లక్ష ఓట్లు సాధిస్తేనే గెలుపు సాధ్యమని అంచనాలు
గెలుపోటముల లెక్కల్లో మునిగితేలుతున్న అన్ని పార్టీల అభ్యర్థులు
సాక్షి, హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో గెలుపు కోసం అధికార కాంగ్రెస్, ప్రతిపక్ష బీఆర్‌ఎస్, బీజేపీల నుంచి హేమాహేమీలైన రాష్ట్ర నేతలు గల్లీలు, బస్తీల్లో తిరుగుతున్నారు. వందల సంఖ్యల్లో పెద్ద నేతలు తమ ఇళ్ల ముందుకు వస్తుండటం చూసి ప్రజలు ఆశ్చర్య పోతున్నారు. ప్రతి ఒక్క ఓటు కోసం ఎంతో ఆరాటపడుతున్నారు. ఏ ఒక్క ఓటూ ప్రత్యర్థికి పోవద్దని భావిస్తున్నారు.

ఇంతకీ, జూబ్లీ‘హిల్స్’ను ఎక్కాలంటే ఎన్ని ఓట్లు రావాలో అవలోకిస్తే..
ప్రస్తుతం జరగనున్న ఉప ఎన్నికలో అర్హులైన ఓటర్లు దాదాపు 4 లక్షల మంది ఉన్నారు.
నగరంలో ఎప్పుడు ఎన్నిక జరిగినా పోలింగ్ శాతం తక్కువగా ఉంటోంది. గత రెండు అసెంబ్లీ ఎన్నికల్లోనూ 50 శాతానికంటే తక్కువ పోలింగే నమోదైంది.
ఈసారి పార్టీల ప్రయత్నాలతో ఎక్కువ పోలింగ్ జరుగుతుందనుకున్నా 50 శాతం పోలింగ్ నమోదైతే 2 లక్షల ఓట్లన్న మాట. వాటిల్లో సగం అంటే లక్ష ఓట్లు వచ్చిన అభ్యర్థి గెలుపు ఖాయమే. ఓట్లు ఎక్కువగా చీలి అందరు అభ్యర్థులు గట్టి పోటీ ఇస్తే 50 వేలు వచ్చినా ఆశ్చర్యం లేదు. మొత్తం మీద లక్ష ఓట్లు పొందడం ఇప్పుడు కీలకం.
గత ఎన్నికల సరళి చూసినా 50 వేల ఓట్లు దాటిన అభ్యర్థులే గెలిచారు. నియోజకవర్గం ఏర్పడ్డాక తొలి ఎన్నికలో గెలిచిన కాంగ్రెస్ అభ్యర్థి విష్ణువర్ధన్‌రెడ్డికి దాదాపు 54 వేల ఓట్లు, మలి ఎన్నికలో గెలిచిన గోపీనాథ్‌కు దాదాపు 51 వేల ఓట్లే వచ్చాయి. ఆ తర్వాతి ఎన్నికల్లో ఓట్లు పెరిగే కొద్దీ మెజార్టీ పెరిగింది.
మూడు పర్యాయాలు గెలిచిన గోపీనాథ్ 2014లో టీడీపీ నుంచి పోటీ చేసి గెలిచారు. తర్వాత రెండు పర్యాయాలు బీఆర్‌ఎస్ నుంచి గెలిచారు. విష్ణువర్థన్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా గెలిచారు. ఇక గత ఎన్నికల్లో గోపీనాథ్‌కు 80 వేల ఓట్లు రావడంతో..సునీతకు ఈసారి లక్ష లక్ష్యంగా ఆ పార్టీ నేతలు పనిచేస్తున్నారు.
ఓట్ షేరింగ్ ఇలా..
పోలైన ఓట్లలో గెలిచిన అభ్యర్థులకు తొలి రెండు ఎన్నికల కంటే, మలి రెండు ఎన్నికల్లో ఓట్ల శాతం పెరిగింది. 2014లో గోపీనాథ్‌కు కేవలం 31 శాతం ఓట్లు రాగా, 2023కు దాదాపు 44 శాతానికి పెరిగింది. ఈ నేపథ్యంలో ఇప్పుడు లక్ష ఓట్లు వస్తే (పోలింగ్ శాతం భారీగా పెరిగినా) గెలుస్తారన్నమాట. కానీ, కనిపిస్తున్న పోటీ తీవ్రత దష్ట్యా అన్ని కూడా అవసరం కాబోదని కొందరు లెక్కలేస్తున్నారు.
