
ఇండియాకు ఆడాలన్నదే లక్ష్యం
తిరుపతి ఎడ్యుకేషన్ : ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచి క్రికెటర్లు ఇండియాకు ఆడాలన్నదే లక్ష్యమని చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు, ఏసీఏ జాయింట్ సెక్రటరీ విజయ్‌కుమార్ తెలిపారు. తిరుపతిలోని ఓ హోటల్‌లో నిర్వహించిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాతో పాటు రాష్ట్రంలో క్రికెట్‌ను అన్ని విధాలుగా అభివృద్ధి చేయడానికి కృషి చేస్తానని పేర్కొన్నారు. అన్ని కేటగిరిల్లో క్రికెటర్లకు మ్యాచులు నిర్వహించి వారి ప్రతిభను నిరూపించుకునేందుకు అవకాశాలు కల్పిస్తున్నట్లు తెలిపారు. అనంతరం ఇటీవల కడపలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి పోటీల్లో ఛాంపియన్స్‌గా నిలిచిన అండర్–16 బాయ్స్ జట్టు, అలాగే అనంతపురంలో నిర్వహించిన సౌత్ జోన్ ఛాంపియన్స్ పోటీల్లో ఛాంపియన్స్‌గా నిలిచిన అండర్–23 సీనియర్స్ ఉమెన్స్ జట్టు సభ్యులను సన్మానించారు. కార్యక్రమంలో సీడీసీఏ కార్యదర్శి రవి, కోశాధికారి గిరి ప్రకాష్, ఉపాధ్యక్షుడు శ్రీనివాసమూర్తి, శ్రీధర్, జాయింట్ సెక్రటరీ సతీష్ యాదవ్, సభ్యులు, క్రికెటర్లు పాల్గొన్నారు.