పిలియన్‌.. పారాహుషార్‌! | Without Helmet Fine in Hyderabad | Sakshi
Sakshi News home page

పిలియన్‌.. పారాహుషార్‌!

Jun 9 2025 7:51 AM | Updated on Jun 9 2025 7:51 AM

Without Helmet Fine in Hyderabad

హెల్మెట్‌ ధరించనివారి ప్రమాదాలపై అధ్యయనం 

వాహన చోదకుల్లో 691 మంది మృత్యువాత 

పిలియన్‌ రైడర్స్‌లో కన్నుమూసిన వాళ్లు 236 మంది  

2019– 2025 ఏప్రిల్‌ మధ్య గణాంకాలు 

 అవగాహన పెంచాలని ట్రాఫిక్‌ పోలీసుల నిర్ణయం

సాక్షి, హైదరాబాద్‌: ‘నగరంలో వాహనాల సరాసరి వేగం గంటకు పట్టుమని పాతిక కిలో మీటర్లు కూడా లేదు. మరి హెల్మెట్లు ఎందుకు?’ ఇది అనేక మంది చేసే వ్యాఖ్య. ‘వాహనం నడిపే వ్యక్తి పెట్టుకుంటే చాలు. వెనక కూర్చునే వారికి హెల్మెట్‌ ఎందుకు?’ ఇది పలువురి నుంచి వచ్చే ప్రశ్న. ఇప్పటికీ నగరంలో అనేక మంది హెల్మెట్‌ లేకుండా ద్విచక్ర వాహనాలు నడుపుతుండగా... వాహనం వెనుక కూర్చునే వ్యక్తి (పిలియన్‌ రైడర్‌) హెల్మెట్‌ ధారణ అనేది అరుదైన దృశ్యమే. ఇదే సిటీలో ఏటా పదుల సంఖ్యలో మరణాలకు కారణమవుతోందని హైదరాబాద్‌ ట్రాఫిక్‌ పోలీసుల అధ్యయనంలో తేలింది. 

2019–2025 ఏప్రిల్‌ మధ్య ప్రమాదాలకు సంబంధించిన గణాంకాలను అధ్యయనం చేస్తే ఆందోళనకర అంశాలు వెలుగులోకి వచ్చాయి. ఈ మధ్య కాలంలో మొత్తం 17,506 ప్రమాదాలు జరగ్గా.. వీటిలో ద్విచక్ర వాహనాలకు సంబంధించినవి 8,582గా ఉన్నాయి. వీటిలో మొత్తం 1,081 మంది మృత్యువాతపడగా.. 691 మంది రైడర్లు, 236 మంది పిలియన్‌ రైడర్లు హెల్మెట్‌ ధరించని కారణంగా చనిపోయారు. 

అత్యధికులు కేసులకు భయపడే..  
నగరంలో ఇప్పటికీ అనేక మంది వాహన చోదకులు ట్రాఫిక్‌ పోలీసులకు భయపడే హెల్మెట్లు ధరిస్తున్నారు. చౌరస్తాలు, చెకింగ్‌ పాయింట్లు ఉన్నప్పుడు మాత్రమే హెల్మెట్‌ పెట్టుకుని, ఆ తర్వాత దాన్ని తీసి బండికి తగిలించే వాళ్లు కోకొల్లలు. పోలీసులు విధించే చలాన్ల నుంచి తప్పించుకోవాలని భావించే వారిలో కొందరు ఏమాత్రం రక్షణ ఇవ్వని హాఫ్‌ హెల్మెట్లు, కర్మాగారాల్లో వినియోగించేవి పెట్టుకుంటున్నారు. 

ద్విచక్ర వాహనాలకు సంబంధించిన రోడ్డు ప్రమాదాల్లో అత్యధిక మరణాలు తలకు దెబ్బతగలడం వల్లే సంభవిస్తుంటాయి. ఇలా చనిపోయిన వారికంటే ఎక్కువగా జీవచ్ఛవాలుగా మారిన వాళ్లూ ఉన్నారు. ఈ పరిణామాలకు కారణం వాహన చోదకులతో పాటు పిలియన్‌ రైడర్లు హెల్మెట్‌ ధారణను పట్టించుకోకపోవడమే అన్నది పోలీసుల మాట.  

