breaking news
defection complaints
-
ఫిరాయింపుల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ఫిరాయింపుల ఎపిసోడ్లో బిగ్ ట్విస్ట్ చోటు చేసుకుంది. పెండింగ్‌లో ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేల్లో ఒకరైన.. ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ బుధవారం నోటీసులు జారీ చేశారు. ఈ నెల 30వ తేదీన తన ఎదుట విచారణకు హజరు కావాలని నోటీసుల్లో ఆయన పేర్కొన్నారు. కారు గుర్తుపై గెలిచిన 10 మంది ఎమ్మెల్యేలు పార్టీ ఫిరాయించారంటూ బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసిన విషయం తెలిసిందే. అయితే స్పీకర్ చర్యలకు తీసుకోవడం లేదంటూ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో కోర్టు డెడ్లైన్లు, వార్నింగ్‌లతో స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ చేపట్టారు. ఇప్పటికే ఏడుగురిని విచారించిన స్పీకర్.. వాళ్లు పార్టీ మారినట్లు ఆధారాల్లేవంటూ పిటిషన్లు కొట్టేస్తూ తీర్పు ఇచ్చారు. అరికపూడి గాంధీ, గూడెం మహిపాల్ రెడ్డి, బండ్ల కృష్ణ మోహన్, ప్రకాష్ గౌడ్, తెల్లం వెంకట్రావు, పోచారం శ్రీనివాస్ రెడ్డి, కాలే యాదయ్యలకు క్లీన్ చిట్ ఇచ్చారు.ఈ క్రమంలో మిగిలిన ముగ్గురు డాక్టర్ సంజయ్, దానం నాగేందర్, కడియం శ్రీహరిలను విచారణ జరపాల్సి ఉంది. అయితే హఠాత్తుగా ఎమ్మెల్యే దానం నాగేందర్‌కు తాజాగా నోటీసులు ఇచ్చారు. అలాగే దానం నాగేందర్ పై అనర్హత పిటిషన్ వేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డికి సైతం స్పీకర్ నోటీసులు ఇచ్చారు. వీరిద్దరు ఈ నెల 30న విచారణకు హాజరుకావాలని వేర్వేరుగా ఇచ్చిన నోటీసులలో పేర్కొన్నారు. ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ల విషయంలో చేస్తున్న జాప్యంపై ఈనెల 19వ తేదిన స్పీకర్ కు సుప్రీంకోర్టు కోర్టు ధిక్కర నోటీసులు జారీ చేసింది. ఈ పిటిషన్లపై చర్యలు తీసుకోకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించించింది. ఈ నేపథ్యంలో నాగేందర్‌కు స్పీకర్ నోటీసులు ఇవ్వడం ఆసక్తిగా మారింది. దానం నాగేందర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా కొనసాగుతూనే 2024 సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ బీ ఫామ్ పై ఎంపీగా పోటీ చేయడం తెలిసిందే. -
TG: ఇద్దరు ఎమ్మెల్యేలపై తీర్పు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఫిరాయింపు ఎమ్మెల్యేల పంచాయితీ ఎంతకూ తెగడం లేదు. పది మంది ఎమ్మెల్యేలలో.. ఐదుగురిపై దాఖలైన పిటిషన్లను శాసనసభ స్పీకర్ ఇదివరకే కొట్టేసిన సంగతి తెలిసిందే. ఇవాళ అదీ సంక్రాంతి పండుగపూట.. మరో ఇద్దరి వ్యవహారంపై తీర్పు ఇవ్వబోతున్నారు. తమ పార్టీ సింబల్‌పై నెగ్గిన ఎమ్మెల్యేలు కాలె యాదయ్య(చేవెళ్ల), పోచారం శ్రీనివాసరెడ్డి(బాన్సువాడ)లు ఫిరాయింపులకు పాల్పడ్డారంటూ బీఆర్ఎస్ ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. ఈ పిటిషన్లపై స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ మరికాసేపట్లో తీర్పు ఇవ్వనున్నారు. ఇంతకు ముందులాగే పిటిషన్లు డిస్మిస్ చేస్తారా?.. అనర్హత వేటేమైనా వేస్తారా?.. నిర్ణయం ఎలా ఉండబోతోందో చూడాలి. అయితే.. మిగిలిన ముగ్గురు ఎమ్మెల్యేల్లో సంజయ్(జగిత్యాల) కాకుండా దానం నాగేందర్(ఖైరతాబాద్), కడియం శ్రీహరి(స్టేషన్ ఘన్పూర్) ఇప్పటిదాకా స్పీకర్‌ను కలిసి వివరణ ఇచ్చుకోలేదు. దీంతో వీళ్ల విషయంలో ఎలాంటి తీర్పు ఉంటుందనే ఆసక్తి కొనసాగుతోంది. అంతకు ముందు.. గత నెలలో(డిసెంబర్ 17న) ఆరికెపూడి గాంధీ(శేరిలింగంపల్లి), తెల్లం వెంకట్రావు(ఖమ్మం), గూడెం మహిపాల్ రెడ్డి(పటాన్చెరు), బండ్ల కృష్ణ మోహన్ రెడ్డి(గద్వాల్), టి. ప్రకాశ్ గౌడ్(రాజేంద్రనగర్) పిటిషన్లను స్పీకర్ కొట్టిపారేశారు. ఈ ఐదుగురు సాంకేతికంగా ఇంకా బీఆర్ఎస్ సభ్యులుగానే కొనసాగుతున్నారని తీర్పు సందర్భంగా స్పష్టం చేశారాయన. అయితే స్పీకర్ నిర్ణయాన్ని తీవ్రంగా తప్పుబడుతున్న బీఆర్ఎస్.. ఈ అంశంలో విచారణ ముగిశాక కోర్టును ఆశ్రయించే అవకాశం కనిపిస్తోంది. -
'ముఖ్యమంత్రులు ఇలాంటి పనిచేయొచ్చా?'
విజయవాడ: డబ్బుతో అధికారంలోకి రావడం.. అధికారంలోకి వచ్చాక డబ్బు సంపాదించుకోవడం రాజకీయ పార్టీలకు అలవాటుగా మారిందని 'సాక్షి' ఎడిటోరియల్ డైరెక్టర్ కే రామచంద్రమూర్తి అన్నారు. నాయకులు అధికారంలోకి వచ్చేందుకు అలివికాని హామీలు ఇస్తున్నారని చెప్పారు. తీరా అధికారం చేజిక్కించుకున్నాక ఆ హామీలను విస్మరిస్తున్నారని ఆయన చెప్పారు. జనచైతన్య వేదిక ఆధ్వర్యంలో ఆదివారం విజయవాడ ఎంబీ భవన్లో 'పార్టీ ఫిరాయింపులు- ప్రమాదంలో ప్రజాస్వామ్యం' అనే అంశంపై సదస్సు ప్రారంభమైంది. ఈ సదస్సులో కే రామచంద్రమూర్తి మాట్లాడుతూ రాజకీయం దళారీ వ్యవస్థగా మారడం ఆందోళనకరం అని ఆయన అన్నారు. ముఖ్యమంత్రులే స్వయంగా ఫిరాయింపులను ప్రోత్సహించడం రాజ్యాంగ ఉల్లంఘనే అని, స్పీకర్లు రాజ్యాంగబద్ధంగా వ్యవహరించాలి అని సూచించారు. వెంకయ్యలాంటి వ్యక్తులు ఫిరాయింపులపై ఆందోళన వ్యక్తం చేయడమే కాకుండా రాజ్యాంగ సవరణకు ప్రయత్నం చేయాలని కోరారు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఎమర్జెన్సీ పరిస్థితులు కనిపిస్తున్నాయని చెప్పిన ఆయన రాజమండ్రి పరిసరాల్లో పోలీసు రాజ్యం నడుస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు.


