breaking news
district transport officer
-
వాహనాలు తనిఖీ చేస్తుండగా...
భూపాలపల్లి/సాక్షిప్రతినిధి, వరంగల్/హైదరాబాద్: వాహనాలు తనిఖీ చేస్తున్న క్రమంలో బొగ్గులారీ ఢీకొని జయశంకర్ భూపాలపల్లి జిల్లా రవాణాశాఖాధికారి (డీటీఓ) దుర్మరణం చెందాడు. ఈ ఘటన జయశంకర్ భూపాలపల్లి జిల్లా గణపురం మండలంలో సోమవారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. డీటీఓ మద్దోజు వెంకన్న(45) సోమవారం ఉదయం గణపురం మండలంలోని మోరంచపల్లి గ్రామం వద్ద జాతీయ రహదారిపై వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో ట్యాక్స్ చెల్లించని ఒక హార్వెస్టర్‌ను పట్టుకొని చెల్పూరు సమీపంలోని జిల్లా రవాణాశాఖ కార్యాలయానికి తరలించారు.తాను సైతం కారులో కార్యాలయం వద్దకు చేరుకుని రహదారిపై నిలబడి మళ్లీ వాహన తనిఖీలు చేస్తున్నారు. ఈ క్రమంలో తాను పట్టుకున్న హార్వెస్టర్ డివైడర్ వైపు నుంచి కార్యాలయం లోపలికి వెళ్తుండగా భూపాలపల్లి నుంచి ఉప్పల్ వెళ్తున్న బొగ్గు లారీ హార్వెస్టర్ ముందు భాగాన్ని ఢీకొట్టి ఎడమవైపున ఉన్న డీటీఓ వెంకన్నపైకి దూసుకెళ్లింది. దీంతో అతను లారీ టైర్ల కింద పడి నడుము భాగం నుజ్జునుజ్జయింది. రవాణాశాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని డీటీఓ వెంకన్నను ఆస్పత్రికి తీసుకెళ్ళేందుకు ప్రయతి్నంచినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన మృతిచెందాడు. కాగా, వెంకన్న ఈ నెల 5వ తేదీనే భూపాలపల్లికి బదిలీపై వచ్చారు. సరిగ్గా 17 రోజులకే ఈ సంఘటన జరగడంతో జిల్లా రవాణాశాఖలో విషాదం అలుముకుంది.లారీడ్రైవర్ మహ్మద్ తస్లీమ్‌ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గణపురం ఎస్ఐ రాజశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నారు. వెంకన్న స్వగ్రామం మహబూబాబాద్ జిల్లా మరిపెడ గ్రామం. మృతుడికి భార్య స్వప్న, ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడున్నారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం పూర్తిగా అండగా ఉంటుందని, ప్రమాదంపై సమగ్ర విచారణ జరిపిస్తామని రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌గౌడ్ వరంగల్‌లో స్పష్టం చేశారు.కాగా, ఆయన పారి్థవదేహాన్ని హనుమకొండలో ఆశోక కాలనీలోని నివాసానికి తీసుకువచ్చారు. రాష్ట్ర రవాణాశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్, టీపీసీసీ అధ్యక్షుడు బొమ్మ మహేశ్ గౌడ్, ఎంపీ డాక్టర్ కడియం కావ్య, ఎమ్మెల్యేలు నాయిని రాజేందర్ రెడ్డి, కేఆర్ నాగరాజు, హనుమకొండ, వరంగల్ కలెక్టర్లు చాహత్ బాజ్‌పాయ్, సత్యశారదలు వెంకన్న పార్థివదేహంపై పుష్పగుచ్ఛం ఉంచి శ్రద్ధాంజలి ఘటించారు. విచారణకు ఆదేశించిన ప్రభుత్వం వెంకన్న మృతి చెందిన ఘటనపై ప్రభుత్వం విచారణకు ఆదేశించింది. ఈ ప్రమాదం యాదృచి్ఛకంగా జరిగిన రోడ్డు ప్రమాదమా? లేక కుట్రకోణం దాగి ఉందా? అన్నది విచారణలో తేలనుంది. రవాణాశాఖ కేంద్ర కార్యాలయంలో జాయింట్ ట్రాన్స్‌పోర్టు కమిషనర్‌గా పనిచేస్తున్న ఎం.