రెండు నెలల రాబడిలో 12 శాతం పాత అప్పుల వడ్డీలకే సరి
ఏప్రిల్, మే నెలల్లో ప్రభుత్వ ఖజానాకు రూ.39 వేల కోట్ల ఆదాయం
మొత్తం ఆదాయంలో 60% వడ్డీలు, సబ్సిడీలు, వేతనాలు, పింఛన్లకే..
సాక్షి, హైదరాబాద్: ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ప్రారంభమైన తర్వాత రెండు నెలల కాలంలో రాష్ట్ర ఖజానా నుంచి ఎక్కువ భాగం నిధులు అప్పులకు వడ్డీలు చెల్లించడానికే ఖర్చయ్యాయని గణాంకాలు చెబుతున్నాయి. గత ఏప్రిల్, మే..రెండు నెలల కాలంలో మొత్తం రూ.39 వేల కోట్లకు పైగా నిధులు ఖజానాకు సమకూరగా, అందులో 12 శాతం అంటే రూ.4,658 కోట్లు వడ్డీల కింద చెల్లించినట్లు వెల్లడిస్తున్నాయి. ఈ రెండు నెలల్లో మొత్తం నిధుల వ్యయాన్ని పరిశీలిస్తే వచ్చిన రాబడుల్లో 60 శాతం నాలుగు పద్దుల కిందే ఖర్చయ్యాయని, వడ్డీల చెల్లింపులతో పాటు ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్లు, సబ్సిడీల రూపంలో రూ.23 వేల కోట్లకు పైగా ఖర్చయ్యాయని కం్రప్టోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.
ఏ పద్దుకు ఎంతంటే...!
ఏప్రిల్, మే మాసాల్లో రెవెన్యూ రాబడుల కింద రూ. 28,441 కోట్లు ఖజానాకు సమకూరాయి. ఇందులో పన్ను ఆదాయం 26,093 కోట్లు కాగా, పన్నేతర ఆదాయం కింద రూ.1,803 కోట్లు, కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రాంట్ ఇన్ ఎయిడ్ రూపంలో రూ.544.99 కోట్లు వచ్చాయి. మూలధన రాబడుల రూపంలో మరో రూ.10,603 కోట్లు రాగా, అందులో అప్పుల రూపంలోనే రూ.10,595 కోట్లు వచ్చాయి. రెవెన్యూ, మూలధన రాబడులు కలిపి రూ.39,045.24 కోట్లు వచ్చినట్టు కాగ్ గణాంకాలు వెల్లడిస్తున్నాయి. ఇక మొత్తం రాబడుల్లో రెవెన్యూ వ్యయం కింద రూ.33,479 కోట్లు, మూలధన వ్యయం రూపంలో రూ. 3,932.36 కోట్లు ఖర్చయ్యాయి.
రెవెన్యూ వ్యయం కింద ఖర్చు చేసిన వాటిలో సబ్సిడీలకు రూ.5,809 కోట్లు, ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు, పింఛన్ల కోసం రూ.13 వేల కోట్లు చెల్లించగా, రెవెన్యూ పద్దు కింద దాదాపు రూ.10 వేల కోట్లు ఖర్చయ్యాయి. మొత్తం మీద రెండు నెలల కాలంలో రూ. 37,412.33 కోట్లు ఖర్చు కాగా, మొత్తం వ్యయ గణాంకాలను పరిశీలిస్తే రాష్ట్ర ప్రభుత్వంపై అనివార్య ఖర్చుల భారం పెరుగుతోందని ఆర్థిక నిపుణులు అభిప్రాయపడుతున్నారు. పన్ను ఆదాయం విషయానికి వస్తే ప్రతి పద్దు కింద గత ఏడాది రెండు నెలల కాలంతో పోలిస్తే పన్నులు పెరగడం గమనార్హం.


