TG: ఇద్దరు ఎమ్మెల్యేలపై మరికాసేపట్లో తీర్పు | Telangana Assembly Speaker Decision on Two MLAs Defection Pleas Details | Sakshi
Sakshi News home page

TG: ఇద్దరు ఎమ్మెల్యేలపై మరికాసేపట్లో తీర్పు

Jan 15 2026 11:09 AM | Updated on Jan 15 2026 12:18 PM

Telangana Assembly Speaker Decision on Two MLAs Defection Pleas Details

సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాయితీ ఎంతకూ తెగడం లేదు. పది మంది ఎమ్మెల్యేలలో.. ఐదుగురిపై దాఖలైన పిటిషన్లను శాసనసభ స్పీకర్‌ ఇదివరకే కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇవాళ అదీ సంక్రాంతి పండుగపూట.. మరో ఇద్దరి వ్యవహారంపై తీర్పు ఇవ్వబోతున్నారు. 

తమ పార్టీ సింబల్‌పై నెగ్గిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య(చేవెళ్ల), పోచారం శ్రీనివాసరెడ్డి(బాన్సువాడ)లు ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్‌ఎస్‌ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పీకర్‌ గడ్డం ప్రసాద్‌కుమార్‌ మరికాసేపట్లో తీర్పు ఇవ్వనున్నారు. ఇంతకు ముందులాగే పిటిషన్లు డిస్మిస్‌ చేస్తారా?.. అనర్హత వేటేమైనా వేస్తారా?.. నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి. అయితే.. 

మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సంజయ్‌(జగిత్యాల) కాకుండా దానం నాగేందర్‌(ఖైరతాబాద్‌), కడియం శ్రీహరి(స్టేషన్‌ ఘన్‌పూర్‌) ఇప్పటిదాకా స్పీకర్‌ను కలిసి వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీళ్ల విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది. 

అంతకు ముందు.. గత నెలలో(డిసెంబర్‌ 17న) ఆరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు(ఖమ్మం), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్‌చెరు), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(గద్వాల్‌), టి. ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్‌) పిటిషన్లను స్పీకర్‌ కొట్టిపారేశారు. ఈ ఐదుగురు సాంకేతికంగా ఇంకా బీఆర్‌ఎస్‌ సభ్యులుగానే కొనసాగుతున్నారని తీర్పు సందర్భంగా స్పష్టం చేశారాయన. అయితే స్పీకర్‌ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న బీఆర్‌ఎస్‌.. ఈ అంశంలో విచారణ ముగిశాక కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement