బలపడింది. 2027 నాటికి దేశంలో ఉత్పత్తయ్యే ఎయిర్ కండిషనర్లలో దాదాపు 60 శాతం శ్రీసిటీ నుంచే రానున్నట్లు అంచనా. ఇసుజు, ఆల్స్టమ్, మోండెలీజ్, కోల్‌గేట్, కెలాగ్స్, కింబర్లీ–క్లార్క్ వంటి బహుళజాతి సంస్థలు కూడా ఇక్కడి నుంచి దేశీయ, విదేశీ మార్కెట్లకు ఉత్పత్తులను సరఫరా చేస్తున్నాయి. సముద్ర తీర పోర్టులు, అంతర్జాతీయ విమానాశ్రయాలు, ఎస్‌ఈజెడ్, ఎఫ్‌టీడబ్ల్యూజెడ్, ఎలక్ట్రానిక్స్ తయారీ క్లస్టర్ వంటి సౌకర్యాలు శ్రీసిటీ వృద్ధికి కీలకంగా నిలిచాయి.
విద్యా హబ్‌గా కొత్త అడుగు
పారిశ్రామిక ప్రగతితో పాటు విద్యారంగంలోనూ శ్రీసిటీ ముందడుగు వేస్తోంది. క్రియా, ట్రిపుల్ ఐటీ, ఐఎఫ్‌ఎంఆర్ బిజినెస్ స్కూల్, చిన్మయ, అకార్డ్ సీబీఎస్‌ఈ పాఠశాలలతో పాటు ఈ ఏడాది ప్రారంభమైన శ్రీసిటీ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఇందుకు నిదర్శనం. ‘వర్క్–స్టడీ‘ డ్యూయల్ మోడల్ ద్వారా పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి, ఉపాధి ఆధారిత విద్యను అందించడం విశేషం.
సీఎస్‌ఆర్‌తో సమగ్ర అభివృద్ధి
2009లో ఏర్పాటైన శ్రీసిటీ ఫౌండేషన్ ద్వారా ఇప్పటివరకు రూ.61 కోట్లకు పైగా సీఎస్‌ఆర్ నిధులు ఖర్చు చేశారు. 40కి పైగా పారిశ్రామిక భాగస్వాముల సహకారంతో విద్య, వైద్యం, తాగునీరు, పారిశుద్ధ్యం, నైపుణ్యాభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ కార్యక్రమాలు చేపట్టారు. ఐదు వేల మందికి పైగా స్థానిక యువతకు శిక్షణ ఇవ్వగా, మహిళా సాధికారత, పాఠశాలల్లో విద్యార్థుల హాజరు పెరగడం వంటి సానుకూల ఫలితాలు వచ్చాయి. ఈ నెల 6న మన్నూరు పోలూరులో రూ.42 లక్షలతో విద్యా వసతులు, గత ఏడాది నవంబర్‌లో సత్యవేడులో రూ.46 లక్షలతో బీసీ కళాశాల బాలుర వసతి గృహం నిర్మించడం వంటి కార్యక్రమాలు దీనికి ఉదాహరణలు.
పారిశ్రామిక ప్రగతికి మార్గదర్శిగా శ్రీసిటీ
ఓ మహానేత నాటిన చిన్న మొక్క నేడు మహావృక్షంగా మారింది. వెనుకబడిన ప్రాంతమైన సత్యవేడు నియోజకవర్గానికి ఆశాకిరణంగా నిలిచింది. శ్రీసిటీ పారిశ్రామికవాడ దేశంలోనే ఆదర్శ సెజ్‌గా రూపుదిద్దుకుంది. 2008 ఆగస్టు 8న అప్పటి ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చేతుల మీదుగా శ్రీసిటీ పురుడు పోసుకుంది. నిన్నటితో 18 ఏళ్ల ప్రస్థానాన్ని పూర్తి చేసుకుంది. ఆ మహాప్రస్థానంలో ఎన్నో విజయాలు సాధించి ఎందరికో ఉపాధి అవకాశాలు కల్పించిన శ్రీసిటీ విజయగాథ గురించి తెలుసుకుందాం.
పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చేందుకు కృషి
18 ఏళ్ల క్రితం ఈ ప్రాంతాన్ని సమగ్రంగా అభివృద్ధి చేయాలనే లక్ష్యంతో శ్రీసిటీకి శ్రీకారం చుట్టాం. నేడు అది ప్రపంచ గుర్తింపు పొందిన తయారీ కేంద్రంగా ఎదిగింది. పెట్టుబడిదారుల విశ్వాసం, ఉద్యోగుల అంకితభావం, ప్రభుత్వ సహకారంతోనే ఇది సాధ్యమైంది. మున్ముందు ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యానికి అనుగుణంగా ఏపీని ప్రపంచ పెట్టుబడుల గమ్యస్థానంగా మార్చడంలో శ్రీసిటీ కీలక పాత్ర పోషిస్తుంది. – డాక్టర్ రవీంద్ర సన్నారెడ్డి, మేనేజింగ్ డైరెక్టర్, శ్రీసిటీ


