హడ్డుబంగి ఆశ్రమ పాఠశాల వద్ద మృతదేహంతో బైఠాయించిన గిరిజనులు
జ్వరం, ఊపిరితిత్తుల వ్యాధితో కవిత మృతి
ఈ ప్రభుత్వం వచ్చాక 21మంది గిరిజన విద్యార్థులు మృతి
సీతంపేట: ప్రభుత్వ నిర్లక్ష్యానికి మరో గిరిజన విద్యార్థి బలైంది. పార్వతీపురం మన్యం జిల్లా హడ్డుబండి గిరిజన సంక్షేమ బాలికల ఆశ్రమ పాఠశాలలో ఆరోతరగతి చదువుతున్న మండంగి కవిత జ్వరం, ఊపిరితిత్తుల వ్యాధిలో విశాఖ కేజీహెచ్‌లో శుక్రవారం మృతిచెందింది. దీనికి ప్రభుత్వ నిర్లక్ష్యమే కారణమంటూ కవిత స్వగ్రామమైన డొంబంగివలసతోపాటు రాజుగాడిగూడ, ఈతమానుగూడ, పూతికవలస, పుట్టిగాం, కోమటిగూడ, చీడిమానుగూడ, చింతమానుకాలనీ, గూడంగి కాలనీకి చెందిన గిరిజనులంతా శనివారం పార్వతీపురం మన్యం జిల్లా హడ్డుబంగి గేటు బయట తరలి వచ్చి మృతదేహంతో ఆందోళనకు దిగారు.
ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు, గిరిజనులు మాట్లాడుతూ ‘గిరిజన విద్యార్థులు పిట్టల్లారాలిపోతుంటే చూస్తూ ఊరుకుంటారా?.. విద్యార్థుల ఆరోగ్యం పట్టదా?.. ప్రభుత్వం నుంచి కనీసం స్పందన లేకపోవడం దారుణం.. కురుపాంలో ఇద్దరు విద్యార్థినులు మృతిచెందితే వారి కుటుంబాలకు వైఎస్సార్‌సీపీ బాధ్యతగా రూ.5 లక్షల చొప్పున ఎక్స్‌గ్రేíÙయా చెల్లించింది. కూటమి ప్రభుత్వం కనీసం స్పందించలేదు’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు. గిరిజన సంఘం జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ తిరుపతిరావు మాట్లాడుతూ రాష్ట్రంలో రెండేళ్లలో ఇప్పటి వరకు 21 మంది విద్యార్థులు చనిపోయారని, ఈ నెలలో వరుసగా ఆరుగురు మృతి చెందినా, సంబంధిత శాఖామంత్రి, ఎమ్మెల్యేలకు చీమకుట్టినట్టయినా లేదన్నారు.
జిల్లాలోని వివిధ వసతిగృహాల్లో 15 వేల మంది బాలికలు చదువుతుంటే వీరిలో 30 శాతం మందికి సికిల్ సెల్ ఎనిమియా ఉందని రిపోర్టులు చెబుతున్నాయన్నారు. ఏడాదిన్నరగా దోమతెరల పంపిణీ లేదన్నారు. హాస్టల్ తలపులు, కిటికీలకు మెస్‌లు లేవని, తాగునీటి సమస్య వెంటాడుతుందని, సరైన మెనూ అందడంలేదంటూ ఆవేదన వ్యక్తంచేశారు. గిరిజన ప్రాంతాలు అంటే నా ఆత్మ.. ఎక్కడైనా స్పందిస్తానన్న ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఎందుకు స్పందించడంలేదో చెప్పాలన్నారు. గిరిజనుల మరణాల పట్ల దృష్టిసారించాలని, లేదంటే విద్యార్థుల తల్లిదండ్రులతో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు తప్పవని హెచ్చరించారు.
బాలిక కుటుంబానికి రూ.50 లక్షల ఎక్స్‌గ్రేíÙయా, ఒకరికి ఉద్యోగం ఇవ్వాలని, గిరిజన బిడ్డల చావుకు ఆ శాఖమంత్రి సంధ్యారాణి వచ్చి సమాధానం చెప్పేవరకు మృతదేహాన్ని పాఠశాల నుంచి తరలించేది లేదని గిరిజన సంఘాల నాయకులు తెగేసి చెప్పారు. పాలకొండ సబ్‌కలెక్టర్, ఐటీడీఏ ఇన్‌చార్జి పీవో పవార్ స్వప్నిల్ జగన్నాథ్ పాఠశాలకు వచ్చి గిరిజనులతో మాట్లాడారు. విచారణ జరిపి సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.


