ఈశాన్యం వైపు నడుద్దాం.. తెలంగాణ భవన్‌లో వాస్తు మార్పులు | Vastu Changes in Telangana Bhavan | Sakshi
Sakshi News home page

ఈశాన్యం వైపు నడుద్దాం.. తెలంగాణ భవన్‌లో వాస్తు మార్పులు

Apr 5 2024 1:44 AM | Updated on Apr 5 2024 12:17 PM

Vastu Changes in Telangana Bhavan - Sakshi

వాహనాల రాకపోకలకు వీలుగా ర్యాంప్‌ నిర్మాణం

ట్రాఫిక్, పార్కింగ్‌ సమస్యలు తీరుతాయంటున్న బీఆర్‌ఎస్‌ వర్గాలు

వీధిపోటును దృష్టిలో పెట్టుకుని దక్షిణ గేటు వద్ద లక్ష్మీనరసింహ స్వామి ఫొటో 

సాక్షి, హైదరాబాద్‌: అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత చోటుచేసుకున్న పరిణామాలతో భారత్‌ రాష్ట్ర సమితి కార్యాలయం తెలంగాణ భవన్‌లో వాస్తు రీత్యా మార్పులు చేస్తున్నారు. పార్టీ అధికారం కోల్పోవడంతో పాటు అధినేత కేసీఆర్‌ ప్రమాదం బారిన పడటం, నేతలు పార్టీ వీడటం, కవిత అరెస్టు తదితర ఘటనల నేపథ్యంలో వాస్తు నిపుణుల సూచనల మేరకు పలు మార్పులు చేస్తున్నారు.

ఇన్నాళ్లూ తెలంగాణ భవన్‌ తూర్పు అభిముఖంగా ఉండగా వాయవ్య దిశలో ఉన్న గేటు నుంచి రాకపోకలు జరుగుతున్నాయి. వాస్తు నిపుణుల సలహా మేరకు ఇకపై ఈశాన్యం వైపు ఉన్న గేటును రాకపోకలకు వినియోగించాలని నిర్ణయించారు. అందుకు అనుగుణంగా ఈశాన్యం వైపు ఉన్న గేటును తెరిచి వాహనాల రాకపోకలకు వీలుగా ర్యాంపు నిర్మిస్తున్నారు.  మరోవైపు వీధి పోటును దృష్టిలో పెట్టుకుని దక్షిణభాగంలో ఉన్న గేటు వద్ద యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి చిత్రంతో కూడిన ఫ్లెక్సీని ఏర్పాటు చేశారు. 

 అబ్బే.. వాస్తు మార్పులు కాదు కానీ.. 
అయితే పార్టీ వర్గాలు మాత్రం వాస్తు మార్పులు కాదని అధినేత కేసీఆర్‌తో పాటు కేటీఆర్‌ ఇతర కీలక నేతలు తెలంగాణ భవన్‌కు వస్తున్న సందర్భాల్లో వాయువ్య దిశలో ఉన్న గేటు ఎదురుగా రోడ్డులో ట్రాఫిక్‌ సమస్య తలెత్తుతోందని చెప్తున్నాయి. దీంతో వాహనదారుల ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని ఈశాన్యం గేటు నుంచి రాకపోకలు సాగేలా ఏర్పాట్లు చేస్తున్నట్లు పార్టీ నేతలు చెప్తున్నారు.

ఇన్నాళ్లూ పోలీసు కమాండ్‌ కంట్రోల్‌ సెంటర్‌ భవన నిర్మాణ పనులు జరుగుతుండటంతో ఈశాన్యం గేటును ఉపయోగించుకోలేక పోయామని అంటున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్‌ను అనుకుని నిర్మించిన విశాలమైన రోడ్డుతో ట్రాఫిక్, పార్కింగ్‌ సమస్యలు తీరుతాయని బీఆర్‌ఎస్‌ వర్గాలు చెప్తున్నాయి.   

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement