
రాంచీ: ఆయనో బీజేపీ నాయకుడు. తన పేరును, హోదాను వాహనంపై దర్జాగా రాసుకున్నాడు. కానీ అది నిబంధనలకు విరుద్ధం కావడంతో దానిని జిల్లా రవాణ అధికారి తొలగించారు. అంతే, ఆయనకు పట్టరాని కోపం వచ్చింది. నలుగురు చూస్తున్నారన్న భయం కూడా లేకుండా బాహాటంగానే అధికారిపై దాడికి దిగాడు. అతనికి మీదకొచ్చి పిడిగుద్దులు కురిపించాడు. దుర్భాషాలు ఆడాడు. తిట్లదండకం ఎత్తుకున్నాడు. అధికారి ప్రతిఘటించడంతో ఆగాడు కానీ లేకుంటే ఇంకా దాడి చేసేవాడే.. ఈ ఘటన జార్ఖండ్‌లో చోటుచేసుకుంది.
స్థానిక బీజేపీ నాయకుడు రాజధాని యాదవ్ లాతెహార్ జిల్లా ట్రాన్స్‌పోర్ట్ అధికారి (డీటీవో) ఎఫ్ బర్లాపై దాడికి దిగాడు. ఈ ఘటన కెమెరా కంటికి చిక్కింది. తన వాహనం మీద ఉన్న పేరు, హోదా స్టిక్కర్‌ను తీసివేయడంతో రాజధాని యాదవ్‌కు ఇలా పట్టరాని కోపం వచ్చింది. డీటీవోపై దాడిచేసిన ఆయనను అనంతరం పోలీసులు అరెస్టు చేశారు.