యూపీసీ వోల్ట్ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంటున్న మంత్రి శ్రీధర్‌బాబు
డబ్ల్యూఈఎఫ్ ఎండీ జెరెమీ జర్గెన్స్‌తో సీఎం భేటీ
సమీప భవిష్యత్తులో ‘ఫాలో అప్’పై నిర్ణయం తీసుకుంటామన్న జర్గెన్స్
‘తెలంగాణ రైజింగ్ 2047 విజన్’లో భాగస్వామ్యంపై ఆసక్తి
‘సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండ్రస్టియల్ రివల్యూషన్’ పురోగతిపై చర్చలు
సాక్షి, హైదరాబాద్: దావోస్‌లో ఏటా జరిగే ప్రపంచ ఆర్థిక వేదిక (డబ్ల్యూఈఎఫ్) సదస్సుకు కొనసాగింపుగా ఏటా జూలైలో హైదరాబాద్‌లో ‘ఫాలో అప్’సమావేశం నిర్వహించాలని బుధవారం ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి చేసిన ప్రతిపాదనపై సానుకూల స్పందన వ్యక్తమయ్యింది. దావోస్ సదస్సులో జరిగే చర్చలు, తీసుకునే నిర్ణయాల పురోగతిని సమీక్షించేందుకు ‘ఫాలో అప్’సమావేశం ఉపయోగపడుతుందని సీఎం పేర్కొన్నారు. కాగా ఈ ప్రతిపాదనపై డబ్ల్యూఈఎఫ్ ఎండీ జెరెమీ జర్గెన్స్ స్పందించారు. గురువారం తెలంగాణ పెవిలియన్‌లో జెరెమీ జర్గెన్స్, సీ4ఐఆర్ కోఆర్డినేషన్ హెడ్ మంజు జార్జ్‌తో సీఎం రేవంత్ సమావేశమయ్యారు. తెలంగాణ రైజింగ్ విజన్ లక్ష్యాలతో పాటు ఫాలో అప్ సదస్సు నిర్వహణ ప్రతిపాదనలపై చర్చించారు.
ఫాలో అప్ సదస్సు నిర్వహణ ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అవకాశాలు, పారిశ్రామిక రంగ అనుకూలతలు, రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహకాలు, ప్రభుత్వ విధానాలను ప్రపంచానికి చూపించాలనే తన ఆలోచనను సీఎం పంచుకున్నారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనలపై డబ్ల్యూఈఎఫ్ బృందం సానుకూలంగా స్పందించింది. ఈ అంశంపై వివిధ దేశాల నుంచి ప్రతిపాదనలు అందాయని, సమీప భవిష్యత్తులో నిర్ణయం తీసుకుంటామని జర్గెన్స్ తెలిపారు.
చైనా లో ప్రతి ఏడాదీ ‘సమ్మర్ దావోస్’ జరుగుతోందని, సౌదీ అరేబియా కూడా ఫాలో అప్ సమావేశ నిర్వహణకు ఆసక్తి చూపుతోందని ఆయన వెల్లడించారు. తెలంగాణ రైజింగ్ 2047 విజన్, రాష్ట్రాన్ని 3 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తీర్చిదిద్దే రోడ్‌మ్యాప్ తదితరాలను ఆయన ప్రశంసించారు. ‘తెలంగాణ రైజింగ్’లో తాము భాగస్వాములం అవుతామని చెప్పారు. హైదరాబాద్‌లో ప్రతిభావంతమైన మానవ వనరులున్నాయనే అభిప్రాయం వ్యక్తం చేశారు.
క్రీడలు, నైపుణ్యాభివృద్ధికి అత్యంత ప్రాధాన్యత
అధునాతన టెక్నాలజీ సెంటర్లు, యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ, యంగ్ ఇండియా స్పోర్ట్స్ యూనివర్సిటీ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన నైపుణ్యాభివృద్ధి కార్యక్రమాలను సీఎం రేవంత్ వివరించారు. నైపుణ్యాభివృద్ధితో పాటు క్రీడలకు తమ ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందని చెప్పారు. కాగా హైదరాబాద్‌లో జరిగిన బయో ఏషియా–2024లో ప్రారంభించిన సీ4ఐఆర్ (సెంటర్ ఫర్ ది ఫోర్త్ ఇండ్రస్టియల్ రివల్యూషన్) పురోగతిపై ఈ సమావేశంలో చర్చలు జరిగాయి. రాష్ట్ర ప్రభుత్వం కోర్, ప్యూర్, రేర్ పేరిట అమలు చేస్తున్న మూడు జోన్ల విధానం, భారత్ ఫ్యూచర్ సిటీ ప్రత్యేకతలను మంత్రి శ్రీధర్‌బాబు వివరించారు. విమానయాన, అంతరిక్ష, రక్షణ, ఐటీ, ఔషధ రంగాల్లో హైదరాబాద్ అనుకూలతలను మంత్రి పొంగులేటి శ్రీనివాస్‌రెడ్డి వివరించారు. ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక ఇంధనంపై తమ ప్రభుత్వం దృష్టి పెట్టిందని చెప్పారు.


