ఎవరో పురంధర్‌! | Telangana Municipal Election Results 2026 | Sakshi
Sakshi News home page

ఎవరో పురంధర్‌!

Feb 13 2026 7:31 AM | Updated on Feb 13 2026 7:31 AM

Telangana Municipal Election Results 2026

ఉదయం 8 నుంచి ఓట్ల లెక్కింపు.. మధ్యాహ్నం 2 వరకు ఫలితం  

బ్యాలెట్‌ బాక్సుల్లో అభ్యర్థుల భవితవ్యం

సాక్షి,  హైదరాబాద్‌: కొద్దిసేపట్లో మున్సిపల్‌ ఓట్ల లెక్కింపు ప్రారంభం కానుంది. ‘పురం’ధర్‌ ఎవరో తేలనుంది. శుక్రవారం ఉదయం 8కి కౌంటింగ్‌ చేపట్టి మధ్యాహ్నం 2 గంటలకల్లా ఫలితం వెల్లడించేలా ఏర్పాట్లు పూర్తయ్యాయి. గురువారం ఎన్నికల అధికారులు ఆయా కేంద్రాల్లో మాక్‌ కౌంటింగ్‌ నిర్వహించారు. తొమ్మిది కౌంటింగ్‌ కేంద్రాల్లో 106 టేబుళ్లు.. 418 మంది లెక్కింపు సిబ్బందిని నియమించారు. నగర శివారులోని 9 పురపాలికల్లోని 194 వార్డుల్లో మొత్తం 590 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. వీరి భవిత్యం బ్యాలెట్‌ బాక్సుల్లో భద్రంగా ఉంది. తొలుత పోస్టల్‌ బ్యాలెట్‌ ఓట్లను లెక్కించి, అనంతరం వార్డుల వారీగా ఓట్ల లెక్కింపు ప్రక్రియను మొదలు పెట్టనున్నారు.    

లెక్కింపు ఇలా.. 
రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్‌లో 14 టేబుళ్లు, మొయినాబాద్‌లో 14, ఇబ్రహీంపట్నంలో 12, శంకర్‌పల్లిలో 10, చేవెళ్లలో 9, ఆమనగల్‌లో 5 చొప్పున మొత్తం 64 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 265 మంది సిబ్బంది ఓట్లు లెక్కించనున్నారు. మేడ్చల్‌ జిల్లాలోని మూడు మున్సిపాలిటీల్లో మూడు కౌంటింగ్‌ కేంద్రాల్లో 42 టేబుళ్లను ఏర్పాటు చేశారు. 153 మంది సిబ్బంది ఓట్లు లెక్కించనున్నారు. 

రిజర్వేషన్లు ఇలా.. 
ఫలితాల వెల్లడి తర్వాత ఈ నెల 16న చైర్మన్, వైస్‌ చైర్మన్ల ఎంపిక ఉంటుంది. ఆమన్‌గల్, ఇబ్రహీంపట్నం, శంకర్‌పల్లి, చేవెళ్ల మున్సిపాలిటీలు జనరల్‌కు రిజర్వు కాగా, షాద్‌నగర్‌ బీసీ జనరల్‌కు, మొయినాబాద్‌ ఎస్సీ జనరల్‌కు రిజర్వ్‌ అయ్యాయి. అలియాబాద్‌ మున్సిపాలిటీ జనరల్‌ మహిళలకు, మూడు చింతపల్లి మున్సిపాలిటీ ఎస్సీ జనరల్‌కు, ఎల్లంపేట్‌ మున్సిపాలిటీ ఎస్టీ జనరల్‌కు రిజర్వయ్యాయి.  

భారీ భద్రత 
ఆమనగల్, ఇబ్రహీంపట్నం, షాద్‌నగర్, శంకర్‌పల్లి, మొయినాబాద్, చేవెళ్ల ఓట్ల లెక్కింపు కేంద్రాల వద్ద శుక్రవారం ఉదయం 6 నుంచి రాత్రి 11 గంటల వరకు బీఎన్‌ఎస్‌ఎస్‌ సెక్షన్‌ 163 అమల్లో ఉంటుంది. కౌంటింగ్‌ కేంద్రాల చుట్టూ 500 మీటర్ల పరిధిలో ఐదుగురికి మించి గుమిగూడటం నిషేధం. ఆదేశాలను ఉల్లంఘిస్తే చర్యలు తప్పవు.  
    – సుధీర్‌బాబు, ఫ్యూచర్‌ సిటీ కమిషనర్‌  

 

Advertisement
 
Advertisement
Advertisement