చంద్రశేఖర్ గౌడ్‌ను విచారణాధికారిగా నియమిస్తూ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్‌రాజ్ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ ప్రమాదానికి దారితీసిన పరిస్థితులను తేల్చటంతోపాటు, సాధారణ ప్రమాదమే అయి ఉంటే, భవిష్యత్తులో ఇలాంటి ప్రమాదాలు చోటుచేసుకోకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సిఫారసులు కూడా ఆయన ఇవ్వనున్నారు.వీలైనంత త్వరలో నివేదిక అందించాల్సిందిగా ప్రభుత్వం ఆదేశించింది. ఆ కుటుంబాన్ని ఆదుకుంటాం: ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిభూపాలపల్లి డీటీఓ వెంకన్న వాహనాల తనిఖీలు చేస్తుండగా బొగ్గు లారీ ఢీకొని చనిపోవటం పట్ల సీఎం రేవంత్‌రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వెంకన్న కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని, ఆ కుటుంబాన్ని అన్ని విధాలుగా ఆదుకుంటామని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించారు. కాగా డీటీఓ వెంకన్న మృతిపై రవాణాశాఖ టెక్నికల్ ఆఫీసర్స్ అసోసియేషన్ విచారం వ్యక్తం చేసింది. విధుల్లో ఉన్న సమయంలో లారీ ఢీకొని మృతి చెందాల్సిన పరిస్థితి రావటం దారుణమని, ఆయన మృతికి సంతాపం వ్యక్తం చేస్తున్నామని అసోసియేషన్ అధ్యక్షులు రవీందర్, ప్రధాన కార్యదర్శి సురేశ్‌రెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. ఆయన కుటుంబానికి అసోసియేషన్ అండగా నిలుస్తుందని, అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు సిద్ధమని ప్రకటించారు. -
అన్న హత్యకు సుపారీ ఇచ్చిన ఘనుడు.. మన డీటీఓ సార్ భద్రునాయక్
ఆయన జీవితం ఆద్యంతం వివాదాస్పదమే.. వృత్తిలో.. నిజ జీవితంలో.. పుట్టి పెరిగిన ప్రదేశంలో.. పనిచేసే చోట ఎక్కడైనా తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారుతూ వస్తున్న అతని నేర ప్రవృత్తి తార స్థాయికి చేరింది. పాపం పండటంతో తను పన్నిన కుట్రలన్నీ బయటపడ్డాయి. సొంత అన్నను హత్య చేసేందుకు కిరాయి హంతక ముఠాతో ఒప్పందం కుదుర్చుకుని, ఓ యువకుడి హత్యకు కారణమైన అతను పోలీసులకు దొరికిపోయాడు. ఇదంతా చేసింది ఓ రౌడీ షీటరో.. పాత నేరస్తుడో కాదు.. ఈ ఘనతలన్నీ మన డీటీఓ సార్ భద్రునాయక్వే.. వికారాబాద్: రెండేళ్ల క్రితం వికారాబాద్ డీటీఓగా విధులు చేపట్టిన భద్రునాయక్‌కు వివాదాస్పదమైన వ్యక్తిగా పేరుంది. జిల్లాలో లారీల్లో ఓవర్ లోడ్ (కెపాసిటీకి రెండింతలు) వేసేందుకు ఓనర్ల నుంచి నెలనెలా మూమూళ్లు తీసుకుంటాడనే ఆరోపణలున్నాయి. ఓవర్‌లోడ్ కారణంగా.. వేసిన కొద్ది రోజులకే రోడ్లన్నీ ధ్వంసమవుతున్నాయి. ఈ విషయాన్ని ఆర్అండ్బీ, పీఆర్ ఇంజనీరింగ్ అధికారులు బాహాటంగా చెబుతున్నారు. ఇక లైసెన్సులు, ఫిట్నెస్, ప్రధానంగా వ్యవసాయ ట్రాక్టర్ల రిజిస్ట్రేషన్ల సమయంలో అవినీతికి పాల్పడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పరిమిత రుసుముకు మూడు నుంచి పది రెట్లు ఎక్కువ మొత్తం వసూలు చేస్తాడని వాహనదారులు ఆరోపిస్తున్నారు. ఇతని తీరును నిరసిస్తూ ఏకంగా డీటీఓ ఆఫీసు ఎదుట ఆందోళన చేపట్టారు. వాహనదారులతో దురుసు ప్రవర్తన, దుర్భాషలాడటం వంటి కారణాలతో వివాదాస్పదమైన వ్యక్తిగా పేరు తెచ్చుకున్నారు. ఎఫ్ఐఆర్ చేయని పోలీసులు డీటీఓ భద్రునాయక్ తనను దుర్భాషలాడారని ఇటీవల ఓ వ్యక్తి చన్గొముల్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పత్రాలన్నీ సక్రమంగా ఉన్నప్పటికీ వాహనాన్ని అడ్డుకుని సీజ్ చేస్తానని బెదిరించాడని ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఈ సమయంలో పలువురు వాహనదారులు, ప్రజలు బాధితుడికి అండగా వచ్చారు. భద్రునాయక్ ఆగడాలపై మండిపడుతూ నిరసన వ్యక్తంచేశారు. ఇంత జరిగినా.. డీటీఓపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదు. ఇందులో కొందరు నేతలు, పోలీసు ఉన్నతాధికారులు కల్పించుకుని పీఎస్‌లోనే పంచాయితీ పెట్టి.. బాధితుడు ఫిర్యాదు వెనక్కి తీసుకునేలా ఒప్పించారనే ఆరోపణలు వచ్చాయి. ఇలా ఆయనపై కేసు నమోదు కాకుండా జిల్లా పోలీసులే గట్టెక్కించారని తెలిసింది. జిల్లా రవాణాధికారిని సూర్యాపేట పోలీసులు అరెస్టు చేశారనే వార్తలు శుక్రవారం సంచలనంగా మారాయి. పోలీసులు అతన్ని ఎందుకు అదుపులోకి తీసుకున్నారనే విషయాలపై శనివారం ఉదయం వరకు స్పష్టత లేకపోవడంతో ఎక్కడ చూసినా ఇదే చర్చ సాగింది. వసూళ్లకు ముఠా ఏర్పాటు రెండేళ్లుగా వికారాబాద్ డీటీఓగా విధులు నిర్వహిస్తు న్న భద్రునాయక్ అనేక వివాదాలకు తెరతీసినప్పటికీ ఆ శాఖ ఉన్నతాధికారులు నోరు మెదపక పోవడం అనుమానాలకు తావిస్తోంది. ఆదాయ వనరు లు సమకూర్చుకునేందుకు తన కార్యాలయానికి చెందిన కొందరు కింది స్థాయి ఉద్యోగులు, కానిస్టేబుళ్లు, ఆర్టీఏ బ్రోకర్లతో ఓ ముఠాను ఏర్పాటు చేసుకుని అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణలు ఉన్నా యి. ఈయన క్యాడర్ ఎంవీఐ అయినప్పటికీ తన పలుకుబడితో డీటీఓగా పోస్టింగ్ వేయించుకుని రెండేళ్లుగా వికారాబాద్‌లో తిష్ట వేయడం గమనార్హం. విచారణలో కొత్త కోణాలు సొంత అన్నను హత్య చేయించేందుకు రూ.కోటితో పాటు ఎకరం పొలం ఇచ్చేందుకు సుపారీ గ్యాంగ్‌తో ఒప్పందం చేసుకున్న భద్రునాయక్‌ను అరెస్టు చేసిన సూర్యాపేట పోలీసులు అతన్ని రిమాండ్‌కు తరలించిన విషయం తెలిసిందే. విచారణలో ఆయన పనిచేస్తున్న రవాణా శాఖతో పాటు అవినీతి నిరోధక శాఖల పనితీరుపై సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. అన్నను హత్య చేసేందుకు భారీ మొత్తంలో డబ్బులు ఇస్తానని ఒప్పందం కుదుర్చుకోవడం, భద్రునాయక్ అక్రమాస్తుల చిట్టాను ఏసీబీకి చెబుతానని సొంత అన్నే అతన్ని బెదిరిస్తూ రావడం, భద్రునాయక్ అనేక చోట్ల అక్రమ ఆస్తులు కలిగి ఉండటం అవినీతి నిరోధక, ఇన్కమ్ ట్యాక్స్ శాఖల నిఘా వైఫల్యాలను సూచిస్తోంది. తరచూ వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన ఆయన ఆగడాలను ఉపేక్షిస్తుండటం ఆర్టీఏ ఉన్నతాధికారుల డొల్లతనం, లోపాయికారీ ఒప్పందాలను ప్రస్ఫుటం చేస్తోంది. ప్రవీణ్ హత్య కేసును విచారణ చేస్తున్న సూర్యాపేట పోలీసులు భద్రునాయక్ అసలు స్వరూపాన్ని బట్టబయలు చేయగా.. అతనిపై చేసిన ఫిర్యాదును బుట్టదాఖలు చేయించి, ఎఫ్ఐఆర్ నమోదు కాకుండా చేసిన మన జిల్లా పోలీసుల తీరు విమర్శలకు తావిస్తోంది. -
వాహనాల వేగానికి కళ్లెం
సాక్షి, గుంటూరు : అతివేగం వలన జరిగే ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా రవాణాశాఖ అధికారులు రంగంలోకి దిగారు. స్పీడ్ గన్‌తో ప్రత్యేక తనిఖీలు నిర్వహిస్తున్నారు. జాతీయ, రాష్ట్ర, జిల్లా రహదారులపై నిర్దేశించిన వేగం కంటే ఎక్కువ వేగంతో ప్రయాణించే వాహనాలను స్పీడ్‌గన్‌తో గుర్తించి కేసులు నమోదు చేస్తున్నారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళితే... గుంటూరు జిల్లాకు ఒక స్పీడ్ గన్ను ప్రభుత్వం 2018లో అందించింది. ప్రతి రోజు ఒక మోటల్ వెహికల్ ఇన్స్పెక్టర్కు స్పీడ్ గన్‌తో జిల్లాలోని వివిధ రహదారుల్లో తనిఖీలు నిర్వహించే బాధ్యతను అప్పగించారు. స్పీడ్ గన్‌లో సంబంధిత రహదారిపై నిర్దేశించిన వేగాన్ని ముందుగానే సెట్టింగ్ చేస్తారు. రహదారిపై వాహనాలను స్పీడ్ గన్‌తో పరిశీలిస్తారు. నిర్దేశించిన వేగం కంటే అధిక వేగంతో ప్రయాణించే వాహనం ఫొటో తీసుకుంటారు. వాహనం నంబరు ఆధారంగా యజమానికి రూ.1500 అపరాధ రుసుం విధిస్తారు. అపరాధ రుసుం విధించిన వాహనాల వివరాలను ఆన్లైన్లో నమోదు చేయటం వలన వాహనంపై జరిగే ఇతర లావాదేవీలు అపరాధ రుసుం చెల్లిస్తేనే సాధ్యం అవుతాయి. అపరాధ రుసుం వివరాలను రిజిస్ట్రేషన్ సమయంలో అందించిన ఫోన్ నంబరుకు సంక్షిప్త సమాచార రూపంలో అందిస్తారు. జిల్లాలో అతివేగంగా ప్రయాణించే వాహనాలపై 2018 సంవత్సరంలో 1,559 కేసులు నమోదు చేసి, రూ.21.82 లక్షల అపరాధ రుసుం విధించారు. 2019 జూన్ 9వ తేదీ వరకు 1,881 కేసులు నమోదు చేశారు. రూ.26.33 లక్షల జరిమానా వేశారు. అధిక వేగంతో అనర్థాలు వాహన ప్రమాదంలో ప్రాణ నష్టానికి వేగం ప్రధాన కారణం. వాహనాలు గంటకు 20 నుంచి 30 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించినప్పుడు రహదారిపై ప్రమాదం జరిగిన వాహనంలో ప్రయాణిస్తున్న వారికి జరిగే గాయాల శాతం తీవ్రత తక్కువుగా ఉంటుంది. వీటి మరణాలు శాతం కూడా 10శాతానికి మించి ఉండదు. కాని వాహన వేగం 60 కిలోమీటర్ల నుంచి 80 కిలోమీటర్ల వరకు ఉంటే మాత్రం గాయాల శాతం తీవ్రత ఎక్కువుగా ఉండటంతో పాటు మరణాలు 90శాతం ఉంటుంది. ఇక 100 కిలోమీటర్లకు మించి వేగంతో ప్రయాణిస్తున్నప్పుడు ప్రమదాలు జరిగితే మాత్రం వాహనంలో రక్షణ పరికరాలైన ఎయిర్‌బెలున్సు ఉన్న అవి ఫెయిల్ అయ్యి ప్రమాదాలు జరిగే అవకాశం ఉందని నిపుణులు అభిప్రాయ పడుతున్నారు. రహదారుల పరిస్థితి కూడా వాహనాలు వేగంపై ప్రభావం చూపుతుంది. జిల్లాలోని అంతర్గత సింగిల్, డబుల్ రోడ్లు, స్థానిక పరిస్థితుల బట్టీ కూడా వాహన వేగం నియంత్రించాల్సి ఉంటుంది. ప్రస్తుతం అందుబాటులో ఉన్న అధునాతన వాహనాల్లో స్పీడ్ గంటకు 150 కిలోమీటర్ల పైనే ప్రయాణించే వీలు ఉంటుంది. స్థానికంగా ఉండే రహదారుల నిర్మాణం, పరిసరాల పరిస్థితుల ఆధారంగా అతి వేగంతో ప్రయాణించే వాహనం నియంత్రణ కోల్పోతుంది. వాహనాలు పక్కకు వెళితే చెట్లకు గుద్దుకోవటం, పక్కన ఉన్న కాల్వలోకి దూసుకుపోయి ప్రమాదాలు జరిగిన సందర్భాలు ఉన్నాయి.జాతీయ రహదారులకు 100 కిలోమీటర్లు, ఎక్స్‌ప్రెస్ హైవేలకు 120 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించే అవకాశం ఉంది. అన్ని రహదారులపై జనసమ్మర్థంగా ఉండే ప్రాంతాలు, మూలమలుపుల వద్ద, నారో బ్రిడ్జ్‌ల వద్ద, రోడ్డు క్రాసింగ్‌లు, సర్వీసు రోడ్డులకు వెళ్లే ప్రాంతాల్లో మాత్రం 10 కిలోమీటర్లు నుంచి 5 కిలోమీటర్ల వేగంతోనే ప్రయాణించాల్సి ఉంది. వేగం నిర్దేశించిన రహదారుల్లో లైట్ మోటర్ వెహికల్(నాన్ ట్రాన్స్‌పోర్టు) నో లిమిట్, లైట్ మోటర్ వెహికల్ (ట్రాన్స్‌పోర్టు) 65 కిలోమీటర్లు, మోటర్ సైకిల్ 50 కిలోమీటర్లు, ప్యాసింజర్/ గూడ్స్ వెహికల్ 65 కిలోమీటర్లు, మీడియం/హెవీ వెహికల్స్ 65 కిలోమీటర్లు, ట్రైలర్ 50 కిలోమీటర్లు వేగంతో ప్రయాణించాలని నిబంధన ఉంది. -
ఆయనో బీజేపీ నేత.. ఎలా దాడి చేశారో చూడండి!
రాంచీ: ఆయనో బీజేపీ నాయకుడు. తన పేరును, హోదాను వాహనంపై దర్జాగా రాసుకున్నాడు. కానీ అది నిబంధనలకు విరుద్ధం కావడంతో దానిని జిల్లా రవాణ అధికారి తొలగించారు. అంతే, ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. నలుగురు చూస్తున్నారన్న భయం కూడా లేకుండా బాహాటంగానే అధికారిపై దాడికి దిగాడు. అతనికి మీదకొచ్చి పిడిగుద్దులు కురిపించాడు. దుర్భాషాలు ఆడాడు. తిట్లదండకం ఎత్తుకున్నాడు. అధికారి ప్రతిఘటించడంతో ఆగాడు కానీ లేకుంటే ఇంకా దాడి చేసేవాడే.. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది. స్థానిక బీజేపీ నాయకుడు రాజధాని యాదవ్ లాతెహార్ జిల్లా ట్రాన్స్పోర్ట్ అధికారి (డీటీవో) ఎఫ్ బర్లాపై దాడికి దిగాడు. ఈ ఘటన కెమెరా కంటికి చిక్కింది. తన వాహనం మీద ఉన్న పేరు, హోదా స్టిక్కర్‌ను తీసివేయడంతో రాజధాని యాదవ్‌కు ఇలా పట్టరాని కోపం వచ్చింది. డీటీవోపై దాడిచేసిన ఆయనను అనంతరం పోలీసులు అరెస్టు చేశారు. -
రవాణ అధికారిపై బీజేపీ నేత దాడి
-
జిల్లా రవాణాశాఖ అధికారిగా శ్యాంనాయక్
ఆసిఫాబాద్: కుమ్రం భీమ్ జిల్లా రవాణా శాఖాధికారిగా అజ్మెర శ్యాంనాయక్ గురువారం బాధ్యతలు స్వీకరించారు. ప్రస్తుతం ఆసిఫాబాద్ ఎంవీఐగా పని చేస్తున్న శ్యాంనాయక్ కొత్త జిల్లా ఏర్పాటుతో జిల్లా అధికారిగా పూర్తి బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వాహనదారులకు మెరుగైన సేవలందిస్తామన్నారు. త్వరలో జిల్లా కేంద్రంలో కొత్త కార్యాలయ భవన నిర్మాణం పూర్తవుతుందని తెలిపారు.


