
రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రణాళిక
చిల్లకూరు:రైల్వేస్టేషన్లను అత్యాధునికంగా అభివృద్ధి చేసేందుకు రైల్వేశాఖ ప్రణాళిక సిద్ధం చేస్తున్నట్లు రైల్వే డీఆర్‌ఎం మోహిత్ తెలిపారు. బుధవారం గూడూరు రైల్వేస్టేషన్‌ను ఆయన తనిఖీ చేశారు. డీఆర్‌ఎం మాట్లాడుతూ ప్రయాణికులకు పకడ్బందీగా మౌలిక వసతులు కల్పిస్తున్నట్లు వెల్లడించారు. గూడూరు రైల్వేజంక్షన్ ఆధునికీకరణకు చర్యలు చేపట్టనున్నట్లు వివరించారు. ప్లాట్‌ఫామ్‌పై క్యాంటిన్‌లతోపాటు రైల్వే ట్రాక్‌లను పరిశుభ్రంగా తీర్చిదిద్దాలని అధికారులను ఆదేశించారు. రెండో పట్టణం వైపు సైతం టికెట్ కౌంటర్‌ను త్వరలోనే ప్రారంభించనున్నట్లు తెలిపారు. అనంతరం కృష్ణపట్నం పోర్టుకు వెళ్లే రైల్వే మార్గం తనిఖీ చేశారు. స్టేషన్ మేనేజర్ వెంకటేశ్వరరావు పాల్గొన్నారు.
గాయపడ్డ లారీ డ్రైవర్ మృతి
నాయుడుపేట టౌన్ : పట్టణ పరిధిలోని అంబేడ్కర్ విగ్రహం సమీపంలో రహదారిపై మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతున్న లారీ డ్రైవర్ మస్తానయ్య(56) బుధవారం మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు.. కసుమూరు గ్రామానికి చెందిన మస్తానయ్య లారీలో ధాన్యం లోడింగ్ కోసం నాయుడుపేటకు వచ్చాడు. మంగళవారం రాత్రి మరో ఇద్దరు డ్రైవర్లతో కలిసి అంబేడ్కర్ విగ్రహం సమీపంలోని రహదారిపై నడిచి వస్తున్నారు. ఈ క్రమంలో ఓజిలి మండలం కర్రబల్లవోలు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ అంకయ్య ఆటోను వేగంగా ముగ్గురిని ఢీకొన్నాడు. దీంతో ఆటో అంకయ్యపై పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. పరిస్థితి విషమంగా ఉండడంతో నెల్లూరుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు. దీంతో పోలీసులు కేసు నమోదు చేశారు.

రైల్వేస్టేషన్ల అభివృద్ధికి ప్రణాళిక