తీవ్రతలో పెద్దగా తేడా ఉండదు..  
మోటారు వాహనాల చట్టం ప్రకారం ద్విచక్ర వాహనంపై ప్రయాణించే వ్యక్తితో పాటు వెనుక కూర్చునే వాళ్లూ హెల్మెట్‌ ధరించాల్సిందే. కొన్నేళ్ల క్రితం చేసిన సవరణల ప్రకారం నాలుగేళ్లు వయసు దాటిన వారు ఎవరైనా ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తుంటే హెల్మెట్‌ తప్పనిసరి. అయితే సామాజిక, రాజకీయ, ఆర్థిక కారణాల నేపథ్యంలో పోలీసు విభాగం కేవలం రైడర్‌కు మాత్రమే హెల్మెట్‌ మస్ట్‌ నిబంధన అమలు చేస్తోంది. 

రోడ్డు ప్రమాదం జరిగినప్పుడు ద్విచక్ర వాహనంపై ప్రయాణిస్తున్న వారు చనిపోవడానికి, తీవ్రంగా గాయపడటానికి ఎదుటి వాహనం కంటే రోడ్డు దెబ్బే ఎక్కువగా కారణం అవుతోంది. ఈ గాయాలు కావడంలో రైడర్, పిలియన్‌ రైడర్‌ అనే తేడాలు లేవని, ప్రమాదం జరిగినప్పుడు వీరిద్దరికీ అయ్యే గాయాల్లో పెద్దగా తేడా ఉండదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అందుకే ఇప్పటికీ ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడుల్లోని కొన్ని నగరాల్లో పిలియన్‌ రైడర్‌ సైతం హెల్మెట్‌ ధరించాలన్న నిబంధన కచి్చతంగా అమలవుతోందని పేర్కొంటున్నారు.

కొన్నేళ్ల క్రితం సైబరాబాద్‌లో అమలు... 
వాహనం నడిపే రైడర్‌తో పాటు వెనుక కూర్చునే పిలియన్‌ రైడర్‌ సైతం కచి్చతంగా హెల్మెట్‌ ధరించాలనే విధానాన్ని సైబరాబాద్‌ ట్రాఫిక్‌ విభాగం అధికారులు కొన్నేళ్ల క్రితం అమలు చేసినా ప్రస్తుతం అటకెక్కింది. మరోపక్క ద్విచక్ర వాహన చోదకులు కచి్చతంగా ఫుల్‌సైజ్‌ హెల్మెట్లు ధరించాల్సి ఉంది. దీంతో హాఫ్‌ హెల్మెట్లు ధరించిన వారికి అడపాదడపా చలాన్లు విధిస్తున్నారు. ప్రతి ఒక్క ద్విచక్ర వాహన చోదకుడు, పిలియన్‌ రైడర్‌ కచి్చతంగా హెల్మెట్లు ధరించాలంటూ పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని భావిస్తున్నారు.

 ‘వాహనం ప్రమాదానికి గురైనప్పుడు చోదకుడిపై ఎంత ప్రభావం ఉంటుందో.. పిలియన్‌ రైడర్‌కూ అదే స్థాయిలో ఉంటుంది. ద్విచక్ర వాహనం వెనుక కూర్చునే వ్యక్తి కచ్చితంగా హెల్మెట్‌ ధరించాలని న్యాయస్థానాలు స్పష్టం చేశాయి. ఈ నేపథ్యంలోనే ప్రతి వాహన చోదకుడు దీన్ని అమలు చేయాలి. కచి్చతంగా ఐఎస్‌ఐ ప్రమాణాలతో కూడిన హెల్మెట్లే ఖరీదు చేయాలి’ అని ఓ ఉన్నతాధికారి పేర్కొన్నారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement