చంద్రగిరి : గ్రామీణ ప్రాంతాల పురుషులకు చంద్రగిరిలో ఈ నెల 13వ తేదీ నుంచి 14 రోజుల పాటు సీసీ కెమెరా, సెక్యూరిటీ అలారమ్, స్మోక్ డిటెక్టర్‌పై ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించనున్నట్లు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ డైరెక్టర్ చంద్రశేఖర్ శనివారం తెలిపారు. తెల్ల రేషన్ కార్డు కలిగిన తిరుపతి, చిత్తూరు జిల్లాలకు చెందిన 19 ఏళ్ల నుంచి 50 ఏళ్ల పురుషులు శిక్షణకు అర్హులని వెల్లడించారు. కనీసం 10వ తరగతి ఉత్తీర్ణులై ఉండాలన్నారు. శిక్షణ సమయంలో ట్రైనీస్‌కి ఉచిత భోజనంతో పాటు హాస్టల్ సౌకర్యం కల్పించనున్నట్లు చెప్పారు. శిక్షణ అనంతరం సర్టిఫికెట్లు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగలవారు ఆధార్, రేషన్ కార్డు, ఎడ్యుకేషన్ ధ్రువీకరణపత్రం జిరాక్స్‌లతోపాటు 4 పాస్‌దృవీకరణ పత్రం జెరాక్స్ కాపీలు, 4 పాసుపోర్టు సైజు ఫొటోలతో సంస్థకి వచ్చి పేరు నమోదు చేయించుకోవాలని కోరారు. ముందుగా పేర్లు నమోదు చేసుకున్నవారికి ప్రాధాన్యత ఉంటుందని వెల్లడించారు. ఇతర వివరాలకు యూనియన్ బ్యాంక్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ సంస్థ, 11–48 ద్వారకానగర్ (రాయల్ విక్టరీ స్కూల్ దగ్గర) కొత్తపేట , చంద్రగిరి. ఫోన్: 79896 80587, 91775 43543, 63017 17672 నంబర్లతో సంప్రదించాలని పేర్కొన్నారు.
అర్ధరాత్రి లారీ బీభత్సం
చంద్రగిరి: అర్ధరాత్రి ఓ లారీ బీభత్సం సృష్టించింది. చిత్తూరు నుంచి తిరుపతికి కట్టెల లోడుతో వస్తున్న లారీ అర్ధరాత్రి సమయంలో ఎం.కొంగరవారిపల్లి వద్ద వస్తున్న క్రమంలో అదుపు తప్పి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. అపై పక్కన ఆపి ఉన్న కారును ఢీకొని, చిల్లర దుకాణంపైకి వెళ్లింది. పక్కనే ఉన్న ద్విచక్ర వాహనాన్ని ధ్వంసం చేసింది. ఈ ప్రమాదంలో కారు ధ్వంసం కాగా, దుకాణం పాక్షికంగా దెబ్బతింది. అర్ధరాత్రి సమయంలో దుకాణంలో ఎవరూ లేకపోవడంతో ఎలాంటి ప్రాణ నష్టం జరగలేదు. అయితే లారీ డ్రైవరు మద్యం మత్తులో ఉండడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందని స్థానికులు చెబుతున్నారు. లారీ డ్రైవరు, క్లీనర్లను పట్టుకున్న స్థానికులు వారికి దేహశుద్ధి చేసి, పోలీసులకు అప్పగించారు. పోలీసులు లారీ డ్రైవరు, క్లీనర్లను అదుపులోకి తీసుకుని పోలీసు స్టేషన్‌కు తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.
ఐఐటీలో ఎన్‌పీటీఈఎల్ స్టార్ ఇంట్రాక్షన్–2026
ఏర్పేడు: ఏర్పేడు సమీపంలోని తిరుపతి ఐఐటీలో శనివారం మద్రాస్ ఐఐటీలో కలసి సంయుక్తంగా ‘ఎన్‌పీటీఈఎల్ స్టార్ ఇంట్రాక్షన్ –2026’ కార్యక్రమాన్ని నిర్వహించారు. తిరుపతి ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కె.ఎన్.సత్యనారాయణ, కాంపిటెన్సీ డెవలప్‌మెంట్ – అవుట్‌రీచ్’ విభాగం డీన్ ప్రొఫెసర్ అరుణ్‌కుమార్ తంగిరాల ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ప్రసంగించారు. మద్రాస్ ఐఐటీ కోడ్ విభాగం చైర్ ప్రొఫెసర్ ఆండ్రూ తంగరాజ్ ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. ఐఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ కేఎన్ సత్యనారాయణ మాట్లాడుతూ డిజిటల్ అభ్యాసం, ఆన్‌న్‌లైన్ విద్య గురించి వివరించారు. విద్యా రంగాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న 400 మందికి పైగా అభ్యాసకులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.


