మూడు సంవత్సరాల ప్రేమ.. పెళ్లి చేసుకుంటానన్న హామీ.. మూడు సార్లు అబార్షన్ చేయించాడన్న ఆరోపణలు.. చివరకు పెళ్లికి నిరాకరించడంతో మున్సిపల్ చైర్మన్ ఇంటి ఎదుటే నాలుగు రోజుల పాటు నిరసన. వరంగల్ జిల్లా వర్ధన్నపేటలో తీవ్ర చర్చకు దారితీసిన ఈ వ్యవహారం ఎట్టకేలకు ఓ కొలిక్కి వచ్చింది. మున్సిపల్ చైర్మన్ పాలకుర్తి సారంగపాణి కుమారుడు శ్రీకాంత్.. బాధితురాలిని పెళ్లి చేసుకునేందుకు అంగీకరించాడు.
శ్రీకాంత్ తనను ప్రేమ పేరుతో నమ్మించి పెళ్లి చేసుకుంటానని చెప్పి మోసం చేశాడని ఆరోపిస్తూ శ్రీదేవి అనే యువతి సోమవారం నుంచి సారంగపాణి ఇంటి ఎదుట ఆందోళనకు దిగింది. కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులతో కలిసి నిరసన కొనసాగించింది. తనకు న్యాయం జరిగే వరకు అక్కడి నుంచి కదిలేది లేదని స్పష్టం చేసింది. ఆమె ఆందోళనకు పలు రాజకీయ, ప్రజాసంఘాల నాయకులు మద్దతు తెలిపారు. ఈ క్రమంలో..
ఎమ్మెల్యే, మాజీ పోలీస్ అధికారి కేఆర్ నాగరాజు చొరవతో ఇరు కుటుంబాల మధ్య చర్చలు జరగ్గా, గురువారం సాయంత్రం పెద్దల సమక్షంలో శ్రీకాంత్, శ్రీదేవి దండలు మార్చుకుని వివాహ బంధంలోకి అడుగుపెట్టారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్ తల్లిదండ్రులు సారంగపాణి, సుజాత పాల్గొన్నారు.
మూడేళ్ల ప్రేమ..
శ్రీకాంత్‌తో తనకు మూడేళ్ల క్రితం దసరా వేడుకల సందర్భంగా పరిచయం ఏర్పడిందని శ్రీదేవి తెలిపింది. అప్పటి నుంచి ప్రేమిస్తున్నానని, పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని ఆరోపించింది. వేములవాడ ఆలయానికి తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటానని మాట ఇచ్చాడని, తన కుటుంబ సభ్యులకు కూడా పరిచయం చేశాడని వివరించింది. ఈ క్రమంలో అతడితో సన్నిహితంగా ఉన్న సమయంలో మూడుసార్లు గర్భం దాల్చానని, శ్రీకాంత్ సూచనల మేరకు అబార్షన్లు చేయించుకున్నానని పేర్కొంది.
తర్వాత శ్రీకాంత్ తనను దూరం పెట్టడంతో మోసపోయానని గ్రహించినట్లు తెలిపింది. ఈ విషయంపై ఆయన తండ్రి సారంగపాణిని కలిసి తన వద్ద ఉన్న ఆధారాలు చూపించినా ఫలితం లేకపోయిందని ఆరోపించింది. అనంతరం వర్ధన్నపేట ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజును ఆశ్రయించినా సమస్య పరిష్కారం కాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. చివరకు చైర్మన్ ఇంటి ఎదుటే ఆందోళనకు దిగింది.
ఎమ్మెల్యే చొరవతో కొలిక్కి..
శ్రీదేవి నిరసన కొనసాగుతుండటంతో ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు ఇరు కుటుంబాలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి చొరవ తీసుకున్నారు. ఆయన జోక్యంతో శ్రీకాంత్ పెళ్లికి అంగీకరించడంతో ఇరు కుటుంబాల పెద్దల సమక్షంలో వివాహం జరిగింది. కుటుంబాల మధ్య ఒప్పంద పత్రం కూడా రాసుకున్నట్లు సమాచారం. పెళ్లి కార్యక్రమంతో నాలుగు రోజులుగా కొనసాగుతున్న నిరసనకు తెరపడింది. తనకు అండగా నిలిచిన ప్రజాసంఘాలు, రాజకీయ పార్టీల నాయకులకు శ్రీదేవి కృతజ్ఞతలు తెలిపింది.
ఇదీ చదవండి: జూరాల రైతులపై నాన్ బెయిలబుల్ కేసులా?


