ప్రయాణికుల భద్రత ప్రశ్నార్థకం
నిఘానేత్రం.. నామమాత్రం
ప్రయాణికులే లక్ష్యంగా చోరీలు
ఫోన్లు, బ్యాగ్‌లు, మెడలో చైన్‌లే టార్గెట్
రాత్రివేళలో చెలరేగుతున్న గంజాయ్ బ్యాచ్
ప్రశ్నిస్తే దాడులు చేస్తున్నారంటున్న ఉద్యోగుల ఆవేదన
ఆందోళనలో ఆర్టీసీ ప్రయాణ
తిరుపతి ఆర్టీసీ బస్టాండుల్లో ప్రయాణికుల భద్రత గాల్లో దీపంలా మారింది. ఇక్కడికి రాష్ట్ర వ్యాప్తంగా యాత్రికులు వస్తుంటారు. రాత్రిపూట ప్రయాణికులు బస్టాండులో ఉన్నంత సేపు భయ భయంగా గడపాల్సిన దుస్థితి దాపురించింది. ఎటు వైపు నుంచి దొంగలు వచ్చి మీద పడతారో.. ఏ వైపు నుంచి గంజాయి మత్తులో ఏం చేస్తారోనని ప్రాణాలు అరచేతిలో పట్టుకొని బిక్కుబిక్కుమంటూ కాలం వెళ్లదీస్తున్నారు.. మరుగుదొడ్లకు వెళ్లాలంటేనే ఇక నరకానికి పోయినంత పని అవుతోంది.. ముక్కుపుటాలు అదిరేలా దుర్వాసన వెదజల్లుతున్నాయి. సీసీ కెమెరాలు ఉన్నా లేనట్లే.. తిరుపతి బస్టాండుల్లో సమస్యలు తాండవిస్తుండంతోప్రయాణికుల అవస్థలు వర్ణనాతీతం.
తిరుపతి అర్బన్ : ఆధ్యాత్మిక నగరంలోని ఆర్టీసీ బస్టాండుల్లో భద్రత కొరవడింది. రాత్రీ పగలు తేడా లేకుండా చోరీలు జరుగుతున్నాయి. ప్రధానంగా రాత్రి సమయంలో గంజాయి బ్యాచ్ ఏడుకొండల బస్టాండ్‌తో పాటు శ్రీహరి, శ్రీనివాస, పల్లెవెలుగు బస్టాండ్లలలో బీభత్సం సృష్టిస్తున్నారు. ఎవరు మీరు ఎందుకు బస్టాండుల్లో ఉన్నారు..ఏ ఊరికి వెళ్లాలి అని ప్రశ్నించడానికి ఆర్టీసీ కంట్రోలర్స్‌కు ధైర్యం చాలడం లేదు. దీంతో ప్రయాణికులు తమ బస్సు వచ్చే వరకు బిక్కుబిక్కుమంటూ ఉండాల్సిన దుస్థితి దాపురించింది. కొందరు బిచ్చగాళ్ల వలే ఉంటూ ఒక్కసారిగా ప్రయాణికులను దోపిడీ చేస్తున్నారు. బస్టాండ్‌లోని సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో చోరీల సమాచారం పోలీసులకు తెలియజేసినా ప్రయోజనం ఉండడం లేదు.
కంపుకొడుతున్న మరుగుదొడ్లు
తిరుపతి బస్టాండ్‌లో వసతులు అధ్వాన్నంగా ఉన్నాయి. ఓ వైపు పలు మరుగుదొడ్లు మూతవేశారు. ఉన్న మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. తాగునీటి సమస్యలు తప్పడం లేదు. పలు కొళాయిలు పనిచేయడం లేదు. పలు ఫ్యాన్లు తిరగడం లేదు. కుర్చీలు అంతంతమాత్రమే ఏర్పాటు చేశారు. మరోవైపు శ్లాబ్ నుంచి పెచ్చులు ఊడిపడుతున్నాయి. ఈ సమస్యలు చాలదంటూ చోరీలు చోటుచేసుకుంటున్నాయి. దీంతో ప్రయాణికులు బిక్కుబిక్కుమంటూ తమ బస్సు వచ్చే వరకు భయభయంగా ఉంటున్నారు.
ప్రయాణికులకు భద్రత కల్పించాలి
ప్రధానంగా తిరుపతి బస్టాండ్‌లో గంజాయి, అసాంఘిక కార్యకలాపాలను కట్టడి చేయాల్సి ఉంది. గంజాయి తాగి పలువురు వ్యక్తులు బస్టాండల్లో ఉంటున్నారు. ప్రధానంగా రాత్రి సమయంలో భయం భయంగా బస్టాండ్లులో ఉండాల్సిన దుస్థితి నెలకొంది. ఉన్నతాధికారులు స్పందించి భద్రత కల్పించాలని కోరుతున్నాం.
–మణి, ప్రయాణికుడు, తిరుపతి
ఆందోళనతో గడుపుతున్నాం
జిల్లా కేంద్రమైన తిరుపతి నగరంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో ప్రయాణికులకు సరైన భద్రత లేదు. దీంతో ఆందోళన తప్పడం లేదు. ప్రధానంగా సీసీ కెమెరాలు సక్రమంగా పనిచేయడం లేదు. దీంతో దొంగలను గుర్తించడం కష్టంగా మారుతోంది. ప్రతి ప్లాట్‌ఫాం వద్ద ఒక సీసీ కెమెరాను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది.
– రెడ్డప్ప, ప్రయాణికుడు, తిరుపతి
కనీస వసతులు లేవు
తిరుపతి బస్టాండ్‌లో దుకాణదారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి వస్తువులను విక్రయిస్తున్నారు. వాటిని అదుపు చేయడం లేదు. తమకు కేటాయించిన స్థలంలో కాకుండా అదనపు స్థలాన్ని ఆక్రమించుకుని వ్యాపారం చేస్తున్నారు. మరుగుదొడ్లు కంపుకొడుతున్నాయి. తాగునీటి కొళాయిలు సక్రమంగా లేవు.
– వినోద్, ప్రయాణికుడు, తిరుపతి


