ధర్నాతో దద్దరిల్లిన కలెక్టరేట్
తిరుపతి అర్బన్: ధర్నాలు, నిరసనలతో కలెక్టరేట్ సోమవారం దద్దరిల్లింది. ‘ప్రాణ త్యాగానికై నా సిద్ధం.. మా భూములు ఇవ్వం’ అంటూ రైతులు, ‘వక్ఫ్ సవరణ చట్టం రద్దయ్యే వరకు పోరాటం చేస్తాం’ మైనారిటీలు, ‘సూపర్ సిక్స్’ అమలు చేయాలంటూ కమ్యూనిస్ట్‌లు కలెక్టరేట్ వద్ద నిరసనలు, ధర్నాలు చేపట్టారు.
ప్రాణాలైనా అర్పిస్తాం.. భూములు ఇవ్వం
సత్యవేడు మండలంలోని ఇరుగుళం, కొల్లడం, పెద్దఈటిపాకం, రాళ్లకుప్పం, రాసపాళెం గ్రామాల్లో ఏపీఐఐసీ ద్వారా భూములు సేకరించడానికి ప్రభుత్వం జారీ చేసిన జీవో ఎంఎస్ నంబర్ 39ను రద్దు చేయాలని రైతులు డిమాండ్ చేశారు. ప్రాణాలైనా అర్పిస్తాం.. భూములు అయితే ఇవ్వడం కుదరదని తేల్చిచెప్పారు. 2,583 ఎకరాలను సేకరించడానికి ప్రభుత్వం 39 జీవోను ఇవ్వడం అన్యాయమన్నారు. రెండు పంటలు పండే భూములను తీసుకోవద్దని భూసేకరణ చట్టంలో ఉన్నప్పటికీ ప్రయత్నాలు చేయడం సరికాదన్నారు. గతంలో సేకరించిన 7,246 ఎకరాలలో ఇప్పటికీ ఇంకా రెండు వేల ఎకరాల భూములు ఖాళీగా ఉన్నట్టు గుర్తుచేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు.
వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాల్సిందే
వక్ఫ్ సవరణ చట్టం రద్దు చేసే వరకు పోరాటం ఆగదని ముస్లింలు కలెక్టరేట్‌కు ర్యాలీగా చేరుకుని ధర్నా చేపట్టారు. ‘లౌకిక రాజ్యాంగ పరిరక్షణ వేదిక‘ ఆధ్వర్యంలో ఉదయం 11 గంటలకు సీపీఎం, సీపీఐ, వైఎస్సార్‌సీపీ, కాంగ్రెస్, ముస్లిం సంస్థల ఆధ్వర్యంలో భారీ స్థాయిలో నిరసన చేపట్టారు. ముస్లిం మనోభావాలను కేంద్ర ప్రభుత్వం దెబ్బతీస్తోందన్నారు. తక్షణం వక్ఫ్ సవరణ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్‌కు వినతిపత్రాన్ని అందించారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు హరినాథరెడ్డి, సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షులు కందారపు మురళి, సీపీఎం జిల్లా కార్యదర్శి వందవాసి నాగరాజు, సీపీఐ జిల్లా కార్యదర్శి పీ.మురళి, వైఎస్సార్‌సీపీ నేత మహమ్మద్ ఖాద్రి ఇమ్రాన్, ఖాదిర్‌బాషా, మహ్మద్ ఖాసిం(చోట) మహ్మద్ మాలిక్, చాన్‌బాషా సులేమాన్, గపూర్, జాఫర్ పులి పాల్గొన్నారు. అలాగే సీపీఐ(ఎంఎల్)న్యూడెమోక్రటీస్ నేత వెంకయ్య ఆధ్వర్యంలో సూపర్ సిక్స్ వెంటనే అమలు చేయాలంటూ నినాదాలు చేశారు.
గ్రీవెన్స్‌కు 372 అర్జీలు
కలెక్టరేట్‌లో సోమవారం నిర్వహించిన గ్రీవెన్స్‌కు జిల్లా నలు మూలల నుంచి 372 అర్జీలు వచ్చాయి. ఇందులో రెవెన్యూ సమస్యలపై 260 అర్జీలు ఉన్నాయి. కలెక్టర్ ఎస్.వెంకటేశ్వర్‌తోపాటు జేసీ శుభం బన్సల్, డీఆర్వో నరసింహులు, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్లు, జిల్లా అధికారులు అర్జీలను స్వీకరించారు.
వితంతు పింఛన్ కోసం వచ్చా
నా భర్త అనారోగ్యంతో మూడు నెలల క్రితం మృతి చెందారు. నాకు ఇద్దరు చిన్న బిడ్డలు ఉన్నారు. ఎలాంటి ఆస్తిపాస్తులు లేవు. జీవించడం కష్టంగా ఉంది. వితంతువు పింఛన్ ఇప్పిస్తే ఆ డబ్బుతో ఇద్దరు చిన్నబిడ్డలను చూసుకోగలను. –షబినా, శ్రీకాళహస్తి
వికలాంగుల పింఛన్ ఇప్పించడయ్యా
నేను తిరుపతి ఇందిర్మ కాలనీలో ఉంటున్నా. దివ్యాంగుడిని. నాకు వికలాంగుల పింఛన్ ఇప్పించి న్యాయం చేయండి. –రమణయ్య, తిరుపతి
ధర్నాతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాతో దద్దరిల్లిన కలెక్టరేట్
ధర్నాతో దద్దరిల్లిన కలెక్టరేట్


