ఆదివాసీ బిడ్డ చదువుకు అడ్డంకులు | tribal student Financial difficulties | Sakshi
Sakshi News home page

ఆదివాసీ బిడ్డ చదువుకు అడ్డంకులు

Jun 9 2025 11:36 AM | Updated on Jun 9 2025 11:36 AM

tribal student Financial difficulties

పాల్పంచలోని కళాశాలలో బీటెక్‌ (ఈఈఈ)లో సీటు

జంగుబాయికు ఆర్థిక ఇబ్బందులు

 అనారోగ్యంతో పరీక్షకు హాజరుకాని వైనం

ఎస్‌వీఆర్‌ ఫౌండేషన్, సాక్షి చొరవతో

అన్ని భరిస్తామన్న కళాశాల యాజమాన్యం 

ఆదిలాబాద్‌రూరల్‌: పట్టుదలతో చదువులో రాణిస్తున్న ఆదివాసీ బిడ్డకు ఉన్నత చదువులకు ఆర్థిక ఇబ్బందులు అడ్డంకిగా మారాయి. ఆదిలాబాద్‌ జిల్లాలోని మొలాల్‌గుట్ట–1 గ్రామంలో ఆదివాసీ కొలాం తెగకు చెందిన మడావి సంగీత–రాము దంపతుల కుమార్తె జంగుబాయి. ఈమె ఎంసెట్‌–2021లో పరీక్ష రాసి మంచి ర్యాంకుతో భద్రాచలంలోని పాల్వంచలో అనూబొస్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ కళాశాలలో సీటు వచ్చింది. 

బీటెక్‌ ఎలక్ట్రికల్‌ అండ్‌ ఎలక్ట్రానిక్‌ ఇంజినీరింగ్‌ (ఈఈఈ) థర్డ్‌ ఇయర్‌లో అనారోగ్యం బారిన పడింది. దీంతో పరీక్షకు హాజరుకాలేకపోయింది. ప్రస్తుతం ఫీజు చెల్లించేందుకు డబ్బులు లేకపోవడంతో ఇంటి వద్దనే ఉంటోంది. ఆమె తన చదువు ముందుకు సాగేందుకు ఆర్థిక చేయూతనందించాలని వాట్సాప్‌ గ్రూప్‌లో పోస్టు చేసింది. ఈ విషయాన్ని ఎస్‌వీఆర్‌ ఫౌండేషన్‌ అధ్యక్షుడు వామన్‌రావ్‌ ‘సాక్షి’దృష్టికి తీసుకువచ్చాడు. ఆదివారం ఫౌండేషన్‌ సభ్యులతోపాటు సాక్షి..మొలాల్‌గుట్ట–1 గ్రామానికి చేరుకుని ఆమెతో మాట్లాడి వివరాలు తెలుసుకుంది. 

కళాశాల యాజమాన్యంతో ఫోన్‌లో సంప్రదింపు
మడావి జంగుబాయి..విషయమై పాల్వంచలోని అనూబొస్‌ కళాశాల యాజమాన్యంతో ఎస్‌వీఆర్‌ ఫౌండేషన్‌ సభ్యులతో కలిసి ‘సాక్షి’ఫోన్‌లో మాట్లాడింది. సదరు విద్యార్థిని ఫీజుల డబ్బులు మొత్తం కళాశాల యాజమాన్యం ఖర్చులు, అన్ని భరిస్తామని వైస్‌ ప్రిన్సిపాల్‌ వెంకన్న తెలిపారు. ఎస్‌వీఆర్‌ ఫౌండేషన్, సాక్షి చొరవతో అన్ని భరిస్తామని పేర్కొన్నారు. దీంతో కళాశాల యాజమాన్యానికి ఎస్‌వీఆర్‌ ఫౌండేషన్‌ ధన్యవాదాలు తెలిపింది. 

చిన్నప్పుడే తల్లి మృతి..
జంగుబాయికు ఇద్దరు తమ్ముళ్లు ఉన్నారు. ఒకరు 9వ తరగతి చదివి మానేశాడు. మరొకరు ఇటీవల పదో తరగతి పూర్తిచేశాడు. కాగా, జంగుబాయి 9వ తరగతి చదువుతున్నప్పుడే తల్లి సంగీత మృతిచెందింది. తండ్రి రాము ఇంద్రవెల్లి మండలంలోని ధనోరా గ్రామంలో మేకల కాపరి పనిచేస్తున్నాడు.

 

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement