కేంద్రానికి తేల్చిచెప్పిన తెలంగాణ
డీపీఆర్ తయారీ, పీఎఫ్‌ఆర్ మదింపు ప్రక్రియలను ఆపాల్సిందే
కేంద్ర జలశక్తి శాఖకు తెలంగాణ లేఖ
30న జలవివాదాల కమిటీ సమావేశాన్ని తలపెట్టిన కేంద్రం
సాక్షి, హైదరాబాద్: ఏపీ, తెలంగాణ మధ్య జల వివాదాల పరిష్కారానికి కేంద్ర జల సంఘం (సీడబ్ల్యూసీ) చైర్మన్ అధ్యక్షతన రెండు రాష్ట్రాల అధికారులతో ఇటీవల కేంద్ర జలశక్తి శాఖ ఏర్పాటు చేసిన కమిటీ ఈ నెల 30న మధ్యాహ్నం 3 గంటలకు ఢిల్లీలోని సీడబ్ల్యూసీ సమావేశ మందిరంలో సమావేశం కానుంది. ఈ మేరకు సీడబ్ల్యూసీలోని ప్రాజెక్టుల మదింపు విభాగ చీఫ్ ఇంజనీర్, కమిటీ సభ్య కార్యదర్శి రాకేశ్‌కుమార్ గత బుధవారం ఇరు రాష్ట్రాలకు మీటింగ్ నోటీస్ పంపించారు. అయితే పోలవరం–బనకచర్ల/నల్లమల సాగర్ డీపీఆర్ త యారీ ప్రక్రియతోపాటు ఆ ప్రాజెక్టు అక్రమ నిర్మాణానికి ఏపీ చేస్తున్న ప్రయత్నాలను, ఆ ప్రాజెక్టు ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ మదింపును కేంద్రం జల సంఘం తక్షణమే విరమించుకుంటనే ఈ కమిటీ సమావేశానికి హాజరవుతామని తెలంగాణ రాష్ట్రం స్పష్టం చేసింది.
కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ అధ్యక్షతన గత జూలై 16న ఢిల్లీలో తెలంగాణ, ఏపీ సీఎంలతో నిర్వహించిన సమావేశంలో సంప్రదింపుల ద్వారా జల వివాదాలను పరిష్కరించుకోవడానికి ఓ కమిటీని ఏర్పాటు చేసుకోవాలని నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. రెండు రాష్ట్రాల మధ్య నీటి విషయంలో అపరిష్కృతంగా ఉన్న ఆందోళనలపై సమగ్ర అధ్యయనం జరపడంతోపాటు వాటిని సాంకేతిక దృక్పథంతో పరిష్కరించి సమర్థవంతంగా, సమన్యాయంతో నీటి పంపకాలు జరిపేందుకు సాధ్యమైన పరిష్కారాలను సూచించడానికి ఈ కమిటీని కేంద్రం ఏర్పాటు చేసింది. మూడు నెలల్లోగా నివేదికను సమరి్పంచాలని కమిటీని కోరింది. ఇందుకోసం అవసరమైన ఇతర విభాగాల అధికారులు/నిపుణుల సేవలను వాడుకోవాలని కమిటీకి సూచించింది.
మీటింగ్ ఎజెండాలో ...
⇒ ఏపీ, తెలంగాణ మధ్య నీటి పంపకాలకు సంబంధించిన కీలక సమస్యలను తదుపరి చర్చల కోసం ఇరు రాష్ట్రాలు కమిటీ ముందు ఉంచాలి.
⇒ కమిటీలో చర్చించేందుకు ఆయా అంశాలకు సంబంధించిన సమాచారాన్ని కృష్ణానది యాజమ్యాన బోర్డు (కేఆర్‌ఎంబీ), గోదావరినది యాజమాన్య బోర్డు (జీఆర్‌ఎంబీ) అందించాలి.
⇒ కమిటీ సహకరించడంతోపాటు కమిటీ కార్యకలాపాల్లో పాల్గొనడానికి నిపుణులు/అధికారులను ఎంపిక చేయాలి.
⇒ చైర్మన్ అనుమతితో ఇతర ఏ అంశాలపైనా కమిటీ చర్చిస్తుంది.
సమావేశానికి హాజరు కావాలంటే....
పోలవరం–బనకచర్ల/ నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ ప్రక్రియతోపాటు ఆ ప్రాజెక్టు అక్రమ నిర్మాణానికి ఏపీ చేస్తున్న ప్రయత్నాలను, ఆ ప్రాజెక్ట్ ప్రీ ఫీజబిలిటీ రిపోర్ట్ మదింపునకు కేంద్ర జల సంఘం చేపట్టిన ప్రక్రియను తక్షణమే విరమించుకుంటేనే కమిటీ సమావేశానికి హాజరవుతామని తెలంగాణ రాష్ట్రం తేల్చి చెప్పింది. డీపీఆర్ తయారీ, పీఎఫ్‌ఆర్ మదింపు వంటి ప్రక్రియలు జరిగిపోయాక, చర్చలు జరిపినా ఫలితం ఉండదని, ఇలాంటి స్థితిలో సమావేశానికి రాలేమని స్పష్టం చేసింది. ఈ విషయంలో న్యాయపర చర్యలు తీసుకునేందుకు ఉన్న మార్గాలను అవసరమైతే పరిశీలిస్తామని తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రాహుల్ బొజ్జా ఇటీవల కేంద్ర జలశక్తి శాఖకు లేఖ రాశారు.
గత ఏడాది జులై 16న కేంద్ర జలశక్తి శాఖ మంత్రి ఆధ్వర్యంలో ఇరు రాష్ట్రాల సీఎంలతో జరిగిన సమావేశ ఎజెండాలో పోలవరం– బనకచర్ల అనుసంధానం ప్రాజెక్టుపై చర్చను చేర్చరాదని ఆ సమావేశానికి ముందే తాము లేఖ రాశామని తెలంగాణ గుర్తు చేసింది. కేంద్ర జలశక్తి శాఖ గత డిసెంబర్ 4న జారీ చేసిన సూచనలకు విరుద్ధంగా ఏపీ ప్రాజెక్టు నిర్మాణానికి అక్రమ చర్యలతోపాటు డీపీఆర్ తయారీ ప్రక్రియను చేపట్టడంతో తాము సుప్రీంకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశామని తెలియజేసింది. కేంద్ర జల సంఘం మార్గదర్శకాలకు విరుద్ధంగా ఈ ప్రాజెక్టు మదింపును సీడబ్లూసీ, కేంద్ర జలశక్తి శాఖ ఎలా చేపడతాయని తాము ఈ పిటిషన్‌లో సవాలు చేశామని పేర్కొంది.
మరోవైపు ఏపీ పోలవరం–నల్లమల్ల సాగర్ ప్రాజెక్టు డీపీఆర్ తయారీ ప్రక్రియను చేపట్టగా, సీడబ్ల్యూసీ ఆ ప్రాజెక్టు ప్రీఫీజిబిలిటీ రిపోర్ట్ మదింపు విషయంలో ముందడుగు వేసిందని ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ప్రక్రియలు పూర్తయితే వాటికి వ్యతిరేకంగా చర్చలు జరపడంలో అర్థం ఉండదని, అలా చేస్తే తమకు ఎలాంటి ఉపశమనం లభించదని స్పష్టం చేసింది.


