
సాక్షి, ఢిల్లీ: తెలుగు రాష్ట్రాల మధ్య ఉన్న జల అంశాలపై కేంద్రం నేతృత్వంలో జరిగిన కీలక భేటీ ముగిసింది. కేంద్ర జల శక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో కేంద్రం పలు కీలక నిర్ణయాలు తీసుకుంది.
గోదావరి,కృష్ణా జలాలపై వివాదాలపై పరిష్కరించేలా కమిటీని ఏర్పాటు చేయాలని నిర్ణయం తీసుకుంది. కేంద్రం ఆధ్వర్యంలో జలవివాదాల పరిష్కార కమిటీని కేంద్రం నియమిస్తుంది. ఈ నెల 21లోగా కమిటీ ఏర్పాటు కానుంది. హైదరాబాద్‌లోని గోదావరి నది బోర్డు,అమరావతిలోనే కృష్ణానది బోర్డు ఉండేలా నిర్ణయం తీసుకుంది. దీంతోపాటు రిజర్వయార్ల ప్లో నీటి లెక్కలను గుర్తించేలా టెలిమెట్రీ వ్యవస్థను అందుబాటులోకి తీసుకువచ్చేలా కేంద్రం నిర్ణయం తీసుంది.
ఈ భేటీకి తెలుగు రాష్ట్రాల సీఎంలు నారా చంద్రబాబు నాయుడు, రేవంత్ రెడ్డి హాజరయ్యారు. ఈ భేటీ కోసం బనకచర్లను సింగిల్ ఎజెండాగా ఏపీ ప్రభుత్వం ప్రకటించగా.. తెలంగాణ ప్రభుత్వం వ్యతిరేకించిన సంగతి తెలిసిందే. ఈ రెండు ప్రతిపాదనలను జలశాఖ చర్చకు చేపట్టింది. కానీ ఈ చర్చలో బనకచర్ల అంశం ప్రస్తావనకు రాలేదని, కేంద్రం ప్రభుత్వ పరిధిలోని సంస్థలే అభ్యంతరం వ్యక్తం చేశాయని సీఎం రేవంత్‌రెడ్డి మీడియా సమావేశంలో వెల్లడించారు.
ఈ భేటీకి ఇరు సీఎంలతో పాటు ఏపీ, తెలంగాణ జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, ఇరు రాష్ట్రాల సీఎస్‌లు, జలవనరుల శాఖ కార్యదర్శులు, ఇంజినీర్లు హాజరయ్యారు. సమావేశానికి ముందు కేంద్ర మంత్రి సీఆర్ పాటిల్‌కు కృతజ్ఞతలు తెలియజేసిన ఇరువురు సీఎంలు.. ఆపై ఒకరికొకరు శాలువాలతో సత్కరించుకున్నారు.


అంతకు ముందు.. ఆయా రాష్ట్రాల అధికారులతో ఇరువురు సీఎంలు సమావేశమయ్యారు. భేటీలో లేవనెత్తాల్సిన అంశాలు, సాంకేతికంగా ఇవ్వాల్సిన సమాధానాలపై చర్చించారు. ఇక..
సముద్రంలో వృధాగా కలిసే జలాలను మాత్రమే బనకచర్ల ప్రాజెక్టు ద్వారా వినియోగించ దలిచామని ప్రధానంగా వివరించనుంది ఏపీ ప్రభుత్వం.
❇️గోదావరి నదిలో గత వందేళ్ల సరాసరి ప్రవాహాల గణాంకాల మేరకు ఏడాదికి 2500 -3000 టీఎంసీల మేర వృధాగా సముద్రంలో కలుస్తున్నాయని సమావేశంలో వివరించనున్న ఏపీ ప్రభుత్వం
❇️ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్టంగా 200 టీఎంసీల మాత్రమే తరలిస్తామని దీని వల్ల ఎగువ రాష్ట్రాలకు ఎలాంటి నష్టం ఉండబోదని స్పష్టం చేయనున్న రాష్ట్రప్రభుత్వం
❇️గడచిన 11 ఏళ్లలో తెలంగాణాలో నిర్మించిన ఏ ప్రాజెక్టుకూ ఏపీ అభ్యంతరం చెప్పలేదన్న విషయాన్ని సమావేశంలో తెలియచేయనున్న ప్రభుత్వం
❇️వృధాగా సముద్రంలో కలిసే నీటిని వాడుకునే అంశంలో అపోహలకు తావులేదని స్పష్టం చేయనున్న ఏపీ
❇️గోదావరి పై ఉన్న చిట్టచివరి ప్రాజెక్టు ద్వారా వృధాగా పోయే నీటిని మాత్రమే రైపీరియన్ రాష్ట్రంగా తాము వాడుకోదలిచామని వివరించనున్న ఏపీ
❇️ఈ అంశాన్ని తెలంగాణాతో పాటు కేంద్రం కూడా అర్ధం చేసుకోవాలని స్పష్టం చేయనున్న ఏపీ ప్రభుత్వం
❇️అలాగే గత 11 ఏళ్లుగా తెలంగాణాలో కట్టిన ప్రాజెక్టులు, ఎగువ రాష్ట్రంగా వినియోగించుకున్న నీళ్ల వివరాలను సిద్ధం చేసుకున్న ఏపీ ప్రభుత్వం
తెలంగాణ ప్రభుత్వ అభ్యంతరాలు
🚩కృష్ణాపై పెండింగ్ లో ఉన్న ప్రాజెక్టులకు అనుమతులు, నీటి కేటాయింపులు, గతంలో కేంద్రం ఇచ్చిన హామీ ప్రకారం పాలమూరు, డిండి ప్రాజెక్టులను జాతీయ ప్రాజెక్టులుగా గుర్తించడం, తుమ్మడిహెట్టి వద్ద నిర్మించిన ప్రాణహిత ప్రాజెక్టుకు 80 టీఎంసీల నీటి కేటాయింపుతో పాటు ఏఐబీపీ సాయం, ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి అన్ని రకాల అనుమతులు ఇవ్వాలి
🚩బనకచర్లపై #GRMB, #CWC, ఈఏసీ తీవ్ర అభ్యంతరాలు తెలిపాయి. ఇప్పటివరకు బనకచర్లకు ఎలాంటి అనుమతులు లేవు. చట్టాలను, ట్రిబ్యునల్ తీర్పులన్నీ ఉల్లంఘించే #Banakacharla ప్రాజెక్టుపై చర్చించాల్సిన అవసరం లేదనే వాదనను ఈ లేఖలో ప్రస్తావించింది.
🚩గోదావరి – బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చించటం అనుచితమని తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి రాసిన లేఖలో పేర్కొంది. ఇలాంటి చర్యలు కేంద్ర ప్రభుత్వ నియంత్రణ సంస్థల విశ్వసనీయతను దెబ్బతీస్తాయని లేఖలో ప్రస్తావించింది.
🚩ఇప్పటికే ఏపీ సమర్పించిన ప్రీ-ఫీజిబిలిటీ రిపోర్ట్ ను కేంద్ర పర్యావరణ శాఖ పరిధిలోని ఈఏసీ తిరస్కరించిన విషయాన్ని ఈ లేఖలో ఉటంకించింది. కేంద్ర జల సంఘం కూడా ప్రీ- ఫీజిబులిటీ రిపోర్టును తిరస్కరించాలని విజ్ఞప్తి చేశారు. డీపీఆర్ సమర్పించకుండా, టెండర్లు పిలవకుండా ఏపీని అడ్డుకోవాలని కోరారు.
🚩రెండు రాష్ట్రాల సీఎంల సమావేశంలో గోదావరి - బనకచర్ల లింక్ ప్రాజెక్టుపై చర్చను వాయిదా వేయాలని, తెలంగాణ ప్రభుత్వం పంపించిన ప్రతిపాదనలను అజెండాలో చేర్చాలని లేఖలో విజ్ఞప్తి చేసింది.