డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్లకు లైన్‌ క్లియర్‌.. లబ్ధిదారుల ఎంపిక షురూ!

TS Govt Directed To Start Selecting Beneficiaries Of Double Bedroom - Sakshi

ఆ పథకానికి ఎట్టకేలకు లబ్ధిదారుల ఎంపిక

ప్రక్రియ ప్రారంభించాలని ప్రభుత్వ ఆదేశం

సాక్షి, హైదరాబాద్‌: గందరగోళంగా తయారైన డబుల్‌ బెడ్‌రూమ్‌ ఇళ్ల పథకాన్ని దారిలో పెట్టేందుకు ప్రభుత్వం ఎట్టకేలకు చర్యలు ప్రారంభించింది. పథకం ప్రారంభమైన ఇన్నేళ్ల తర్వాత ఇప్పుడు లబ్ధిదారుల ఎంపికకు కసరత్తు మొదలుపెట్టాలని నిర్ణయించింది. రాష్ట్రవ్యాప్తంగా ఇప్పటికే 1.29 లక్షల ఇళ్ల నిర్మాణం పూర్తయినా, లబ్ధిదారుల ఎంపిక జరగకపోవటంతో ఆ ఇళ్లలో గృహప్రవేశాలు లేకుండాపోయిన సంగతి తెలిసిందే. నామమాత్రంగా కొన్ని చోట్ల అధికారికంగా ఇళ్లను కేటాయించటం తప్ప మిగతా చోట్ల అవి ఖాళీగానే ఉన్నాయి. దీంతో కొందరు పేదలు వాటిని బలవంతంగా ఆక్రమించుకోవడంతో ఆ పథకమే గందరగోళంగా మారింది. ఇప్పుడు అధికారికంగా లబ్ధిదారుల ఎంపిక ప్రక్రియ ప్రా రంభించాలని నిర్ణయించారు. ఈమేరకు గృహనిర్మాణ శాఖ మంత్రి ప్రశాంతరెడ్డి బుధవారం గృహనిర్మాణ శాఖ అధికారులతో సమీక్షించారు. ఈ గృహసముదాయాల్లో మౌలిక వసతుల కల్పనను వేగిరం చేయాలని  ఆదేశించారు. 

నేడు జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్‌ 
లబ్ధిదారుల ఎంపిక జిల్లా కలెక్టర్ల ఆధ్వర్యంలో జరగాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్‌కుమార్‌ ఆధ్వర్యంలో గురువారం జిల్లా కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించనున్నారు. లబ్ధిదారుల ఎంపికకు సంబంధించి ఇందులో స్పష్టమైన ఆదేశాలు వెలువడే అవకాశముంది. 

లబ్ధిదారుల జాబితా ఇస్తే కేంద్రం నుంచి రూ.12 వేల కోట్లు 
కేంద్రం ప్రధాన్‌మంత్రి ఆవాస్‌ యోజన పథకం కింద రాష్ట్రానికి పేదల ఇళ్లను మంజూరు చేస్తోంది. ఈమేరకు మొదటి దఫా నిధులు కేటాయించింది. వాటి లెక్కలు సమర్పించే సమయంలో లబ్ధిదారుల జాబితాను కోరింది. ఆ జాబితా ఉంటేనే మలిదఫా నిధులు ఇవ్వాల్సి ఉంటుందని, లేకుంటే ఇవ్వటం కుదరదని తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. అలా రాష్ట్రానికి అందాల్సిన రూ.12 వేల కోట్లు నిలిచిపోయాయి. అందుకే వీలైనంత తొందరగా లబ్ధిదారుల జాబితా సిద్ధంచేసి కేంద్రానికి పంపి ఆ నిధులు రాబట్టాలని అధికారులు భావిస్తున్నారు.

ఇదీ చదవండి: రామోజీ మీ టూరిజానికి ఆ భూములే కావాలా?: సీపీఎం

Read latest Telangana News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram 

Read also in:
Back to Top