
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42% కోటాపై సర్కారు దృష్టి
అసెంబ్లీ ముందుకు పంచాయతీరాజ్ చట్ట సవరణ బిల్లు?
పార్టీల అభిప్రాయం తీసుకోవడం ద్వారా పైచేయి సాధించే వ్యూహం
శాసనసభ ద్వారా బిల్లును గవర్నర్‌కు పంపే ప్రణాళిక
అసెంబ్లీ ఆమోదించిన బిల్లు ఆధారంగా 42% రిజర్వేషన్లపై అధికారిక ఉత్తర్వులు?
సాక్షి, హైదరాబాద్: స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించేందుకు ఉన్న ఏ అవకాశాన్నీ వదులుకోకూడదని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా స్థానిక ఎన్నికల్లో మొత్తం రిజర్వేషన్లను 50 శాతానికి పరిమితం చేస్తూ గత బీఆర్‌ఎస్ ప్రభుత్వం తెచ్చిన చట్టానికి అసెంబ్లీలో సవరణను ప్రతిపాదించనుంది. 50 శాతం రిజర్వేషన్ల పరిమితిని ఎత్తివేస్తూ శనివారం నుంచి ప్రారంభం కానున్న వర్షాకాల సమావేశాల్లో బిల్లును ప్రవేశపెట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్టు సమాచారం.
పంచాయతీరాజ్ చట్టం–2018లోని సెక్షన్ 285 (ఏ)కు సవరణ ప్రతిపాదిస్తూ పెట్టే ఈ బిల్లుపై చర్చించి అన్ని రాజకీయ పక్షాల అభిప్రాయాలను తీసుకోవడం ద్వారా అటు చట్టబద్ధంగా, ఇటు రాజకీయంగా పైచేయి సాధించాలనేది ప్రభుత్వ ఉద్దేశంగా కనిపిస్తోంది. వాస్తవానికి ఇదే అంశంపై రాష్ట్ర మంత్రివర్గం చేసిన ఆర్డినెన్సును గవర్నర్ ద్వారా రాష్ట్రపతి ఆమోదానికి పంపారు.
ఆ ఆర్డినెన్సు రాష్ట్రపతికి వెళ్లి దాదాపు రెండు నెలలవుతున్నా ఇంకా అది పెండింగ్‌లోనే ఉంది. ఈ నేపథ్యంలో సాంకేతిక అంశాలు సానుకూలంగా ఉంటే ఆర్డినెన్సులో స్వల్ప మార్పుతో అసెంబ్లీలో బిల్లు పెట్టి మరోమారు గవర్నర్‌కు పంపడం ద్వారా ఒత్తిడి పెంచాలనే వ్యూహంతో ప్రభుత్వం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ మేరకు శనివారం జరిగే రాష్ట్ర మంత్రివర్గ భేటీలో అసెంబ్లీలో బిల్లు పెట్టడంపై తీర్మానం చేసే అవకాశం ఉంది.
కోర్టుల ముందుకు ‘ఏకాభిప్రాయం’!
ఈ బిల్లుపై ప్రధాన రాజకీయ పక్షాలైన బీఆర్‌ఎస్, బీజేపీ, ఎంఐఎం, సీపీఐల అభిప్రాయాలు తీసుకోవడం ద్వారా రిజర్వేషన్ల పరిమితి విషయంలో రాజకీయ ఏకాభిప్రాయం ఉందనే వాదనను కోర్టుల ముందు ఉంచవచ్చనేది కూడా ప్రభుత్వ ఆలోచనగా కనిపిస్తోంది.
మరోవైపు ఈ బిల్లు విషయంలో బీజేపీ వినిపించే అభిప్రాయాన్ని బట్టి ఆ పార్టీని ఇరుకున పెట్టాలని, తాము చేస్తున్న పోరాటాన్ని మరోమారు బీసీలకు వివరించేందుకు ఈ సమావేశాలను వేదికగా ఉపయోగించుకోవాలనే రాజకీయ ఎత్తుగడతో ప్రభుత్వం ముందుకెళుతోందని అంటున్నారు. ఈ బిల్లును అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదిస్తే, దీని ఆధారంగానే స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కలి్పస్తూ ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులు కూడా విడుదల చేయనుందని సమాచారం.