అసెంబ్లీలో కాంగ్రెస్‌ విలీనంపై వివరణ ఇవ్వండి

TS HighCourt{ Give Explanation On Congress Legislature Merge  - Sakshi

ప్రతివాదులకు హైకోర్టు ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: కాంగ్రెస్‌ శాసనసభాపక్షం టీఆర్‌ఎస్‌లో విలీనం కావడం చట్టవిరుద్ధమని, 12 మంది ఎమ్మెల్యేలపై అనర్హత వేటు వేయాలంటూ సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, టీపీసీసీ అధ్యక్షుడు ఎన్‌.ఉత్తమ్‌కుమార్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌పై కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను హైకోర్టు ఆదేశించింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ హిమాకోహ్లి, జస్టిస్‌ బి.విజయసేన్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పిటిషన్‌లో అసెంబ్లీ కార్యదర్శి, స్పీకర్, ఎన్నికల కమిషన్‌తోపాటు ఎమ్మెల్యేలు దేవిరెడ్డి సుధీర్‌రెడ్డి, చిరుమర్తి లింగయ్య, హరిప్రియ, కందాల ఉపేందర్‌రెడ్డి, పట్లోళ్ల సబితాఇంద్రారెడ్డి, రేగ కాంతారావు, సక్కు, హర్షవర్ధన్‌రెడ్డి, వనమా వెంకటేశ్వర్‌రావు, జె.సురేందర్, గండ్ర వెంకటరమణారెడ్డి, రోహిత్‌ రెడ్డి తదితరులు ప్రతివాదులుగా ఉన్నారు.

వ్యక్తిగత హోదాలో ఎమ్మెల్యేలకు నోటీసులు పంపేందుకు పిటిషనర్‌ తరఫు న్యాయవాదికి అనుమతించింది. ఈ వ్యవహారంపై 4 వారాల్లో కౌంటర్‌ దాఖలు చేయాలని ప్రతివాదులను ఆదేశిస్తూ విచారణను వాయిదా వేసింది. కాంగ్రెస్‌ పార్టీ ఎమ్మెల్సీలు టీఆర్‌ఎస్‌లో విలీనం కాకుండా ఆదేశా లివ్వాలంటూ 2019 జూన్‌లో ఎమ్మెల్సీ షబ్బీర్‌ అలీ దాఖలు చేసిన మరో పిటిషన్‌లో ఎమ్మెల్సీలు ఎంఎస్‌ ప్రభాకర్‌రావు, కూచుకుళ్ల దామోదర్‌రెడ్డి, టి.సంతోష్‌కుమార్, లలితలకు నోటీసులు జారీ చేస్తూ కౌంటర్‌ దాఖలు చేయాలని ఆదేశించింది.

స్పీకర్‌కు ఆ అధికారం లేదు
‘ఒక పార్టీకి చెందిన శాసనసభాపక్షాన్ని మరో పార్టీలో విలీనం చేసే అధికారం ఎన్నికల సంఘానికే ఉంటుంది. అందుకు విరుద్ధంగా స్పీకర్‌ వీరిని విలీనం చేస్తూ బులెటిన్‌ జారీ చేశారు. పార్టీ ఫిరాయింపుల కింద 12మంది ఎమ్మెల్యే లపై అనర్హత వేటు వేయాలి’ అని పిటిషన్‌లో కోరారు.

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top