సంపన్న ప్రాంతం కాదు
గతంలో ఖైరతాబాద్ నియోజకవర్గంలో భాగంగా ఉన్న జూబ్లీహిల్స్ అసెంబ్లీ నియోజకవర్గం 2008 డీలిమిటేషన్‌తో ఏర్పడింది. తొలిసారిగా 2009లో ఎన్నికలు జరిగాయి. జూబ్లీహిల్స్ అనగానే సంపన్న ప్రాంతమనే గుర్తుకొస్తుంది. కానీ, సంపన్న ప్రాంతాల కంటే పేద ప్రాంతాలే ఎక్కువ. ఉన్నతవర్గాల ప్రజలు, సినీ ప్రముఖులు, వ్యాపారవేత్తలు ఉండే ప్రాంతాలు ఈ నియోజకవర్గంలోనే అనుకుంటారు కానీ. వారంతా ఖైరతాబాద్ నియోజకవర్గ పరిధిలో ఎక్కువగా ఉన్నారు. డీలిమిటేషన్ సందర్భంగా రాజకీయ కారణాలు కావచ్చు. ఇతరత్రా కావచ్చు కానీ ఈ నియోజకవర్గమే గందరగోళంగా ఉంది. జూబ్లీహిల్స్ చెక్‌పోస్ట్, రోడ్‌నెంబర్ 36, ఫిల్మ్‌నగర్ వంటి ప్రాంతాలు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ఉంటాయనే అనుకుంటారు. కానీ అవి ఈ నియోజకవర్గంలో లేవు. నియోజకవర్గం షేక్‌పేట నుంచి గోల్కొండ దాకా విస్తరించి ఉండటంతో నియోజకవర్గ సరిహద్దులు అధికారులకు తప్ప సామాన్యులకు అర్థం కావు. సినీపరిశ్రమలో పనిచేసే జూనియర్ ఆర్టిస్టులు, కార్మికులు, తదితరులుండే యూసుఫ్‌గూడ, బోరబండ వంటి ప్రాంతాలు మాత్రం జూబ్లీహిల్స్ నియోజకవర్గంలోనే ఉన్నాయి. ఇక నియోజకవర్గంలోని దాదాపు 24 శాతం మైనార్టీ ఓటర్లు అభ్యర్థుల గెలుపు ఓటములను శాసించే పరిస్థితిలో ఉన్నారు.
అయోమయంగా సర్వేలు
ఇక వివిధ చానళ్లు, యూట్యూబ్ సంస్థల సర్వేలూ ప్రజల్లో గందరగోళం రేపుతున్నాయి. వాటిని సైతం నమ్మే పరిస్థితి లేదంటున్నారు. చివరి వరకు అన్నింటినీ మనీ మేనేజ్ చేస్తుందంటున్నారు. పోలింగ్ నాటినుంచే మొదలయ్యే అవినీతితో గెలిచేవారెవరైనా..ఏ మేరకు నీతిమంతులుగా మిగులుతారో కాలమే సమాధానం చెబుతుంది.
టఫ్ ఫైట్
కాంగ్రెస్, బీఆర్‌ఎస్‌ల మధ్య పోటీ తీవ్రంగా ఉండటంతో ఏ పార్టీ గెలుస్తుందో ఎవరూ చెప్పలేకపోతున్నారు. ఎవరి గెలుపైనా నేరోగానే అనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. దాంతో రెండు పార్టీలూ ఒక్క ఓటును కూడా ఎంతో కీలకంగా భావిస్తున్నాయి. అధికార కాంగ్రెస్ నుంచి ప్రస్తుతం అధికారంలో ఉన్నవారు, బీఆర్‌ఎస్ నుంచి మాజీలైన మంత్రులు, కార్పొరేషన్ల చైర్మన్లతో పాటు రెండు పారీ్టల్లోని తాజా, మాజీ ఎమ్మెల్యేలు, తదితరులు వందల సంఖ్యలో గల్లీ, బస్తీ, కాలనీ అనే తేడా లేకుండా ఇల్లిల్లూ ఒక్కసారి కాదు రెండు మూడు పర్యాయాలు తిరుగుతున్నారు. అంతేకాదు. కులాలు, వర్గాలు, మతాల వారీగానూ గంపగుత్త ఓట్ల కోసం వెంపర్లాడుతున్నారు. ఎంత డబ్బు వెదజల్లడానికైనా వెనుకాడటం లేరనే ప్రచారం జరుగుతోంది.


