సర్వర్‌లో భూముల సవరణ విలువలు అప్‌డేట్ చేస్తున్నట్టు పెట్టిన మెసేజ్
నేటి నుంచి భూముల సవరణ విలువలు అమల్లోకి..
రాష్ట్రం ఏర్పాటైన తర్వాత మూడోసారి భూములు, ఆస్తుల విలువల సవరణ
బహిరంగ మార్కెట్‌లో ఉన్న రేటు ప్రకారమే విలువలు సవరించిన అధికారులు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తుల సవరించిన విలువలు శుక్రవారం నుంచి అమల్లోకి రానున్నాయి. ఇందుకు సంబంధించిన ప్రక్రియ పూర్తి కావడంతో నేటి నుంచి జరిగే రిజిస్ట్రేషన్లన్నీ కొత్త విలువల ప్రకారమే జరగనున్నాయి. వాస్తవానికి, గత నెలలోనే కొత్త విలువలు అమల్లోకి రావాల్సి ఉన్నా, వ్యవసాయ భూముల అప్‌లోడ్ ప్రక్రియలో కొంత గందరగోళం కారణంగా జూన్ 5వ తేదీనుంచి అమల్లోకి వస్తున్నాయి. ప్రస్తుతం వ్యవసాయ, వ్యవసాయేతర భూములు, ఆస్తులకు సంబంధించిన సవరించిన విలువలన్నింటినీ నేషనల్ ఇన్ఫర్మాటిక్స్ సెంటర్ (ఎన్‌ఐసీ) సహకారంతో కార్డ్, భూభారతి సాఫ్ట్‌వేర్లలో అప్‌లోడ్ చేశారు. గురువారం అర్ధరాత్రి సర్వర్‌ను డౌన్ చేసి విలువలన్నింటినీ అప్‌డేట్ చేసి మళ్లీ ఆన్ చేయనున్నారు.
దీంతో కొత్త విలువలు అమల్లోకి రానున్నాయి. రాష్ట్రం ఏర్పాటైన తర్వాత భూముల విలువలను సవరించడం ఇది మూడోసారి. 2021, 22 సంవత్సరాల్లో ఆరు నెలల వ్యవధిలో రెండుసార్లు సవరించిన ప్రభుత్వం రిజి్రస్టేషన్ ఫీజును కూడా పెంచింది. కాంగ్రెస్ ప్రభుత్వం రెండున్నరేళ్ల తర్వాత విలువలను సవరించాలని నిర్ణయించింది. అయితే, ఈసారి భూముల విలువల సవరణకు బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువలను ప్రాతిపదికగా తీసుకున్నారు.
బహిరంగ మార్కెట్‌లో ఉన్న విలువకు, బేసిక్ రిజిస్టర్ విలువకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని బట్టి ఈసారి విలువలు పెంచారు. మొత్తం మీద కనిష్టంగా 15 శాతం, గరిష్టంగా 100 శాతం మాత్రమే పెంచడం గమనార్హం. అయితే, బహిరంగ మార్కెట్‌కు, బేసిక్ రిజిస్టర్ విలువకు మధ్య పెద్దగా తేడా లేని ప్రాంతాల్లో పెంచలేదు. కాగా, ఈ విలువల సవరణ ద్వారా రాష్ట్ర ప్రభుత్వ ఖజానాకు ఏటా కనీసం రూ.1,200 కోట్ల నుంచి రూ.1,500 కోట్ల వరకు అదనపు ఆదాయం వస్తుందని రిజి్రస్టేషన్ల శాఖ అంచనా వేస్తోంది.

మేం సిద్ధం స్టాంపులు, రిజి్రస్టేషన్ల ఐజీ
రాష్ట్రంలో భూములు, ఆస్తుల విలువల సవరణకు తాము సిద్ధంగా ఉన్నామని స్టాంపులు, రిజిస్ట్రేషన్ల శాఖ ఐజీ రాజీవ్‌గాంధీ హనుమంతు వెల్లడించారు. గురువారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ ఇందుకు సంబంధించిన ప్రక్రియ అంతా పూర్తి చేశామని చెప్పా రు. వ్యవసాయ, వ్యవసాయేతర భూ ములు, ఆస్తుల విలువలు అప్‌లోడ్ చేయడం పూర్తి అయిపోయిందని, శుక్రవారం ఉదయం సర్వర్ ఆన్ చేయగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని గ్రామాలు, పట్టణాలు, నగరాల్లోని అన్ని సర్వే నంబర్లలో కొత్త విలువలు డిస్‌ప్లే అవుతా యని, వాటి ప్రకారం యథావిధిగా రిజి్రస్టేషన్ల ప్రక్రియ జరుగుతుందన్నారు.


