తిమ్మాపూర్‌లో అభివృద్ధి పనులను ప్రారంభిస్తున్న కేంద్ర మంత్రి కిషన్‌రెడ్డి, రాష్ట్ర మంత్రి కోమటిరెడ్డి తదితరులు
కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి
కందుకూరు: దేశవ్యాప్తంగా ప్రతిపాదించిన బుల్లెట్ రైలు ప్రాజెక్టుల్లో భాగంగా తెలంగాణకు మూడు బుల్లెట్ రైళ్లు(హైస్పీడ్ రైల్ కారిడార్లు) రానున్నాయని కేంద్ర బొగ్గు గనుల శాఖ మంత్రి కిషన్‌రెడ్డి అన్నారు. హైదరాబాద్ నుంచి ముంబై, బెంగళూరు, చెన్నై నగరాల మధ్య బుల్లెట్ రైలు ప్రాజెక్టును ఏర్పాటు చేయడానికి కేంద్రం నిర్ణయించిందన్నారు. శుక్రవారం రంగారెడ్డి జిల్లా కందుకూరు మండలం లేమూరు, బేగంపేట, తిమ్మాపూర్ గ్రామాల్లో రాష్ట్ర రోడ్లు, భవనాలు, సినిమాటోగ్రఫీ శాఖ మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డితో కలిసి సీఆర్‌ఎఫ్ నిధులు రూ.87 కోట్లతో లింకు రహదారులకు సంబంధించి శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు.
ఈ సందర్భంగా లేమూరులో నిర్వహించిన సభలో ఆయన మాట్లాడుతూ హైస్పీడ్ కారిడార్ల కోసం మొదట రూ.5 లక్షల కోట్లు అంచనా వేయగా, భూముల ధరలు పెరగడంతో ఆ ఖర్చు రూ.10 లక్షల కోట్లకు చేరే అవకాశం ఉందని, దీనికి సంబంధించి సర్వే పనులు కొనసాగుతున్నాయన్నారు. ఆర్‌ఆర్‌ఆర్ కోసం ఉత్తరం వైపు భూసేకరణ పనులు కొనసాగుతున్నాయని, ఆ ప్రాజెక్టుకు రూ.20 వేల కోట్ల నుంచి రూ.25 వేల కోట్ల వరకు ఖర్చయ్యే అవకాశం ఉందన్నారు. శ్రీశైలం హైవే విస్తరణ పనులకు డీపీఆర్ సిద్ధమవుతోందని, ఏడాది లోపు పనులు ప్రారంభమవుతాయని స్పష్టంచేశారు.
రంగారెడ్డి జిల్లా తెలంగాణకు గుండెకాయ లాంటిదని, జిల్లాలోని గ్రామాలు చాలా వేగంగా అభివృద్ధి చెందుతున్నాయని, ఈ ప్రాంత అభివృద్ధికి రహదారుల అనుసంధానం అత్యంత కీలకమని మంత్రి కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీ కొండా విశ్వేశ్వర్‌రెడ్డి, ప్రభుత్వ చీఫ్ విప్ పట్నం మహేందర్‌రెడ్డి, తెలంగాణ రోడ్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్ చైర్మన్ మల్‌రెడ్డి రాంరెడ్డి, ఇబ్రహీంపట్నం ఎమ్మెల్యే మల్‌రెడ్డి రంగారెడ్డి, మాజీ ఎమ్మెల్యే కేఎల్‌ఆర్, అదనపు కలెక్టర్ చంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు.


