
పట్టించుకోని పర్యవేక్షకులు.. సిబ్బంది చేతివాటం
అవినీతిమయంగా టౌన్‌ప్లానింగ్ విభాగం
జిల్లా అదనపు కలెక్టర్ ప్రత్యేక శ్రద్ధ చూపాలని వినతి
సాక్షి, హైదరాబాద్: టౌన్ ప్లానింగ్ కాదు, అది అవినీతి ప్లానింగ్.. అక్రమ నిర్మాణాలకు అడ్డులేదు.. సిబ్బంది చేతివాటానికి అదుపులేదు.. ప్రభుత్వం పురపాలికల్లో టీజీ–బీపాస్ (TG-bPASS) అమల్లోకి తెచ్చినా అక్రమాలకు అడ్డుకట్ట పడటం లేదు. ఇంటి నిర్మాణాలు, స్థలమార్పిడి కోసం ఆన్‌లైన్‌లో వచ్చిన దరఖాస్తులను పరిశీలించకుండానే అధికారులు అనుమతులిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
ఇటీవల ఏడు పురపాలక సంఘాల్లో విలీనమైన పంచాయతీల్లోని నిర్మాణాలు, బహుళ అంతస్తుల భవనాలు, వ్యాపార వాణిజ్య సదుపాయాలకు సంబంధించిన కట్టడాల్లో అక్రమాలకు అంతులేదనే ఆరోపణలు సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. తద్వారా ఆస్తిపన్ను అసెస్‌మెంట్ లెక్కింపులో తప్పిదాలు జరుగుతున్నట్లు తెలుస్తోంది. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలోని 16 పుర పాలికల్లో జనవరి నుంచి ఇప్పటి వరకు 6,947 దరఖాస్తులు వచ్చినట్లు తెలుస్తోంది. ప్రతీ పురపాలక సంఘంలోనూ నెలకు 20 నుంచి 45 ఇంటి నిర్మాణాలు, స్థలమార్పిడి కోసం దరఖాస్తులు వస్తున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.
కనుసన్నల్లో...
గతంలో నిబంధనలకు విరుద్ధంగా ఉండే దరఖాస్తులను సంబంధిత అధికారులు తిరస్కరించేవారు. అయితే బీపాస్ ద్వారా అన్ని దరఖాస్తులు సులువుగా పరిష్కారం అవుతుండటంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అసెస్‌మెంట్ లెక్కింపులో కొందరు ఉద్యోగులు, సిబ్బంది అక్రమాలకు పాల్పడుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పాటించని ఇళ్లకూ కొందరు పర్యవేక్షణాధికారులు ఆమోదం తెలుపుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. భారీ భవనాలు, వాణిజ్య సముదాయాలకు కొలతలు తక్కువ చేసి అనుమతులు మంజూరు చేస్తున్నారనే వాదనలు వినవస్తున్నాయి.
పురపాలక సంఘాల్లోని పలు కాలనీల్లో ఉన్న వ్యాపార, వాణిజ్య కేంద్రాల భవనాలకు కూడా రెసిడెన్షియల్ అసెస్‌మెంట్ చేస్తున్నట్లుగా విమర్శలు వస్తున్నాయి. మేడ్చల్–మల్కాజిగిరి జిల్లాలో ప్రధానంగా పీర్జాదిగూడ, బోడుప్పల్, నిజాంపేట, జవహర్‌నగర్, కొంపెల్లి, దుండిగల్, దమ్మాయిగూడ, నాగారం (Nagaram), తూముకుంట, మేడ్చల్, పోచారం, ఎల్లంపేట్, అలియాబాద్, ఎంసీ పల్లి, ఘట్కేసర్, గుండ్లపోచంపల్లి పురపాలక సంఘాల్లో ఇష్టారీతిన ఆక్రమణల పరంపర కొనసాగుతోందని స్థానికులు ఆరోపిస్తున్నారు.
చేతివాటం ప్రదర్శిస్తున్న పుర సిబ్బంది...
75 నుంచి 120 గజాల్లోపు ఇళ్ల పత్రాలన్నింటినీ క్షుణ్ణంగా పరిశీలించాలి. ఈ వ్యవహారాన్ని పట్టణ ప్రణాళిక విభాగం పర్యవేక్షించాలి. ఆ తర్వాత ఇంటి కొలతల ఆధారంగా అసెస్‌మెంట్ లెక్కింపునకు యజమానులు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. నిబంధనల ప్రకారం సెట్‌బ్యాక్ వదలాలి. నిర్దేశించిన కొలతల ఆధారంగా ఇళ్ల నిర్మాణాలు జరగాలి. భవన నిర్మాణదారులు అవేమీ పట్టించుకోకుండా ఇష్టారీతిన నిర్మాణాలు చేపడుతున్నారు.
అవినీతికి కేరాఫ్ అడ్రస్‌గా..
జిల్లాలో నాలుగు పురపాలక సంఘాలకు ఒక టౌన్ ప్లానింగ్ అధికారి బాధ్యతలు నిర్వహించాల్సి వస్తోంది. కొత్త మున్సిపాలిటీలను ఏర్పాటు చేసినా సరిపడా ఉద్యోగులను నియమించలేదు. కనీసంగా మంజూరు పోస్టులు భర్తీ చేయలేకపోతోంది. దీంతో ఉన్న ఉద్యోగులు, సిబ్బంది పైనే అదనపు భారం పడుతోంది. నల్లగొండ జిల్లా దేవరకొండ మున్సిపాలిటీ టీపీఓగా బాధ్యతలు నిర్వహిస్తున్న శ్రీధర్ మేడ్చల్ జిల్లాలోని తూముకుంట, ఎల్లంపేట్, మూడుచింతలపల్లి, అలియాబాద్ (Aliabad) మున్సిపాలిటీలకు ఇన్‌చార్జ్ టీపీఓగా బాధ్యతలు చేపట్టారు.
చదవండి: నిన్న గాజుల రామారం.. రేపు బోరబండ
ఒక్కరే ఐదు మున్సిపాలిటీల్లో టీపీఓగా పనిచేయటం వల్ల, దేనికి న్యాయం చేయలేకపోతున్నారు. జిల్లాలోని మిగతా 15 పురపాలక సంఘాల్లో కూడా ఇదే విధానం ఉంది. ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండిపడుతోందని స్థానికులు, పలు స్వచ్ఛంద సంస్థలు, ప్రజా సంఘాలు ఆరోపిస్తున్నాయి. పురపాలక సంఘాల్లో పెరుగుతున్న అక్రమ కట్టడాలకు అడ్డుకట్ట వేయడంతో పాటు ప్రభుత్వ ఆదాయానికి భారీ గండి పడకుండా జిల్లా అదనపు కలెక్టర్(లోకల్‌బాడీ) ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు.
తప్పిదాలపై..
పురపాలికల్లో అసెస్‌మెంట్ లెక్కింపులో తప్పిదాలకు తావివ్వకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నామని సంబంధిత అధికారులు పేర్కొంటున్నారు. బీపాస్ దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించాలని టీపీఓలకు సూచిస్తున్నామని.. చెబుతున్నప్పటికీ, ఎక్కడ వేసిన గొంగడి అక్కడనే అన్న చందంగా ఉంది. అన్నీ సక్రమంగా ఉంటేనే భవన నిర్మాణాలకు అనుమతులు మంజూరు చేస్తున్నామని, నిబంధనలు అతిక్రమిస్తే పురపాలక చట్టం ప్రకారం సంబంధిత సిబ్బందిపై చర్యలు తీసుకుంటామని పలువురు పుర కమిషనర్లు పేర్కొంటున్నారు.