‘వీడియో ఫిట్‌నెస్‌’లపై రవాణా శాఖ నజర్‌ | Transport Department is preparing to regulate private travel buses | Sakshi
Sakshi News home page

‘వీడియో ఫిట్‌నెస్‌’లపై రవాణా శాఖ నజర్‌

Jun 24 2026 4:31 AM | Updated on Jun 24 2026 4:31 AM

Transport Department is preparing to regulate private travel buses

ఈశాన్య రాష్ట్రాలకు లేఖలు రాయాలని నిర్ణయం

కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తెచ్చే యోచన

‘సాక్షి’ కథనం నేపథ్యంలో చర్యలకు సిద్ధం

పన్ను తగ్గింపునూ పరిశీలిస్తున్న సర్కార్‌

సాక్షి, హైదరాబాద్‌: ఈశాన్య రాష్ట్రాల రిజిస్ట్రేషన్‌తో నిబంధనలకు విరుద్ధంగా తెలుగు రాష్ట్రాలతో పాటు ఇతర పొరుగు రాష్ట్రాల్లో తిరుగుతున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులను నియంత్రించేందుకు రవాణా శాఖ సిద్ధమవుతోంది. ఈశాన్య రాష్ట్రాల్లో నామమాత్రపు పన్నులు ఉండటంతో ట్రావెల్స్‌ నిర్వాహకులు ఆయా రాష్ట్రాల్లో రిజిస్ట్రేషన్‌ చేయిస్తున్న సంగతి తెలిసిందే. రాష్ట్రంలో కాకుండా ఇతర రాష్ట్రాల్లో పన్ను చెల్లింపు విషయం ఎలా ఉన్నా, బస్సుల ఫిట్‌నెస్‌ విషయంలో ఆయా రాష్ట్రాల రవాణా శాఖలు అత్యంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నాయి. 

ట్రావెల్స్‌ యాజమాన్యాలతో కుమ్మక్కై కేవలం వీడియో కాల్‌లో బస్సును పరిశీలించి ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్లు జారీ చేస్తున్నాయి. ఈ క్రమంలో ఫిట్‌నెస్‌ లేకున్నా సర్టిఫికెట్లు జారీ చేసేందుకు ఉన్న అవకాశాన్ని ఎత్తిచూపుతూ, ఫిట్‌నెస్‌ లేని బస్సులతో ప్రమాదాలు జరిగేందుకు ఎక్కువ ఆస్కారం ఉండటంపై ‘సాక్షి’ రెండు రోజుల క్రితం ‘బస్సుల ఫిట్‌నెస్‌ ఈ‘శూన్యం’ శీర్షికతో కథనం ప్రచురించింది. 

దీనిపై స్పందించిన రాష్ట్ర రవాణా శాఖ దిద్దుబాటు చర్యలు చేపట్టాలని నిర్ణయించింది. వీడియో కాల్స్‌ ద్వారా ఫిట్‌నెస్‌ సర్టిఫికెట్ల జారీ ఎంత ప్రమాదకరమో వివరిస్తూ  సంబంధిత ఈశాన్య రాష్ట్రాల రవాణా శాఖలకు  లేఖలు రాయాలని నిర్ణయించింది. అలాగే కేంద్ర ప్రభుత్వం దృష్టికి కూడా తీసుకెళ్లాలని భావిస్తోంది. అదే సమయంలో రాష్ట్రంలో పన్ను తగ్గింపు అంశాన్నీ పరిశీలిస్తోంది.

పన్ను తగ్గింపుపై కసరత్తు
ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సుల నిర్వాహకులు ఈశాన్య రాష్ట్రాల పరిధిలో కాకుండా రాష్ట్రంలోనే రిజిస్ట్రేషన్‌ చేయించుకోవటానికి వీలుగా ప్రభుత్వం కసరత్తు చేస్తోంది. కొన్ని పొరుగు రాష్ట్రాలు ఇప్పటికే పన్నులను తగ్గించి బస్సుల రిజిస్ట్రేషన్లు స్థానికంగానే అయ్యేలా చర్యలు చేపట్టాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణలో కూడా పన్ను తగ్గించే అంశాన్ని రాష్ట్ర ప్రభుత్వం పరిశీలిస్తోంది. ప్రస్తుతం తెలంగాణలో అఖిల భారత పర్యాటక పర్మిట్‌ ఉన్న ట్రావెల్స్‌ బస్సులకు త్రైమాసిక పన్ను ప్రతి బెర్తుకు రూ.4 వేలుగా ఉంది. 

అదే ఈశాన్య రాష్ట్రాలైన నాగాలాండ్, అరుణాచల్‌ ప్రదేశ్‌లలో ఈ పన్ను ఏడాదికి రూ.500 నుంచి రూ.1,000 లోపు మాత్రమే ఉంది. ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడుల్లో కూడా తెలంగాణ స్థాయిలోనే పన్ను ఉండేది. కానీ ఇటీవల కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం పన్నును రూ.4 వేల నుంచి రూ.3 వేలకు తగ్గించింది. తమిళనాడు కూడా తగ్గించే యోచనలో ఉంది. ఆంధ్రప్రదేశ్‌లో రూ.2,500కు తగ్గించాలని ఇటీవల కేబినెట్‌ నిర్ణయించింది. ఇదే క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం కూడా పన్నును తగ్గించే ఆలోచనలో ఉంది. బెర్తుకు రూ.2,500 గానీ, రూ.2 వేలు గానీ చేసే అంశాన్ని పరిశీలించనున్నట్టు తెలిసింది.   

Advertisement
Advertisement
 
Advertisement
Advertisement