సాక్షి, హైదరాబాద్: పోలీస్ అధికారి అయినంత మాత్రాన అనుకున్నది చేస్తారా.. చట్టం చేతుల్లో ఉందని ఇష్టానుసారం వ్యవహరిస్తారా అని మధురానగర్ ఎస్‌ఐపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. మధ్యాహ్న భోజన విరామ సమయం వరకు కోర్టు గదిలోనే నిలబడాలని ఎస్‌ఐని ఆదేశించింది. పోలీస్ కమిషనర్ నుంచి నివేదిక తెప్పించుకొని అందజేయాలని ప్రభుత్వ న్యాయవాది ఆదేశిస్తూ.. విచారణ ఈ నెల 15కు వాయిదా వేసింది. మే 18న యూసఫ్‌గూడ ఇంటిలో ఉండగా పోలీసులు బలవంతంగా తీసుకెళ్లారని, వారిపై చర్యలతోపాటు పరిహారం ఇప్పించాలని కోరుతూ మాజీ ఎస్‌ఐ మహ్మద్ ఉస్మాన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
ఈ పిటిషన్‌పై జస్టిస్ టి.మాధవీదేవి ధర్మాసనం బుధవారం మరోసారి విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా ఎస్‌ఐ కోర్టుకు హాజరయ్యారు. ఫొటోలను పరిశీలించిన న్యాయమూర్తి.. పిటిషనర్ కేవలం లోదుస్తులు (లుంగీ, బనియన్) ధరించి ఉన్న స్థితిలోనే ఆయన్ని బయటకు లాగడం, నిస్సహాయ స్థితిలో రోడ్డుపై వదిలేయడానికి కారణాలను వివరించాలని ఎస్‌ఐను ప్రశ్నించారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే పోలీస్ కమిషనర్‌కు ఫిర్యాదు అందిందని హోం శాఖ ప్రభుత్వ న్యాయవాది మహేశ్ రాజే తెలిపారు.
2023లో పోలీసులపై దాడి చేసిన క్రిమినల్ కేసులో పిటిషనర్ కుమారుడు నిందితుడిగా ఉన్నాడని, పిటిషనర్ అతన్ని కాపాడుతున్నారన్నారు. న్యాయమూర్తి స్పందిస్తూ.. ‘పోలీస్ స్టేషన్‌కు ఎందుకు తీసుకెళ్తున్నారో మీరు పిటిషనర్‌కు చెప్పారా? ఆయన కుమారుడి ప్రమేయం ఏదైనా, రిటైర్డ్ అధికారి అయిన ఆయన్ని అలా బలవంతంగా లాగకూడదు కదా. అరెస్టుకు కారణాలను తెలియజేయడం మీ బాధ్యత. ఇప్పటివరకు మీరు (కుమారుడి) కేసు గురించి మాట్లాడలేదు, ఇప్పుడు ఇవన్నీ చెబుతున్నారు’అని పేర్కొన్నారు. జీపీ అభ్యర్థన మేరకు, పిటిషనర్ చేసిన ఫిర్యాదుపై విచారణ జరిపి కోర్టుకు నివేదిక సమరి్పంచాలని సీపీ ఆదేశించారు.


