‘పశ్చిమ’లో గరంగరం! | - | Sakshi
Sakshi News home page

‘పశ్చిమ’లో గరంగరం!

Nov 25 2026 9:36 AM | Updated on Nov 25 2026 9:36 AM

పోలీస్‌ శాఖ సీరియస్‌

సాక్షిప్రతినిధి, వరంగల్‌ :

సై అంటే సై.. సవాల్‌కు ప్రతి సవాల్‌.. అన్నట్లుగా వరంగల్‌ పశ్చిమ రాజకీయాలు ఒక్కసారిగా వేడెక్కాయి. పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి, మాజీ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్‌ మధ్య సాగిన మాటల యుద్ధం చినికి..చినికి రోడ్డుపై పోరుగా మారింది. రాజీనామా చేయాలంటూ బీఆర్‌ఎస్‌ సవాల్‌ విసరగా.. అభివృద్ధిపై బహిరంగ చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్‌ ప్రతి సవాల్‌ విసిరింది. దీంతో మంగళవారం హనుమకొండలో రాజ కీయ వాతావరణం హీటెక్కింది. పోటాపోటీ ఆందో ళనలు, నినాదాలు, పోలీసుల జోక్యం, లాఠీచార్జ్‌, అరెస్టులతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.

బీఆర్‌ఎస్‌ సభ తర్వాత హీట్‌..

రాజీనామా డిమాండ్‌.. చౌరస్తా వేదిక..

హనుమకొండలో ఆదివారం బీఆర్‌ఎస్‌ నిర్వహించిన జనచైతన్య సభలో ఆ పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ వ్యాఖలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి చేసిన విమర్శలు రాజకీయ దుమారానికి తెరలేపాయి. ఈ వ్యాఖ్యలపై మాజీ ప్రభుత్వ చీఫ్‌విప్‌ దాస్యం వినయ్‌భాస్కర్‌ తీవ్రంగా స్పందించారు. నాయిని రాజేందర్‌రెడ్డి 24 గంటల్లో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. రాజీనామా చేస్తే తాను పోటీ చేసి ఓడిస్తానని సవాల్‌ విసిరారు. దాస్యం సవాల్‌కు కాంగ్రెస్‌ నేతలు దీటుగా స్పందించారు. ఎమ్మెల్యే నాయిని రాజేందర్‌రెడ్డి హయాంలో చేపట్టిన అభివృద్ధి పనులకు సంబంధించిన జీఓలు, ఆధారాలతో బహిరంగ చర్చకు సిద్ధమని ప్రకటించారు. సాయంత్రం ఐదు గంటలకు హనుమకొండ చౌరస్తాకు చేరుకున్న కాంగ్రెస్‌ శ్రేణులు.. ప్రజల ముందే ఎవరి పాలనలో అభివద్ధి జరిగిందో తేల్చుకుందామని సవాల్‌ విసిరాయి. దాస్యం వినయ్‌భాస్కర్‌ చర్చకు రాలేదంటూ కాంగ్రెస్‌ నేతలు విమర్శలు గుప్పించారు. ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ చౌరస్తాలోనే చర్చకు సిద్ధమని ప్రకటించారు. ఈ క్రమంలో పోలీసులు కాంగ్రెస్‌ శ్రేణులను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు.

క్యాంపు కార్యాలయం,

బీఆర్‌ఎస్‌ కార్యాలయాల వద్ద ఉద్రిక్తత..

మరోవైపు దాస్యం వినయ్‌భాస్కర్‌ సవాల్‌ను స్వీకరించి నాయిని రాజేందర్‌రెడ్డి రాజీనామా చేయాలంటూ బీఆర్‌ఎస్‌ శ్రేణులు ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం ఎదుట మెరుపు ధర్నాకు దిగాయి. దీంతో అక్కడ ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఆందోళన చేస్తున్న బీఆర్‌ఎస్‌ కార్యకర్తలను పోలీసులు అడ్డుకునే క్రమంలో లాఠీచార్జి జరిగిందని ఆ పార్టీ నేతలు ఆరోపించారు. పలువురు కార్యకర్తలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలించారు. ఇదిలా ఉండగా, బీఆర్‌ఎస్‌ కార్యాలయం వద్ద కూడా ఉద్రిక్తత చోటుచేసుకుంది. నాయిని అవినీతిని ప్రశ్నించినందుకే కాంగ్రెస్‌ శ్రేణులు తమ కార్యాలయంపై దాడికి యత్నించాయని బీఆర్‌ఎస్‌ నేతలు ఆరోపించారు. కార్యాలయంలోని కార్యకర్తలపై రాళ్లు రువ్వారని, కర్రలతో దాడికి ప్రయత్నించారని, అక్కడ ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను చించివేశారని పేర్కొన్నారు. పోలీసుల సమక్షంలోనే ఈ ఘటన జరిగిందని ఆరోపించారు. ఈ పరిణామాలు ఇరు పార్టీల మధ్య రాజకీయ వైరం మరింత ముదిరినట్లు స్పష్టం చేస్తున్నాయి.

ఎవరిది పైచేయి?

నిన్నటి వరకు మాటలకే పరిమితమైన విమర్శలు.. ఇప్పుడు వీధి పోరాటాల వరకు చేరాయి. ఒకవైపు ఎమ్మెల్యే రాజీనామాకు బీఆర్‌ఎస్‌ పట్టుబడుతుండగా.. మరోవైపు అభివృద్ధి పనుల లెక్కలతో చర్చకు సిద్ధమంటూ కాంగ్రెస్‌ సవాల్‌ విసురుతోంది. ఇరు పార్టీల నేతలు తమ వాదనలే నిజమని నిరూపించుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఈ రాజకీయ ఆ ధిపత్య పోరులో ఎవరిది పైచేయి అవుతుందన్నది ఆసక్తికరంగా మారింది. నేతల సవాళ్లు, ప్రతి సవాళ్ల మధ్య నగరంలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా చూడాల్సిన బాధ్యత పోలీసులపై పడింది.

ఇరుపార్టీల నేతలపై

కేసులు నమోదు చేస్తాం

సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత

హసన్‌పర్తి: హనుమకొండ బాలసముద్రంలో బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ నాయకుల మధ్య మంగళవారం చోటుచేసుకున్న ఘటనపై పోలీస్‌ శాఖ సీరియస్‌గా పరిగణించింది. సెంట్రల్‌ జోన్‌ డీసీపీ దార కవిత మాట్లాడుతూ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు పరిశీలిస్తున్నామని చెప్పారు. చట్టాన్ని చేతుల్లోకి తీసుకునే వారిని ఉపేక్షించేది లేదని, ఘర్షణకు పాల్పడిన ఇరుపార్టీల నేతలపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.

రోడ్డెక్కిన బీఆర్‌ఎస్‌,

కాంగ్రెస్‌ శ్రేణులు

ఎమ్మెల్యే..మాజీ ఎమ్మెల్యే మధ్య ముదిరిన మాటలయుద్ధం

రాజీనామాలు, అభివృద్ధిపై చర్చ .. రాజకీయ రచ్చ

రెండు వర్గాలు సై అంటే సై..

సవాళ్లతో నగరం హీట్‌హాట్‌

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement