కాంగ్రెస్‌లో ‘గుట్ట’ చిచ్చు | Yadagirigutta Temple Governing Body affair issue in Congress Party | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ‘గుట్ట’ చిచ్చు

Jul 2 2026 2:43 AM | Updated on Jul 2 2026 2:43 AM

Yadagirigutta Temple Governing Body affair issue in Congress Party

యాదగిరిగుట్ట దేవస్థాన పాలకమండలి వ్యవహారం

తనకు చెప్పకుండా నియమించడంపై మునుగోడు ఎమ్మెల్యే అసంతృప్తి 

రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలతో ఏకీభవిస్తున్నా.. నల్లగొండ నేతలతో మాట్లాడాల్సింది 

సీఎంతో మాట్లాడతానన్న మహేశ్‌గౌడ్‌.. ఉమ్మడి జిల్లా మంత్రుల్లోనూ అసంతృప్తి!

సాక్షి, హైదరాబాద్‌: యాదగిరిగుట్ట దేవస్థాన పాలకమండలి నియామకం కాంగ్రెస్‌ పార్టీలో చిచ్చురేపుతోంది. కొందరు మంత్రులతో సహా, ఎమ్మెల్యేల్లో కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతున్నట్టు సమాచారం. కనీసం ఉమ్మడి నల్లగొండ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ఎమ్మెల్సీలకు కూడా సమాచారం ఇవ్వలేదన్న ప్రచారం జరుగుతోంది. దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కుటుంబ సభ్యులతో కలిసి వ్యక్తిగత పర్యటనలో భాగంగా లండన్‌లో ఉన్నారు. మంత్రికి కూడా తెలియకుండానే యాదగిరిగుట్ట దేవస్థాన పాలక మండలి నియామకం జరిగిందన్న ప్రచారం గాందీభవన్‌లో జోరుగా సాగుతోంది. బీఆర్‌ఎస్‌ పార్టీతో సంబంధాలున్న కుటుంబంలోని వ్యక్తిని చైర్మన్‌గా నియమించారని, బీజేపీతో అంటకాగుతున్న చిరంజీవి కుటుంబానికి చెందిన వారిని, మాజీమంత్రి దేవేందర్‌గౌడ్‌ తనయుడు విజయేందర్‌ను సభ్యులుగా నియమించడంపై కాంగ్రెస్‌ నాయకులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. 

ఈ కమిటీని నియమించడానికి రెండు రోజుల ముందు నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించినా.. ఆ సమయంలోనూ జిల్లా మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు కనీసం మాటమాత్రంగా కూడా పాలక మండలి నియామకం గురించి ప్రస్తావించలేదని వారు అసంతృప్తితో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగానే తన అసంతృప్తిని వ్యక్తం చేశారు. పాలక మండలి నియామకం విషయంపై ఇద్దరు మంత్రులు పార్టీ అధిష్టానానికి, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్‌గాందీకి లేఖ రాసే యోచనలో ఉన్నట్టు సమాచారం. దేవస్థాన పాలక మండలిలో సభ్యుల నియామకానికి సంబంధించి మంత్రులు చేసిన సిఫారసులను బుట్టదాఖలు చేశారని ఓ మంత్రి వ్యాఖ్యానించారు. అసలైన కాంగ్రెస్‌ నాయకులు కనుమరుగు అవుతున్నారని, పార్టీలో నాయకులు ఆరోపిస్తున్నారు. కాగా, ఓ సీనియర్‌ మంత్రి ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డికి స్వయంగా లేఖ రాసి అసంతృప్తి వ్యక్తం చేసినట్టు ప్రచారం జరుగుతోంది.  

ఒరిజినల్‌ కాంగ్రెస్‌ వారు కనుమరుగు : ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి 
‘ప్రభుత్వం ప్రజల కోసం పనిచేయాలలి. షో అప్స్‌ చేస్తే..ఎక్కువ మాట్లాడితే ప్రజలకు నచ్చదు. ఇప్పుడు కాంగ్రెస్‌లో అందరూ కొత్తవారు వచ్చారు. ఒరిజినల్‌ కాంగ్రెస్‌ వారు, ఒరిజినల్‌గా తెలంగాణ కోసం కొట్లాడిన వారంతా రోజురోజుకు కనుమరుగై పోతున్నారు. ఎక్కడెక్కడి వాళ్లో కొత్త బ్యాచ్‌ వచ్చారు. అంతా కొత్త వారే నడిపిస్తున్నారు. నేను మునుగోడు ఎమ్మెల్యేను. యాదాద్రి జిల్లాలో నా మునుగోడు నియోజకవర్గం ఉంది. యాదగిరిగుట్ట ధర్మకర్తల మండలిపై కనీస సమాచారం లేదు. ఇది ఏకపక్ష నిర్ణయం. అస్సలు కరెక్ట్‌ కాదు. గత కొన్నాళ్లుగా ప్రభుత్వ పెద్దల వ్యవహారం బాగా లేదు. వీరి వ్యవహారశైలి నచ్చకనే నల్లగొండ మీటింగ్‌కు వెళ్లలేదు. 

నన్ను అడిగితే మా నియోజకవర్గం నుంచి ఒక సభ్యుడిని అయినా వేయించుకునే వాణ్ణి. చాలా దారుణంగా ప్రవర్తిస్తున్నారు. వారి ఖర్మ. చైర్మన్‌ విషయం నేను మాట్లాడ దలుచుకోలేదు. సభ్యుల విషయమైనా చెప్పాలి కదా. వాళ్లకు ఆ మాత్రం ఆలోచన కూడా లేదు. ఇటీవల రాహుల్‌గాంధీని కలిసినప్పుడు అన్ని విషయాలు ఆయనతో మాట్లాడాను. త్వరలోనే రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్‌చార్జ్‌ మీనాక్షి నటరాజన్, టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌లను కలిసి మాట్లాడతా’అని అన్నారు. ‘మా బ్రదర్‌ వెంకట్‌రెడ్డి నన్ను ఉద్దేశించి దాన కర్ణుడని పాజిటివ్‌గానే మాట్లాడారు. మంచి ఉద్దేశంతో’నే అని తెలిపారు. యాదగిరిగుట్ట బోర్డు ఏర్పాటు విషయంలో మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బుధవారం మీడియాతో మాట్లాడుతూపై విధంగా స్పందించారు.  
 
మాట్లాడాల్సింది కానీ...! 
ఈ విషయమై బుధవారం గాంధీభవన్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో టీపీసీసీ చీఫ్‌ మహేశ్‌కుమార్‌గౌడ్‌ కూడా స్పందించారు. రాజగోపాల్‌రెడ్డి వ్యాఖ్యలు తన దృష్టికి వచ్చాయని, ఆ వ్యాఖ్యలతో తాను ఏకీభవిస్తున్నానన్నారు. నల్లగొండ జిల్లా నేతలతో మాట్లాడి యాదగిరిగుట్ట బోర్డును నియమిస్తే బాగుండేదని చెప్పారు. అయినా, అన్ని విషయాల్లో అందరినీ ఇన్వాల్వ్‌ చేయలేమని, అలా చేస్తే ఏదీ ముందుకు పోదని అభిప్రాయపడ్డారు. ఈ విషయంపై తాను సీఎం రేవంత్‌తో మాట్లాడతానని మహేశ్‌గౌడ్‌ వెల్లడించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement