బొగ్గు లారీ ఢీకొని భూపాలపల్లి డీటీఓ వెంకన్న దుర్మరణం
17 రోజుల క్రితమే బదిలీపై భూపాలపల్లికి రాక
రోడ్డు ప్రమాదమా? లేక కుట్రకోణమా?
ఆ కోణంలోనూ విచారణ... నివేదిక త్వరగా ఇవ్వాలని ప్రభుత్వ ఆదేశం
భూపాలపల్లి/సాక్షిప్రతినిధి, వరంగల్/హైదరాబాద్: వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో బొగ్గులారీ ఢీకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణాశాఖాధికారి (డీటీఓ) దుర్మరణం చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. డీటీఓ మద్దోజు వెంకన్న(45) సోమవారం ఉదయం గణపురం మండలంలోని మోరంచపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ట్యాక్స్ చెల్లించని ఒక హార్వెస్టర్‌ను పట్టుకొని చెల్పూరు సమీపంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి తరలించారు.
తాను సైతం కారులో కార్యాలయం వద్దకు చేరుకుని రహదారిపై నిలబడి మళ్లీ వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాను పట్టుకున్న హార్వెస్టర్ డివైడర్ వైపు నుంచి కార్యాలయం లోపలికి వెళ్తుండగా భూపాలపల్లి నుంచి ఉప్పల్ వెళ్తున్న బొగ్గు లారీ హార్వెస్టర్ ముందు భాగాన్ని ఢీకొట్టి ఎడమవైపున ఉన్న డీటీఓ వెంకన్నపైకి దూసుకెళ్లింది. దీంతో అతను లారీ టైర్ల కింద పడి నడుము భాగం నుజ్జునుజ్జయింది. రవాణాశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని డీటీఓ వెంకన్నను ఆస్పత్రికి తీసుకెళ్ళేందుకు ప్రయతి్నంచినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతిచెందాడు. కాగా, వెంకన్న ఈ నెల 5వ తేదీనే భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. సరిగ్గా 17 రోజులకే ఈ సంఘటన జరగడంతో జిల్లా రవాణాశాఖలో విషాదం అలుముకుంది.
లారీడ్రైవర్ మహ్మద్ తస్లీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణపురం ఎస్‌ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వెంకన్న స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామం. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడున్నారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ వరంగల్‌లో స్పష్టం చేశారు.
కాగా, ఆయన పారి్థవదేహాన్ని హనుమకొండలో ఆశోక కాలనీలోని నివాసానికి తీసుకువచ్చారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ గౌడ్, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారదలు వెంకన్న పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు.
విచారణకు ఆదేశించిన ప్రభుత్వం
వెంకన్న మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదం యాదృచి్ఛకంగా జరిగిన రోడ్డు ప్రమాదమా? లేక కుట్రకోణం దాగి ఉందా? అన్నది విచారణలో తేలనుంది. రవాణాశాఖ కేంద్ర కార్యాలయంలో జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం.చంద్రశేఖర్ గౌడ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తేల్చటంతోపాటు, సాధారణ ప్రమాదమే అయి ఉంటే, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సిఫారసులు కూడా ఆయన ఇవ్వనున్నారు.వీలైనంత త్వరలో నివేదిక అందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది.
ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం: ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి
భూపాలపల్లి డీటీఓ వెంకన్న వాహనాల తనిఖీలు చేస్తుండగా బొగ్గు లారీ ఢీకొని చనిపోవటం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. కాగా డీటీఓ వెంకన్న మృతిపై రవాణాశాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ విచారం వ్యక్తం చేసింది. విధుల్లో ఉన్న సమయంలో లారీ ఢీకొని మృతి చెందాల్సిన పరిస్థితి రావటం దారుణమని, ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన కుటుంబానికి అసోసియేషన్ అండగా నిలుస్తుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని ప్రకటించారు.


