మైమరపించిన ‘సంకీర్తన’
తిరుమల : తిరుమలలోని నారాయణగిరి ఉద్యానవనాలు ఆదివారం సాయంత్రం పురంధరదాసు కీర్తనలతో మార్మోగాయి. పురంధరదాసు ఆరాధన మహోత్సవాలు రెండో రోజుకు చేరుకున్నాయి. ముందుగా శ్రీవారు ఉభయదేవేరులతో కలిసి నారాయణగిరి ఉద్యానవనాలకు వేంచేపు చేశారు. ఊంజల్‌సేవలో సేదతీరారు. ఈ సందర్భంగా దాస సంకీర్తనల గానం భక్తులను మైమరపించింది. టీటీడీ దాససాహిత్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన ఈ కార్యక్రమంలో దాస భక్తులు సామూహికంగా పురంధరదాసు కీర్తనలు ఆలపించారు. ప్రాజెక్టు ప్రత్యేకాధికారి ఆనందతీర్థాచార్యులు, డిప్యూటీ ఈఓ లోకనాథం, 3,500 మందికి పైగా భజన మండలి సభ్యులు పాల్గొన్నారు.
వేర్వేరు చోట్ల
రెండు పూరిళ్లు దగ్ధం
కేవీబీపురం/రాపూరు : కేవీబీపురం మండలంలోని అంజూరు ఎస్సీ కాలనీ, రాపూరు మండలం తూమాయి ఆర్‌ఆర్ సెంటర్ దళితవాడలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రెండు పూరిళ్లు దగ్ధమయ్యాయి. వివరాలు.. అంజూరు ఎస్సీకాలనీలోని జరిగిన అగ్నిప్రమాదంలో ఇంట్లోని బీరువా, దుస్తులు, వస్తువులు, మంచాలతోపాటు రూ.2లక్షల నగదు కాలిపోయినట్లు బాధితుడు పల్లమాల కాటయ్య తెలిపారు. నాలుగు గేదెలను అమ్మగా వచ్చిన నగదును ఇంట్లో ఉంచానని, ఈ ప్రమాదంతో తీవ్రంగా నష్టపోయానని విలపించారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. అలాగే తూమాయి ఆర్‌ఆర్‌సెంటర్ దళితవాడలో సంభవించిన అగ్నిప్రమాదంలో ఇంటితోపాటు నగదు, బియ్యం, దుస్తులు కాలిపోయినట్లు బాధితుడు తూమాటి అశోక్ తెలిపారు.
వందేభారత్‌కు అదనపు బోగీలు
తిరుపతి అన్నమయ్యసర్కిల్ : తిరుపతి – సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ ఎక్స్‌ప్రెస్ రైలుకు బోగీల సంఖ్యను పెంచారు. ప్రయాణికుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ రైలు టికెట్లకు భారీ డిమాండ్ ఉంటోంది. దీంతో అదనంగా బోగీలను పెంచాలని రైల్వేశాఖ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు 16 నుంచి 20 బోగీలను పెంచింది.
గుర్తు తెలియని వృద్ధుడి మృతి
పాకాల : పాకాల– నేండ్రగుంట మార్గంలోని ఉప్పువంక వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన ఘటన ఆదివారం చోటు చేసుకుంది. స్థానికులు కథనం మేరకు.. సుమారు 60 ఏళ్ల వృద్ధుడు రైల్వే ట్రాక్ పక్కన మృతి చెంది పడి ఉన్నాడు. దీనిపై పోలీసులకు సమాచారం అందించారు.
ఒంటరి ఏనుగు హల్‌చల్
పాకాల: మండలంలోని పదిపుట్లబైలు వద్ద ఒంటరి ఏనుగు హల్‌చల్ చేస్తూ స్థానికులను భయభ్రాంతులకు గురిచేస్తోంది. రెండు మూడు రోజులుగా ఒంటరి ఏనుగు పదిపుట్లబైలు, పేరసానిపల్లి పరిసర ప్రాంతాల్లోని పంట పొలాల మధ్య సంచరిస్తోందని రైతులు వాపోతున్నారు. దీంతో పొలాల వద్దకు వెళ్లాలంటే భయంగా ఉందని చెబుతున్నారు. రెండు నెలల క్రితం ఇదే విధంగా ఒంటరి ఏనుగు సంచరించి రైతులను భయబ్రాంతులకు గురి చేసింది. ఆ సమయంలో అటవీశాఖ అధికారులు ఏనుగును గుర్తించి దారి మళ్లించారు. ప్రస్తుతం ఒంటరి ఏనుగు మళ్లీ హల్‌చల్ చేస్తుండడంతో ఎప్పుడు దాడి చేస్తుందోనని స్థానికులు ఆందోళన చెందుతున్నారు. అటవీశాఖ అధికారులు చర్యలు చేపట్టి ఒంటరి ఏనుగును దారి మళ్లించాలని కోరుతున్నారు.
మళ్లీ కాలువ భూమి ఆక్రమణ!
రేణిగుంట: మండలంలోని కృష్ణాపురంలో ఆక్రమణదారులు మళ్లీ రెచ్చిపోయారు. గత నెల రాళ్ల కాలువ భూమిని కొందరు చదును చేసి ఆక్రమించేందుకు యత్నించడంతో సమాచారం అందుకున్న తహసీల్దార్ చంద్రశేఖర్ రెడ్డి తమ సిబ్బందిని పంపించి ఆక్రమణ పనులను అడ్డుకున్నారు. జేసీబీతో కాలువ తవ్వించారు. అయితే పండుగల సమయంలో ఆక్రమణదారులు మళ్లీ తెగబడ్డారు. గుట్టుగా కాలువను చదును చేశారు. ఇది ఆదివారం తహసీల్దార్ దృష్టికి రావడంతో స్పందించారు. ఆయన ఆదేశాలతో వీఆర్వో సాయికుమార్ ఆక్రమణ ప్రదేశాన్ని పరిశీలించారు. జేసీబీతో కాలువను యధావిధిగా తవ్వించారు. ఆక్రమణలకు ఎవరు పాల్పడినా సహించేది లేదని, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ హెచ్చరించారు.
మైమరపించిన ‘సంకీర్తన’
మైమరపించిన ‘సంకీర్తన’
మైమరపించిన ‘సంకీర్తన’


