
హైదరాబాద్: తాళం వేసిన ఇంట్లోకి చోరీకి వచ్చాడు.. ఆమ్లేట్ వేసుకొని తిన్నాడు.. డబ్బులు, బంగారం దొరకకపోవడంతో బట్టలన్నీ ఒకచోట వేసి తగులబెట్టాడో దొంగ. ఈ సంఘటన రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్‌లో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. స్థానికుల కథనం ప్రకారం.. షాద్ నగర్‌లోని ఆఫీసర్స్‌కాలనీ చెందిన తిరుపతి గౌడ్ ఇంట్లోని పైఅంతస్తులో మహేశ్వరం మండలం కోళ్లపడకల్ గ్రామానికి చెందిన ఆంజ నేయులు కుటుంబంతో అద్దెకు ఉంటున్నాడు.
ఇటీవల ఆయన తండ్రి మరణించడంతో అందరూ సొంతూరుకి వెళ్లారు. మూడు రోజులుగా ఇంటికి తాళం వేసిన విషయాన్ని గమనించిన ఓ వ్యక్తి దొంగతనానికి ప్రయత్నించాడు. ఇంట్లోకి చొరబడి ఆమ్లేట్ వేసుకొని తిన్నాడు. తర్వాత వెతికినా, డబ్బు, బంగారం దొరకలేదు. దీంతో ఇంట్లోని బట్టలన్నీ ఒకచోట వేసి వాటికి నిప్పంటించాడు. ఈ ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని ఎస్‌ఐ సుశీల తెలిపారు.