
జూబ్లీహిల్స్ ఉపఎన్నికకు మొత్తంగా 316 నామినేషన్లు దాఖలు
నామినేషన్లు వేసిన వారిలో ఆర్‌ఆర్‌ఆర్, ఫార్మాసిటీ భూ బాధితులు, రిటైర్డ్ ఉద్యోగులు
చివరిరోజు నామినేషన్లలో అర్ధరాత్రి వరకు 160 మంది దరఖాస్తులే స్వీకరణ
మిగిలిన వారి పత్రాలను నేడు స్వీకరించేందుకు అనుమతించిన ఈసీ
బంజారాహిల్స్: జూబ్లీహిల్స్ ఉపఎన్నికలో నామినేషన్ల దాఖలుకు చివరి రోజైన మంగళవారం నామినేషన్లు వెల్లువెత్తాయి. భారీ సంఖ్యలో నామినేషన్లు వేయడానికి వచ్చిన అభ్యర్థులతో బంజారాహిల్స్ రోడ్డు నంబర్–2లోని షేక్‌పేట మండల కార్యాలయంలోని జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రిటర్నింగ్ అధికారి కార్యాలయం కిటకిటలాడింది. ఉదయం 8 గంటల నుంచే అభ్యర్థులు క్యూ కట్టారు. ఉదయం 11 గంటలకు నామినేషన్ల ప్రక్రియ ప్రారంభమవగా అభ్యర్థులు భారీగా ఉండటంతో అధికారులు వారికి టోకెన్లు జారీ చేశారు.
ఇలా మొత్తం 189 నామినేషన్లకు అధికారులు టోకెన్లు అందించారు. ఈ టోకెన్ల ప్రకారం అభ్యర్థులను లోపలకు పిలిచారు. ఒక్కో అభ్యర్థి నామినేషన్ సమర్పించేందుకు 15 నిమిషాలు పట్టగా రాత్రి 12 గంటల వరకు 160 నామినేషన్ల పత్రాలను మాత్రమే రిటర్నింగ్ అధికారి తీసుకోగలిగారు. ఈ నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం నియమించిన అధికారులతోపాటు హైదరాబాద్ జిల్లా ఎన్నికల అధికారి ఆర్‌వీ కర్ణన్, జీహెచ్‌ఎంసీ అదనపు కమిషనర్ హేమంత్ కేశవ పాటిల్, రిటర్నింగ్ అధికారి సాయిరాం తదితరులు అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకొని ఈసీని బు«§ధవారం వరకు గడువు కోరారు.
దీంతో ఈసీ అనుమతి మేరకు టోకెన్లు ఎంత మందికి జారీ చేస్తే వారందరి నుంచి నామినేషన్ పత్రాలు తీసుకోవాలని.. బుధవారం ఈ ప్రక్రియ కొనసాగించవచ్చని ఈసీ నుంచి ఆదేశాలు జారీ కావడంతో ఆర్వో కేంద్రం అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ఉప ఎన్నికకు మొత్తంగా 316 నామినేషన్లు దాఖలయ్యాయి.
ట్రిపుల్ ఆర్ బాధితులు...
ప్రతిపాదిత రీజనల్ రింగ్‌రోడ్డు (ఆర్‌ఆర్‌ఆర్) వల్ల భూములు కోల్పోతున్న నిర్వాసితుల్లో 11 మంది రైతులు సైతం మంగళవారం నామినేషన్లు వేశారు. ఆర్‌ఆర్‌ఆర్ వల్ల రోడ్డున పడుతున్నామని మొరపెట్టుకున్నా ప్రభుత్వం వినిపించుకోనందున తమ బాధలు చెప్పుకోవడానికే నామినేషన్లు వేసినట్లు బాధిత రైతులు పేర్కొన్నారు. అలాగే 10 మంది ఫార్మాసిటీ భూ నిర్వాసిత రైతులు సైతం నామినేషన్లు దాఖలు చేశారు. వారితోపాటు సుమారు 200 మంది భూ నిర్వాసితులు నామినేషన్ కేంద్రం వద్దకు చేరుకొని తమకు న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.
అధికారంలోకి రాగానే ఫార్మాసిటీని రద్దు చేసి టీజీఐఐసీ పేరిట మార్చిన పట్టా భూములను తిరిగి రైతుల పేరిట నమోదు చేస్తామని అసెంబ్లీ ఎన్నికలకు ముందు హామీ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని నిలబెట్టుకోలేదని మండిపడ్డారు. కాంగ్రెస్‌కు బుద్ధి చెప్పేందుకే నామినేషన్లు వేశామని అభ్యర్థులు తెలిపారు.
మరోవైపు రిటైరైనా ప్రభుత్వం నుంచి ఇంతవరకు రిటైర్మెంట్ బెనిఫిట్స్ అందలేదంటూ పలువురు రిటైర్డ్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ సభ్యులు కూడా నామినేషన్లు దాఖలు చేశారు. అలాగే ఎస్సీ వర్గీకరణను వ్యతిరేకిస్తూ 50 మంది మాల మహానాడు నేతలు సైతం నామినేషన్లు వేశారు. దీంతో స్వతంత్ర అభ్యర్థులుగా నామినేషన్లు వేసిన వారి సంఖ్య భారీగా నమోదైంది.