తిరుపతి అర్బన్: జిల్లా వ్యాప్తంగా పంద్రాగస్టుకు పటిష్ట ఏర్పాట్లు చేపట్టాలని కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం ఆయన తిరుపతిలోని తమ బంగ్లా నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఎస్పీ సుబ్బరాయుడు, జాయింట్ కలెక్టర్ గోవిందరావు, ఇన్‌చార్జి తిరుపతి కార్పొరేషన్ కమిషనర్ శారదాదేవి, డీఆర్వో నరసింహులుతోపాటు పలువురు అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తక్కువ సమయం ఉన్న నేపథ్యంలో అధికారులు సమష్టిగా పని చేయాలని చెప్పారు. స్వాతంత్య్ర దినోత్సవ సంబరాలు తిరుపతిలో జరుపుకోవడానికి అంతా సహకరించాలని కోరారు.
నేడు ఇంజినీరింగ్ సీట్ల కేటాయింపు
తిరుపతి సిటీ: ఈఏపీసెట్–2026 తొలి విడత కౌన్సెలింగ్‌లో భాగంగా ఇప్పటికే రిజిస్ట్రేషన్‌తో పాటు వెబ్‌ఆప్షన్ల ప్రక్రియ పూర్తి కావడంతో ర్యాంకుల ఆధారంగా ఇంజినీరింగ్ కోర్సుల్లో సీట్లు పొందిన విద్యార్థుల మెరిట్ లిస్ట్‌ను సాంకేతిక విద్యాశాఖ ఆదివారం విడుదల చేయనుంది. విద్యార్థులు రిజిస్ట్రేషన్ సమయంలో పొందుపరిచిన మొబైల్ నంబర్లకు ఈ మేరకు సమాచారం పంపనున్నారు. ఆయా కళాశాలల్లో సీట్లు పొందిన విద్యార్థులు 15వ తేదీలోపు రిపోర్ట్ చేసి ప్రవేశాలు పొందాల్సి ఉంటుంది.
రేపటి వరకు
స్పాట్‌కు అవకాశం
తిరుపతి సిటీ: జిల్లాలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో మిగిలి ఉన్న సీట్లకు స్పాట్ అడ్మిషన్ల గడువును సోమవారం వరకు పొడిగించినట్లు అధికారులు తెలిపారు. విద్యార్థుల, తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు గడువు పొడిగించినట్టు వెల్లడించారు.


