
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ డీజీపీ జితేందర్‌ను ఉద్దేశించి.. మాజీ మంత్రి కేటీఆర్ ఎక్స్ వేదికగా చేసిన పోస్టును తెలంగాణ పోలీసు అధికారుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.గోపిరెడ్డి గురువారం ఒక ప్రకటనలో ఖండించారు.
‘ఎవరూ శాశ్వతంగా అధికారంలో ఉండరని, మాకూ ఒకరోజు వస్తుందని, అప్పుడు ప్రతి చర్యనీ సమీక్షిస్తామని’.. డీజీపీని ఉద్దేశించి బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్‌ను ఖండించారు. తెలంగాణ పోలీసు నిక్కచ్చగా, నిజాయితీగా ప్రజల భద్రత, రక్షణ కోసం చట్టం నిర్దేశించిన పరిధిలో పనిచేస్తుందని స్పష్టం చేశారు. ప్రజలను తప్పుదారి పట్టించే ఇలాంటి వ్యాఖ్యలను తీవ్రంగా ఖండిస్తున్నామని పేర్కొన్నారు. తెలంగాణ పోలీసుల స్థాయిని దెబ్బతీసే వ్యాఖ్యలను మానుకోవాలని కోరారు.