గన్‌మెన్ల కోసం జేబీ నాటకం | - | Sakshi
Sakshi News home page

గన్‌మెన్ల కోసం జేబీ నాటకం

Aug 9 2026 12:17 AM | Updated on Aug 9 2026 12:17 AM

● మీ పార్టీ వారే నీకు టార్గెట్‌ పెట్టారని గుర్తించుకో ● వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి

తిరుపతి అన్నమయ్యసర్కిల్‌: బీజేపీకి చెందిన ఒక్కరు తనకు ప్రాణహాని ఉందని, గన్‌మెన్లకు అనుమతి తీసుకున్న విధానాన్ని అనుసరిస్తూ టీటీడీ ఇన్‌చార్జి జేబీ శ్రీనివాస్‌ సరికొత్త నాటకాన్ని ప్రదర్శించి గన్‌మెన్లను పెట్టుకునేందుకు చేసిన ప్రయత్నాలు అందరికీ తెలిశాయని వైఎస్సార్‌సీపీ వైఎస్సార్‌సీపీ నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్రారెడ్డి ధ్వజమెత్తారు. శనివారం ఆయన ప్రెస్‌క్లబ్‌లో పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి ఆరె అజయ్‌కుమార్‌తో కలసి మాట్లాడారు. టీటీడీ అధిష్టానం వలస వచ్చిన జేబీ శ్రీనివాస్‌ ఆనే ఆకు రౌడీకి ఇన్‌చార్జి పదవి ఇచ్చి తప్పు చేసిందన్నారు. ఆ పార్టీలో సీనియర్లు ఉన్నా జేబీకి పదవిని కట్టబెట్టడంతో వారికే టార్గెట్‌గా మారారని తెలిపారు. పదవి అడ్డుపెట్టకుని అహంకారంతో రెచ్చిపోతున్న జేబీ శ్రీనివాస్‌ తీరుకు బాధితులు వారి ఇంటి వద్ద నిరసన చేస్తుండగా మీడీయా కవరేజీకి వెళిన సంజీవ్‌ సునీల్‌, సాక్షి ఫొటోగ్రాఫర్‌ మోహన్‌కృష్ణపై దాడి చేయడం బాధాకరమన్నారు. పైపెచ్చు దాడి చేసిన జేబీ శ్రీనివాస్‌ అనుచరులే చేతులకు గాయాలు చేసుకుని తమ నేత జేబీపై హత్యాయత్నానికి వచ్చారంటూ పోలీసు కేసు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. ఆ సమయంలో దగ్గరుండి దర్జాగా విలేకరి సంజీవ్‌సునీల్‌ను పోలీసులకు అప్పగించిన ఆయన మరుసటి రోజున చేతికి పెద్దగా కట్టుకట్టుకుని ఫొటోలకు ఫోజులివ్వడం దేనికి సంకేతమని ప్రశ్నించారు. బలిజ కులం అడ్డుపెట్టకుని ఆ కోటాలో ఇన్‌చార్జి పదవి పొందిన జేబీ శ్రీనివాస్‌ అనుచరుల చేతిలో దాడికి గురైన వారు బలిజ సోదరులే కదా కనీసం కమ్యూనిటీ ఫీలింగ్‌ కూడా లేకుండా దాడి చేయడాన్ని ఖండించారు. దొంగ నాటకాలు ప్రదర్శించినంత మాత్రాన ప్రజలు నమ్ముతారని భావించడం ఆయన మూర్ఖత్వానికి నిదర్శమన్నారు. ఈ వ్యవహారం తెలిసి పరామర్శించేందుకు ఆ పార్టీ జిల్లా అధ్యక్షురాలు, కేంద్ర మాజీ మంత్రి పనబాకలక్ష్మి, ఎమ్మెల్యేలు ఆరణి, మురళీమోహన్‌లు పరుగెత్తారన్నారు. వీరికి ఏ మాత్రం గౌరవం అనేది లేకుండా ఆరోగ్యకరంగా ఉన్న జేబీ శ్రీనివాస్‌ దర్జాగా కూర్చోని మాట్లాడుతున్న తీరు మీడియాలో చూస్తున్న అందరికీ అర్ధమైందన్నారు. చౌకబారు వ్యవహారాలను పక్కన పెట్టి నగరాభివృద్ధితో పాటు ప్రజాసేవకు దోహదపడాలన్నారు. అలా కుదరదని నా రూటులోనే వెళ్లతామంటే ప్రతిపక్షంలో ఉన్న తాము ప్రశ్నించడంతో పాటు మీ రౌడీయిజాన్ని అడ్డుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో వైఎస్సార్‌సీపీ బీసీ విభాగం కార్యదర్శి మహేష్‌, నగర మహిళా విభాగం అధ్యక్షురాలు విజయలక్ష్మి పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement