‘బీమా’ నమోదుపై టెలికాన్ఫరెన్స్‌ | - | Sakshi
Sakshi News home page

‘బీమా’ నమోదుపై టెలికాన్ఫరెన్స్‌

Nov 25 2026 9:36 AM | Updated on Nov 25 2026 9:36 AM

న్యూశాయంపేట: ఇందిరమ్మ కుటుంబ జీవిత బీమా నమోదు ప్రక్రియలో జాగ్రత్తలు పాటించాలని కలెక్టర్‌ డాక్టర్‌ సత్యశారద అన్నారు. మంగళవారం జిల్లా అధికారులతో టెలికాన్ఫరెన్స్‌లో పాల్గొని సమీక్షించారు. ప్రతీ కుటుంబానికి చెందిన వివరాలు, నామినీ వివరాలు తప్పనిసరిగా పోర్టల్‌లో నమోదు చేయాలన్నారు. ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా పకడ్బందీగా నిర్వహించాలన్నారు. టెలీకాన్ఫరెన్స్‌లో అదనపు కలెక్టర్‌ ఎల్‌.కిషోర్‌కుమార్‌, వై.వీ.గణేశ్‌, డీఆర్‌ఓ విజయలక్ష్మి, వరంగల్‌, నర్సంపేట ఆర్డీఓలు సుమా, ఉమారాణి, జిల్లా అధికారులు పాల్గొన్నారు.

పొరపాట్లకు తావివ్వొద్దు

గీసుకొండ: ఇందిరమ్మ కుటుంబ బీమా పథకంలో అర్హులైన లబ్ధిదారుల నమోదు ప్రక్రియలో ఎలాంటి పొరపాట్లు జరగొద్దని అదనపు కలెక్టర్‌ (రెవెన్యూ) కిశోర్‌ కుమార్‌ సూచించారు. మంగళవారం మండలంలోని రాంపూర్‌ గ్రామపంచాయతీలో నమోదు ప్రక్రియను పరిశీలించి పురోగతిని అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఇప్పటివరకు గ్రామంలో 53 శాతం మంది ప్రజలు బీమా పథకానికి నమోదు చేసుకున్నట్లు సర్పంచ్‌ రడం భరత్‌ తెలిపారు. మిగిలిన అర్హులందరూ నమోదు చేసుకునేలా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జీపీఓ రవికుమార్‌, కారోబార్‌ రాజేష్‌ తదితరులు పాల్గొన్నారు.

108 వాహనం తనిఖీ

పర్వతగిరి: మండలకేంద్రంలోని 108 వాహనాన్ని మంగళవారం వరంగల్‌ మేనేజర్‌ గుర్రపు భరత్‌ ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అంబులెన్స్‌లోని పరికరాలు, రిజిస్టర్లు పరిశీలించి సిబ్బంది పనితీరుపై సంతృప్తి వ్యక్తం చేసి సిబ్బందికి పలు సూచనలు చేశారు. సీజనల్‌ వ్యాధులపై సిబ్బంది అప్రమత్తంగా ఉండాలన్నారు. కాల్‌ రాగానే స్పందించి సకాలంలో ప్రజలకు సేవలందించాలన్నారు. రోజు వారి సేవలు నిరంతరాయంగా అందించాలన్నారు. వాహనదారులు హెల్మెట్‌, సీట్‌ బెల్ట్‌ ధరించి ప్రయాణం చేయాలని కోరారు. మండలకేంద్రంలో 102, 108 అంబులెన్స్‌ సేవలను వినియోగించుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో సిబ్బంది పైలెట్‌ రవీందర్‌, ఈఎంటీ రాజ్‌నాయక్‌ పాల్గొన్నారు.

గుండెపోటుతో రైతు మృతి

పర్వతగిరి: మండలంలోని బూర్గుమళ్ల గ్రామానికి చెందిన ఓ రైతు మంగళవారం ధాన్యం కళ్లం వద్ద గుండెపోటుతో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన నాళ్లం వీరస్వామి (60)కి రెండెకరాల వ్యవసాయ భూమి ఉండగా అందులో వరి పంట సాగు చేశాడు. 20 రోజుల క్రితం పంట కోసి ధాన్యాన్ని ఆరబోశాడు. అప్పటినుంచి ధాన్యం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో విక్రయించలేదు. పైగా మంగళవారం సాయంత్రం వాతావరణ మార్పులతో వర్షం కురిసే అవకాశం ఉండడంతో భార్యభర్తలు ధాన్యాన్ని పరదాలతో కప్పే క్రమంలో వీరస్వామికి ఒక్కసారిగా గుండెపోటు రావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వీరస్వామికి కుమారుడు, కుమార్తె ఉండగా కుమారుడు కొద్ది సంవత్సరాల క్రితం మృతి చెందగా వారి పిల్లల సంరక్షణ బాధ్యత ఆయనే చూసుకుంటున్నాడు. వీరస్వామి మృతితో పిల్లలు ఇబ్బందులు పడే పరిస్థితి నెలకొంది. కాగా మృతదేహాన్ని సర్పంచ్‌ ఎలికట్టె కృష్ణవేణివేణు, బీఆర్‌ఎస్‌ పార్టీ మండల ఉపాధ్యక్షుడు చింతల శ్రీనివాస్‌, గ్రామస్తులు సందర్శించి నివాళులర్పించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement